ధర తక్కువ.. రక్షణ ఎక్కువ

ABN , First Publish Date - 2021-06-20T08:57:26+05:30 IST

ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) సంస్థ అతి తక్కువ ధరకే అత్యధిక రక్షణ కల్పించే కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తేనుంది! హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిచిన ఐఐఎల్‌..

ధర తక్కువ.. రక్షణ ఎక్కువ

అదే మా టీకా ప్రత్యేకత.. మార్చిలో అందుబాటులోకి!

ముందు దేశీయ విక్రయాలు.. ఆ తర్వాతే ఎగుమతులు

కొత్త యూనిట్‌లో నవంబరులో ఉత్పత్తి

సింగిల్‌ డోస్‌ వ్యాక్సినే ఉత్తమం

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఐఐఎల్‌ ఎండీ ఆనంద్‌కుమార్‌ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) సంస్థ అతి తక్కువ ధరకే అత్యధిక రక్షణ కల్పించే కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తేనుంది! హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిచిన ఐఐఎల్‌.. ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. చౌకగా టీకాను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ‘లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ వైరస్‌ వ్యాక్సిన్‌’ను తయారు చేస్తోంది. ఇది టీకాల తయారీలో అత్యంత విజయవంతమైన విధానం. ఈ పద్ధతిలో బతికున్న వైర్‌సను జీవచ్ఛవంలా చేసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు. ఫలితంగా సుదీర్ఘకాలం పాటు వైరస్‌ నుంచి రక్షణ కల్పించేందుకు ఇది దోహదపడుతుంది. తమది ‘ధర తక్కువ.. రక్షణ ఎక్కువ’ టీకా అని ఐఐఎల్‌ ఎండీ కె.ఆనంద్‌ కుమార్‌ చెప్పారు. దేశంలోని ప్రజలందరికీ టీకా అందేలా చూడడానికే తొలి ప్రాధాన్యమిస్తామని, ఆ తర్వాతే ఎగుమతులు చేస్తామని వివరించారు. టీకా అభివృద్ధి, మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుంది? తదితర అంశాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. 


మీరు అభివృద్ధి చేస్తున్న టీకా ఏ దశలో ఉంది?

గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయంతో కలిసి కొడాన్‌ డీఆప్టిమైజ్డ్‌ లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ వైరస్‌ వ్యాక్సిన్‌ను ఐఐఎల్‌ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం జంతువులపై పరీక్షలు తుది దశలో ఉన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన పరీక్షల్లో టీకా భద్రత, సమర్థత డేటా సంతృప్తికరంగా ఉంది.


మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?

జంతువులపై పరీక్షలు పూర్తయిన తర్వాత త్వరలోనే మనుషులపై పరీక్షలను ప్రారంభించే వీలుంది. అనుమతులు లభించే దాన్ని బట్టి 2022 మార్చిలో వ్యాక్సిన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. 


టీకా ధర ఎలా ఉంటుంది?

మాది లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్‌. అందువల్ల చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఒక డోసు తీసుకోవాలా లేక రెండు డోసులు తీసుకోవాలా? అన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే ఇప్పుడున్న వ్యాక్సిన్లంటికన్నా దీర్ఘకాలం ఇమ్యూనిటీని ఇస్తుంది.


మీ వ్యాక్సిన్‌ ఏ విధంగా భిన్నమైంది?

లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్‌ చాలా మంచి యాంటీ బాడీ రెస్పాన్స్‌ ఇస్తుంది. సెల్‌ మీడియేటెడ్‌ ఇమ్యూనిటీ రెస్పాన్స్‌ను ప్రేరేపిస్తుంది. ఇదే మా వ్యాక్సిన్‌ ప్రత్యేకత. వైర్‌సలో వచ్చే స్వల్ప మ్యుటేషన్లపై కూడా పని చేస్తుంది.


టీకాలను ఎగుమతి చేసే ఆలోచన ఉందా?

దేశంలోనే అనేక కోట్ల డోసుల అవసరం ఉంది. దేశీయ ప్రజలకు తక్కువ ధరకు సమర్థమైన వ్యాక్సిన్‌ను అందించడమే మా ప్రథమ ప్రాధాన్యం. దేశీయ సరఫరాకు మించి డోసులు ఉంటే ఎగుమతుల అంశాన్ని పరిశీలిస్తాం. 


ఇతర కంపెనీలకు ఫిల్‌ అండ్‌ ఫినిష్డ్‌ డోసులను తయారు చేసి ఇచ్చే ప్రణాళికలు ఉన్నాయా?

