డీకేటీల మాయాజాలం

ABN , First Publish Date - 2022-05-09T05:30:00+05:30 IST

కలికిరి మండలంలో డీకీటీ భూములు పట్టా భూములుగా రూపాంతరం చెంది రియల్టర్ల చేతుల్లోకి వెళ్ళిన ఘటనలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

డీకేటీల మాయాజాలం
పరాధీనమైన ప్రభుత్వ బండ

ప్రభుత్వ బండకు పట్టా ఇచ్చిన వెంటనే అమ్మకం

ఇతర దళితులకు చెందిన డీకేటీలు పట్టాలుగా మారిన వైనం

దళారుల పేరుతో వరుసగా రిజిస్ట్రేషన్లు, పాసు పుస్తకాల జారీ

ప్లాట్లు కొనుగోలు చేసిన జనం గగ్గోలు


కలికిరి, మే 9: కలికిరి మండలంలో డీకీటీ భూములు పట్టా భూములుగా రూపాంతరం చెంది రియల్టర్ల చేతుల్లోకి వెళ్ళిన ఘటనలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో చాలా వరకు దళితులకు చెందిన డీకేటీ భూములు చేతులు మారినట్టు వెలుగులోకి వస్తున్నాయి. రియల్టర్లు, దళారీల మధ్య తలెత్తిన వివాదాలు ఇంతవరకూ గుట్టు చప్పుడు కాకుండా జరిగిన వాటిని బహిర్గతం చేస్తున్నాయి. ఈ మధ్యలో సూర్యనారాయణ అనే దళితుడు తమ తాత ముత్తాతల కాలం నుంచి తమ పొలం మధ్యలో ఉన్న ప్రభుత్వ బండకు డీకేటీ పట్టా ఇచ్చేశారని, ఆ వెంటనే రియల్టర్లు దానిని పట్టాగా మార్పులు చేయించి కొనుగోలు చేశారని రెవెన్యూ అధికారులకు వరుసగా ఫిర్యాదులు చేయడంతో మొత్తం డీకేటీల లోగుట్టు వ్యవహారాలు బట్టబయలవుతు న్నాయి. ఇవన్నీ రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక ఊహించని మొత్తాల్లో డబ్బులు చేతులు మారాయని కూడా బహిరంగంగా చెబుతున్నారు. కలికిరి-కలకడ మార్గంలో క్రాస్‌ రోడ్డుకు సైనిక్‌ పాఠశాలకు మధ్య వందలాది ఎకరాల డీకేటీ భూములున్నాయి. గతంలో ఎకరా పది వేలు కూడా చేయని వాటికి పట్టణ అభివృద్ధితో కొంచెం విలువ పెరిగింది. అయినా అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నందువల్ల దళితులు భూములు అమ్ముకోలేకపోయారు. ఈలోగా ఇవే భూముల మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి మంజూరు కావడంతో రియల్టర్లు, దళారీలు వీటిపై కన్నేశారు. ఎకరా రూ.ఐదు, పది లక్షలకు కొనుగోలు చేసి అనధికారిక అగ్రిమెంట్లు రాసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరా రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్లు పలుకుతోంది. ఆ తరువాత రెవెన్యూ అధికారులను చక్కదిద్దుకుని డీకేటీలను పూర్తిగా పట్టా భూములుగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకుని వెంటనే దళితుల వద్ద నుంచి పక్కా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెబుతున్నారు. సూర్యనారాయణ అనే దళితుడి ఫిర్యాదుతో ప్రస్తుతం సర్వే నెంబర్‌ 1097, 1098 భూముల వ్యవహారాలు వెలుగులోకి రాగా 591, 592, 593, 594లతో పాటు మరో 20 సర్వే నెంబర్లలోని భూముల విషయంలో కూడా ఇదే తంతు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇక సన్యాసివాండ్లపల్లె రోడ్డుకు ఇరువైపులా ఒక్కో నెంబరుకు ఐదారు సబ్‌ డివిజన్‌ నెంబర్లు కేటాయించి అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేసుకుని పూర్తిగా లేఔట్లు కూడా సిద్ధమయ్యాయి. ఇందులో ప్రభుత్వ బండకు డీకేటీ మంజూరు చేసి ఆ వెంటనే వెబ్‌ల్యాండ్‌లో పట్టాగా మార్చి అమ్మేసిన వైనం వివాదం రేపుతోంది. డీకేటీ భూముల అసలు సర్వే నెంబర్లకు సబ్‌ డివిజన్‌ నెంబర్లు సృష్టించి, వాటికి తిరిగి ఏ,బీ,సీ,డీలు కేటాయించి వెబ్‌ల్యాండ్‌లో పట్టా భూములుగా నమోదు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆరోపణలపై విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని అంటున్నారు. 


టీడీపీ ప్రభుత్వ ఉత్తర్వులతో వెసులుబాటు

ఇదిలా వుండగా తన మ్యానిఫెస్టో హామీలో భాగంగా టీడీపీ ప్రభుత్వం 1954కు ముందు ఇచ్చిన డీకేటీ భూములను పట్టాలుగా మార్చుకోవచ్చంటూ 2018 నవంబరు 16న జీవో నెం.575 జారీ చేసింది. దీని ప్రకారం డీకేటీల మార్పు అధికారం జిల్లా కలెక్టరుకు మాత్రమే ఉండేది. దీనికి వక్రభాష్యం చెబుతూ స్థానిక అధికారులు మార్పు చేసే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అక్రమాలకు తెరతీసినట్లు కూడా చెబుతున్నారు. 


కొనుగోలుదార్ల గగ్గోలు 

చాలా మంది దళితుల వద్ద నుంచి కొనుగోలు చేసిన రియల్టర్లు వేసిన లేఔట్లలో వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. నాలుగు లేన్ల రహదారి వస్తోందన్న ఆశతో ఒక్కొక్కరు రూ.10 నుంచి 20 లక్షలు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశారు. తీరా ఈ భూములన్నీ అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు జరిగినవి బయటపడటంతో కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలైంది. ఇంకా కొంతమంది అడ్వాన్సులు చెల్లించారు. అనధికార లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను అనుమతించకపోవడంతో ఇవన్నీ రిజిస్ట్రేషన్ల స్థాయిలో ఆగిపోయాయి. దీంతో ఎక్కడ మోసపోయామో తెలుసుకోవడానికి కొనుగోలుదారులు ప్లాట్లు అమ్మిన రియల్టర్ల చుట్టూ తిరుగుతున్నారు.


విచారణ చేయిస్తున్నాం

- రమణి, తహసీల్దారు

డీకేటీలను పట్టా భూములుగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడం గురించి ఫిర్యాదులు నా దృష్టికి కూడా వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వ బండకు పట్టా ఇవ్వడంపై విచారణకు ఆదేశించాము. అసలు అక్కడ బండ ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. అవకతకలకు సంబంధించి స్పష్టమైన వివరాలను అందజేస్తే వాటిపై కూడా విచారణ చేయిస్తాము.



Read more