ఆస్పత్రుల మాయా బజార్‌!

ABN , First Publish Date - 2022-05-23T09:46:13+05:30 IST

ఇక్కడ ఫొటోలో కనిపిస్తోంది హైదరాబాద్‌ కోఠీలో పక్కపక్కనే ఉన్న రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.

ఆస్పత్రుల మాయా బజార్‌!

  • ఒకే భవనంలో 2 యూపీహెచ్‌సీలు.. దగ్గర్లోనే 3 పీహెచ్‌సీలు 
  • 46 మండలాల్లో ఒక్క పీహెచ్‌సీ లేదు
  • అందుబాటులో వైద్యసేవలు లేక ఇక్కట్లు 
  • జనాభా ఆధారంగా వైద్యశాలల ఏర్పాటుపై దృష్టి
  • లక్ష మందికి సీహెచ్‌సీ, 20వేల మందికి పీహెచ్‌సీ
  • కీలక సంసర్కణ దిశగా  వైద్యశాఖ అడుగులు


హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ఇక్కడ ఫొటోలో కనిపిస్తోంది హైదరాబాద్‌ కోఠీలో పక్కపక్కనే ఉన్న రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. రెండూ ఒక భవనంలో ఉన్నాయి. ఒకటి సుల్తాన్‌ బజార్‌ యూపీహెచ్‌సీ, మరోకటి ఇస్లామియా బజార్‌ యూపీహెచ్‌సీ. వీటికి సరిగ్గా 50 మీటర్ల దూరంలో కోఠీలోని రీజనల్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్పేర్‌ ట్రైనింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన మరో యూపీహెచ్‌సీ ఉంది. దానికి  పక్కనే ప్రభుత్వ ప్రసూతి వైద్యాలయం ఉంది. అంటే.. వంద మీటర్ల పరిఽధిలో మూడు యూపీహెచ్‌సీలు, ఒక ప్రభుత్వాస్పత్రి ఉన్నాయి. అలాగే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి సమీపంలోనే మున్సురాబాద్‌ ఆరోగ్య కేంద్రం ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, లేమూరు, రాచలూరులలో మూడు చోట్ల పీహెచ్‌సీలున్నాయి. ఈ మూడింటి మధ్య దూరం కనీసం 15 కిలోమీటర్లు కూడా ఉండదు. పక్కపక్కనే ఎందుకు ఏర్పాటు చేశారనేది అంతుచిక్కని ప్రశ్న. ఇలా సమీపంలోనే ఏర్పాటై ఉన్న ప్రభుత్వాస్పత్రులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. కొన్నిచోట్ల ఒకే భవనంలో రెండు ఆస్పత్రులున్నాయి. 33 యూపీహెచ్‌సీలు జిల్లా వైద్యాధికారి కార్యాలయ ప్రాంగణంలో ఉన్నట్లు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. అలాగే బోధనాస్పత్రుల్లోనూ యూపీహెచ్‌సీలున్నాయి. వాస్తవానికి టీచింగ్‌ ఆస్పత్రి ఉంటే, అందులో యూపీహెచ్‌సీని ఏర్పాటు చేయాల్సిన ఔచిత్యం ఏమిటో అర్థం కాదు.


గతంలో ఎటువంటి శాస్త్రీయ ధృక్ఫథం లేకుండా ఇష్టారాజ్యంగా వాటిని ఏర్పాటు చేశారు. జనాభా అవసరాల మేరకు ఎక్కడ ఏర్పాటు చేయాలో అక్కడ చేయలేదు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, ఒత్తిడుల మేరకు వారికిష్టమైన చోట ఏర్పాటు చేశారు. అన్ని ఒకే దగ్గర ఉండటంతో ఆస్పత్రులు లేని చోట ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల గ్రామీణ ప్రజలు పీహెచ్‌సీలకు వెళ్లాలంటే 15-20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలోని వజినేపల్లి గ్రామస్తులు సర్కారు దవాఖానాకు వెళ్లాలంటే 25 కిలోమీటర్ల దూరంలోని మేళ్ల చెరువుకు వెళ్లాల్సివస్తోంది. దీంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు బదులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. 


