పైరవీల జోరు

ABN , First Publish Date - 2022-06-29T05:13:44+05:30 IST

రెవెన్యూశాఖలో బదిలీలకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు అవకాశం కల్పించడంతో పైరవీలు జోరందుకున్నాయి. మరో రెండు రోజులే గడువు ఉండ డంతో ఉద్యోగులు పైరవీలు ముమ్మరం చేశారు. తమకు నచ్చిన చోటుకు బదిలీ అయ్యేందుకు ఉన్నతాధికారులకు కాకాపడుతున్నారు.

పైరవీల జోరు
రెవెన్యూశాఖ బదిలీలపై అధికార్లు కసరత్తు చేస్తున్న కలెక్టరేట్‌ కార్యాలయం ఇదే.


 రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు
 నచ్చిన చోటు కోసం ఉద్యోగుల ప్రయత్నాలు
 కలెక్టరేట్‌లో తిష్ఠ వేసేందుకు లాబీయింగ్‌
 నేడో, రేపో తుదిజాబితా
(కలెక్టరేట్‌)

రెవెన్యూశాఖలో బదిలీలకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు అవకాశం కల్పించడంతో పైరవీలు జోరందుకున్నాయి. మరో రెండు రోజులే గడువు ఉండ డంతో ఉద్యోగులు పైరవీలు ముమ్మరం చేశారు. తమకు నచ్చిన చోటుకు బదిలీ అయ్యేందుకు ఉన్నతాధికారులకు కాకాపడుతున్నారు. కలెక్టరేట్‌లో ఏళ్లుగా పాతుకుపోయిన వారు అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఎలాగైనా అక్కడే తిష్ఠవేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్నారు. వాస్తవానికి ఈ నెల 17 లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం గతంలో  ఆదేశించిం ది. అయితే కొన్ని కారణాలతో ఈ బదిలీల గడువును  ఈ నెలాఖరు వరకు పెంచింది. ఇప్పటికే కొన్ని శాఖలకు సంబంధించి బదిలీలు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద వ్యవస్థగా ఉన్న రెవెన్యూ శాఖలో బదిలీలు అంత వేగంగా జరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలు పైబడి ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి.  అలాగే, మూడు సంవత్సరాలు పూర్తికాని వారు కూడా వారి అవసరాలను బట్టి బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లెక్కన జిల్లాలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో పాటు సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు సుమారు 80 నుంచి 100 మంది వరకు బదిలీలు కావచ్చని కలెక్టరేట్‌ వర్గాలు చెబుతున్నాయి. మరో 100 నుంచి 120 వరకు గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వోలు)కు కూడా బదిలీలు జరుగుతాయని చెబుతున్నారు. వీరిని జిల్లాలో పలు మండల రెవెన్యూ కార్యాలయాలతో పాటు, ల్యాండ్‌ అక్విజేషన్‌, కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాలకు బదిలీలు చేయాల్సి ఉంది. అయితే, రెవెన్యూశాఖ మంత్రిది ఇదే జిల్లా కావడంతో కొందరు ఉద్యోగులు తమకు అనువుగా ఉన్న చోటుకు బదిలీ చేసుకునేందుకు పైరవీలు ముమ్మరంగా కొనసాగిస్తోన్నారు. కలెక్టరేట్‌లో గత కొంత కాలం నుంచి పాతుకుపోయిన వారు చాలామంది ఉన్నారు. బదిలీల సమయంలో వీరు కల్టెరేట్‌లోనే ఒక విభాగం నుంచి మరో విభాగానికి బదిలీ అవుతున్నారే తప్ప బయట ప్రాంతాలకు వెళ్లడం లేదు. అక్కడ ఉన్నతాధికారులను కాకాపట్టి కలెక్టరేట్‌లోనే తిష్ఠ వేస్తున్నారు. వీరి హవానే కలెక్టరేట్‌లో కొనసాగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నేడో, రేపు బదిలీల తుది జాబితాను ప్రకటించేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సారి ఇలాంటి పైరవీలకు అవకాశం లేకుండా బదిలీలు ప్రక్రియ ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. చూడాలి మరి నిబంధనల ప్రకారం బదిలీలు చేస్తారా? లేక పైరవీలకు పెద్దపీట వేస్తారా? అని.

Updated Date - 2022-06-29T05:13:44+05:30 IST