అదనపు ఫిల్‌ అండ్‌ ఫినిష్డ్‌ డోసుల తయారీ సామర్థ్యాలను కంపెనీ సమకూర్చుకుంది. అనుమతి లభించిన వెంటనే ఇతర కంపెనీల వ్యాక్సిన్లను తయారు చేయడానికి కొంత సామర్థ్యాన్ని కేటాయిస్తాం. 


కొవాగ్జిన్‌ డ్రగ్‌ సబ్‌స్టాన్స్‌ తయారీ ప్రారంభించారా?

కొవాగ్జిన్‌ కోసం డ్రగ్‌ సబ్‌స్టాన్స్‌ తయారీ ప్రక్రియను ప్రారంభించాం. రెండు దశల్లో దీన్ని తయారు చేస్తాం. దీని కోసం ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌లో మార్పులు చేశాం. మొదటి దశలో నెలకు 30 లక్షల డోసులను తయారు చేస్తాం. రెండో దశలో అదనంగా నెలకు మరో 50-60 లక్షల డోసులను ఉత్పత్తి చేయనున్నాం. కొత్త యూనిట్‌లో వీటిని తయారు చేస్తాం. నవంబరులో కొత్త యూనిట్‌ అందుబాటులోకి వస్తుంది. 


సింగిల్‌ డోసు టీకా వల్ల ప్రయోజనాలు ఏంటి?

సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కోట్ల మందికి వ్యాక్సిన్‌ తయారీ, రవాణా, రెండుసార్లు వేయడానికి భారీగా ఖర్చు అవుతుంది. ఇది దేశ ఆరోగ్య వ్యవస్థకు పెనుభారంగా మారుతుంది. కాబట్టి దీర్ఘకాలం ఇమ్యూనిటీని ఇచ్చే సింగిల్‌ డోస్‌ టీకా ఉత్తమమైంది.


ఇంకా ఐఐఎల్‌ ఏయే వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది?

హెపటైటిస్‌ ఏ, మెజిల్స్‌-రుబెల్లా వ్యాక్సిన్లు ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. చికున్‌గున్యా వ్యాక్సిన్‌ మొదటి దశ పరీక్షల్లో ఉంది. డెంగ్యూ వ్యాక్సిన్‌ను జంతువులపై పరీక్షించాం. త్వరలోనే మొదటి దశ మనుషులపై పరీక్షలకు అనుమతి కోరనున్నాం. 


అతిపెద్ద టీకా తయారీ సంస్థ!

ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌  లిమిటెడ్‌ (ఐఐఎల్‌). హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ బయోఫార్మాస్యుటికల్‌ సంస్థ.. మానవ వ్యాక్సిన్లు, పశువుల ఔషధాలను ఉత్పత్తి చేస్తోంది. 50 దేశాలకు టీకాలను ఎగుమతి చేస్తోంది. దేశంలో డీపీటీ, టీటీ, హెపటైటిస్‌ బి టీకాలను పెద్దఎత్తున సరఫరా చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ)లో భాగంగా 1982లో ఐఐఎల్‌ను ఏర్పాటు చేశారు. 1999లో కంపెనీగా మార్చారు. ఐఐఎల్‌కు హైదరాబాద్‌లో రెండు, ఊటీ, న్యూజిలాండ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు తయారీ యూనిట్లు ఉన్నాయి.


హైదరాబాద్‌ సమీపంలోని కరకపట్ల వద్ద ఉన్న యూనిట్‌లో హ్యూమన్‌ వ్యాక్సిన్లను, పశు ఔషధాలను తయారు చేస్తోంది. కొవాగ్జిన్‌ డ్రగ్‌ సబ్‌స్టాన్స్‌ తయారీ కోసం ఈ యూనిట్‌ను నవీకరించింది. హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో రూ.75 కోట్లతో కొత్త వైరల్‌ యాంటీజెన్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది నవంబరు నాటికి సిద్ధం కానుంది. దీంతో కంపెనీ వైరల్‌ వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం 35% పెరగనుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌తో పాటు ఇతర వ్యాక్సిన్లను తయారీ చేయడానికి వీలుగా బీఎ్‌సఎల్‌-3 ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తున్నారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0 మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ కింద ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు ఐఐఎల్‌కు కేంద్రం 60 కోట్లు ఇచ్చింది.

Updated Date - 2021-06-20T08:57:26+05:30 IST