శాస్త్రీయ విధానమే లేదు

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఇప్పటికీ 46   మండలాల్లో పీహెచ్‌సీలను ఏర్పాటు చేయలేదు. 2012 నాటి ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌) నివేదిక ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 20 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి. మైదాన ప్రాంతాల్లో ప్రతీ 30 వేల జనాభాకు ఒక పీహెచ్‌సీ ఉండాలి. ఆ లెక్కన రాష్ట్రంలో కనీసం 1400 పీహెచ్‌సీలు ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 604 పీహెచ్‌సీలు, 232 అర్బన్‌ పీహెచ్‌సీలు ఉన్నాయి. 4693 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. రాష్ట్ర జనాభాలో 51 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో 49 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివిసిస్తున్నారు. పీహెచ్‌సీలన్నీ గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ప్రతి 30 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అది కూడా వారికి సమీపంలో ఉండాలి.


కానీ కొన్ని పీహెచ్‌సీలు గ్రామాలకు చాలా దూరంగా ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్స్‌  ఏర్పాటనేది ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. దీంతో కొన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో విపరీతమైన ఓపీ ఉంటోంది. కొన్నిచోట్ల జీరో ఓపీ నమోదు అవుతోంది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది విషయంలోనూ ఇదే ధోరణి ఉంది.  కొన్నిచోట్ల డిప్యూటేషన్ల పేరుతో ఒకే కేంద్రంలో పాతుకుపోతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ఉండాల్సిన సంఖ్యలో కూడా వైద్యులు, నర్సులు లేరు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో  వైద్య సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల పరిధిలోని వైద్యశాలల్లో ఎక్కువమంది ఉంటే... గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో కనీస వైద్య సిబ్బంది కూడా ఉండటం లేదు.  పట్టణ ప్రాంతాల్లో ఉన్న వైద్యశాలలు కూడా ప్రజలకు అందుబాటులో కాకుండా దూరంగా ఉన్నాయి. ఒకే దగ్గర  ఒకటి రెండు ఆస్పత్రులు కలపి ఉంటున్నాయి. 


సర్వేకు సిద్ధమైన సర్కారు..

పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల స్వరూపం ఎలా ఉంది? వాటి పరిఽఽధిని రీఆర్గినైజేషన్‌ చేయడం ఎలా? ఎంత జనాభాకు పీహెచ్‌సీల, సీహెచ్‌సీలు ఉండాలి? శాస్త్రీయంగా వాటి ఏర్పాటు ఎలా ఉండాలన్న అంశాలపై ప్రభుత్వం ఒక సర్వే చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయం ఇప్పటికే మంత్రిమండలి సమావేశంలో రెండుమూడుసార్లు చర్చకు కూడా వచ్చినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అశాస్త్రీయంగా ఏర్పాటైన ఆస్పత్రుల విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో వీటిపై ఒక ప్రముఖ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సర్వే చేయించాలని సర్కారు భావిస్తోంది. తొలుత పాపులేషన్‌ను మ్యాపింగ్‌ చేసి, తద్వారా అవుట్‌ రిచ్‌ ప్రొగ్రామ్స్‌ (ప్రజల వద్దకే వెళ్లి అందించే వైద్య సేవలు) క్లినికల్‌ ప్రొగ్రామ్స్‌ (పీహెచ్‌సీల్లో అందించేవి)ను ప్రజలకు అందించాలనుకుంటోంది. జనాభా ఆధారంగా వైద్య సేవలందించాలనే అతి పెద్ద సంసర్కణకు శ్రీకారం చుట్టబోతోంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను రీఆర్గినైజేషన్‌ చేయబోతోంది. లక్ష జనాభాకు ఒక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, 20 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. 

Updated Date - 2022-05-23T09:46:13+05:30 IST