Abn logo
Jun 24 2021 @ 00:41AM

మాయా ‘ఉద్యోగ విప్లవం’!

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు నిరుద్యోగులు ఎదురు చూస్తున్న జాబ్‌ క్యాలండర్‌ను ప్రకటించారు. ఇది హర్షణీయమే. కానీ మన రాష్ట్రంలో ప్రతి ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పుచ్చుకుని నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నారు. ముఖ్యమంత్రి పాలన పగ్గాలు చేపట్టిన ఈ రెండేళ్లలోనూ మరో 6 లక్షల మంది నిరుద్యోగులు క్యూలో నిలబడి ఉన్నారు. ఈ పరిస్థితిలో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి ప్రకటించిన ‘జాబ్‌ క్యాలండర్‌ ’ వివరాలను చూసి నిరుద్యోగులు విస్తుపోయారు. చంద్రబాబు హయాంలో ఏర్పడిన 2.30లక్షల ఉద్యోగాల ఖాళీలను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని వైసీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించి, రెండేళ్ళు మిన్నకుండి ఇప్పుడు కేవలం 10,143 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామని చేసిన ప్రకటనతో నిరుద్యోగ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నిరుద్యోగుల్లో అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని మరో జాబ్‌ క్యాలండర్‌ను ప్రకటించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.


వాస్తవంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ఉద్యోగాలలో ఏవీ కొత్త ఉద్యోగాలు కావు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నిజమైన ఖాళీల భర్తీకి ఒక్క పోస్టుకు కూడా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో 1.22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశామని శుక్రవారం ముఖ్యమంత్రి చేసిన ప్రకటన హాస్యాస్పదం. ముఖ్యమంత్రి ప్రకటించిన ఉద్యోగాలలో 1965 సిసిఏ రూల్స్‌ వర్తించే ఉద్యోగాలు ఎన్ని? రెగ్యులర్‌ కాదనుకుంటే కనీసం కాంట్రాక్టు లేబర్‌ చట్టం వర్తించే ఉద్యోగాలు ఎన్ని? అదయినా ప్రకటన చేసి ఉంటే అర్థమయ్యేది. 1,84,264 రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇందులో ప్రధాన భాగం గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన వారే ఉన్నారు. 1,21,518 మందిగా ఉన్న వీరిలో ఏ ఒక్కరికీ జీతంతో పాటు ఏ అలవెన్సులూ లేవు. కేవలం 15 వేల రూపాయల జీతాలిస్తూ వీరిని రెగ్యులర్‌ ఉద్యోగాల ఖాతాలో చూపుతున్నారు.


అవుట్‌ సోర్సింగ్‌ విభాగంలో 3,99,791 ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో ప్రథమ తాంబూలం వాలంటీర్ల వ్యవస్థకే ఇవ్వాలి. 2,59,565 మందిని కేవలం 5 వేల రూపాయల గౌరవ వేతనంతో నియమించిన ముఖ్యమంత్రి వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతూ బడాయి పోతున్నారు. 5 వేల గౌరవ వేతనం మినహా వీరికి ఇఎస్‌ఐ, పిఎఫ్‌, గ్రాట్యుటి, బోనస్‌ వంటివేవీ వర్తింప చేయలేదు. చట్టప్రకారం ఇవన్నీ తప్పని సరి అయినా, ప్రభుత్వం తప్పుడు పద్ధతిలో వాలంటీర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నది. ఆర్‌టిసిలో 51వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు నుంచే ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని, ప్రజా రవాణా విభాగంలోకి విలీనం చేసుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రకటన చేసుకోవటం హాస్యాస్పదంగా ఉంది.


అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను 95 వేల మందిని ‘ఆప్కాస్‌’లో విలీనం చేసి కొత్త ఉద్యోగాల కింద చూపుతున్నారు. వాస్తవంగా వీరందరినీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రెగ్యులర్‌ చేస్తామన్నారు. కానీ ఆ హామీ మరిచి ‘ఆప్కాస్‌’ లో విలీనం చేయటమే ఘనకార్యంగా చెబుతున్నారు. విలీనం తర్వాత నెలల తరబడి జీతాలు లేక కార్మికులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.


కరోనా కాలంలో తాత్కాలికంగా ఆరు నెలల ఉద్యోగాల పేరుతో తీసుకున్న కార్మికులకు నేటికీ మొదటి వేవ్‌ వేతనాలే పెండింగ్‌లో ఉన్నాయి. రెండవ వేవ్‌లోనూ వీరి సమస్యలు పరిష్కారం కాలేదు. తాత్కాలిక ఉద్యోగాల పేరుతో తీసుకున్న వీటిని కూడా ‘ఉద్యోగ విప్లవం’లో భాగంగా చూపారు. ఎంతకాలం ఉంచుతారో తెలియని ఈ ఉద్యోగాలు భర్తీ చేసిన పోస్టులు ఎలా అవుతాయి. ప్రభుత్వం తీరు ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా తయారయింది.


ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగులో ఉన్నాయి. కరోనా కాలంలో సైతం ప్రాణాలకు తెగించి, రక్షణ పరికరాలు లేకపోయినా విధులు నిర్వర్తించారు. ఇచ్చే చాలీచాలని కనీస వేతనమైనా ప్రతి నెలా వస్తుందా అంటే అదీ లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా వుంది. వీరికి 8వేల రూపాయలు వేతనం ఇస్తుండగా 16 వేల రూపాయలు వేతనం ఇస్తున్నామని ప్రభుత్వమే స్వయంగా అబద్ధాలు ప్రచారం చేయటం అన్యాయం.


అక్టోబరు 26, 2019న నాటి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి పేరుతో జి.ఓ.ఆర్‌.టి.నెం.549ని విడుదల చేశారు. 8 నెలలు కావస్తున్నా ఈ జి.ఓ.అమలు కాలేదు. అమలు చేయమని కార్మికులు ఈ 8 నెలల కాలంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టినా పట్టించుకోని ప్రభుత్వం 16 వేల వేతనం అమలు చేస్తున్నట్టు నిర్లజ్జగా ప్రకటించుకుంటోంది.


వైసీపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొస్తామని ప్రకటించింది. తర్వాత హోదా తీసుకురాలేమని చేతులెత్తేసారు. వాలంటీర్లకు మెరుగైన ఉద్యోగాలు వచ్చేవరకు ప్రజలకు సేవ చేస్తారు, గౌరవ వేతనం పొందుతారని పేర్కొని ఇప్పుడు వాటినే ప్రభుత్వ ఉద్యోగాల కింద జమకట్టి ప్రచారం చేస్తున్నారు. అన్ని పనులకు వాలంటీర్ల వ్యవస్థను కేంద్రంగా చేసుకొని వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. అంగన్‌వాడీ, సంఘమిత్రలు, ఆశావర్కర్లు వంటి స్కీం వర్కర్లకు వేతనాలు పెంచినట్టు చెప్పుకొచ్చారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం వీరికి ఎప్పుడో పెంచిన వేతనాలను అమలుపరచమని స్కీం వర్కర్లు పెద్దఎత్తున పోరాడారు. ఇప్పటికీ పోరాడుతున్నారు. కేంద్రప్రభుత్వం పెంచిన వేతనం అమలు పరచటం మినహా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోగా తామే పెంచినట్టుగా ఫోజు పెట్టడం ఎంతవరకు సమంజసం.


ఏపీ లోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని ప్రకటించారు. రెండేళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇలా స్థానికులకు ఇచ్చారో మాత్రం ప్రకటించలేదు. రాష్ట్రంలో పన్నెండు చోట్ల ఎస్‌ఇజడ్‌లు నడుస్తున్నాయి. కానీ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అన్న నియమం ఎక్కడా అమలు కావటం లేదు. రాష్ట్రంలో సహజ సంపద, బ్రహ్మాండమైన వనరులున్నా ఉపయోగించుకోవటం చేతకాక, ప్రైవేటు పరిశ్రమలలో యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మాటలు ఒక రకంగా చేతలు మరో రకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అపహాస్యం పాలవుతున్నది.


భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు 10,143 పోస్టులేనా? తిరుమలతిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న 8వేల పోస్టుల గురించి ఎందుకు ప్రకటనలో పేర్కొనలేదు. విద్యా విధానంలో మార్పులు తెస్తామంటున్నారు. 25 వేల టీచర్‌ పోస్టులు ఖాళీల గురించి ప్రస్తావించరు. యూనివర్శిటీలలో 2013 నుంచి 2 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు కోర్టు కేసులతో నింపకుండా ఆపారు. వీటిని ఎలా, ఎప్పుడు భర్తీ చేస్తారు.


పోలీసు విభాగంలో 8వేల పోస్టులు ఖాళీలు పెట్టుకొని 450 ఖాళీలనే ప్రకటించటంలో ఆంతర్యం ఏమిటి? గ్రూప్‌1, 2లలో 36 పోస్టులే ఖాళీలు చూపారు. ఎపిపిఎస్‌సి పరిధిలో ఖాళీగా ఉన్న 2 వేల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ పోస్టుల కోసం ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగ యువకులు వయసు మీరుతుందన్న ఆందోళనలో ఉంటే 36 పోస్టులే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించడం న్యాయమా!?


గ్రూప్‌ 1, 2 పోస్టులకు ఐదారు లక్షల మంది కనీసంగా దరఖాస్తు చేసుకుంటారు. కోట్లాది రూపాయల ఆదాయం దరఖాస్తుల అమ్మకం ద్వారానే వస్తుంది. వాస్తవం ఇది కాగా, 2 వేల పోస్టులు పక్కన పెట్టి 36 ప్రకటించటం వెనుక కారణాలు ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.


గవర్నమెంటు కాంట్రాక్టులు అన్నీ నిరుద్యోగ యువతకే ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తామన్నారు. ఇప్పటివరకు ఎంతమంది నిరుద్యోగులకు కాంట్రాక్టులు ఇచ్చారో ప్రభుత్వం చెప్పలేదు. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యను, వారిలో వయసు మీరిపోతున్నదన్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇచ్చిన హామీలకు కట్టుబడి వ్యవహరించాలి.

కందారపు మురళి

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు

ప్రత్యేకంమరిన్ని...