కోస్తాకు ‘తీవ్ర’ ముప్పు

ABN , First Publish Date - 2022-05-11T08:11:37+05:30 IST

ఒడిశా వైపు వెళుతుందనుకున్న ‘అసాని’ తీవ్ర తుఫాన్‌ దిశ మార్చుకొని కోస్తా వైపు దూసుకొస్తోంది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న..

కోస్తాకు ‘తీవ్ర’ ముప్పు

దిశ మార్చుకుని కోస్తావైపు దూసుకొస్తున్న తుఫాన్‌

నేడు ఉభయ గోదావరి మధ్య తీరం దాటే చాన్స్‌

మచిలీపట్నం వద్ద అంటున్న కొందరు నిపుణులు

తర్వాత విశాఖ వైపు పయనం.. మళ్లీ సముద్రంలోకి

అనంతరం ఒడిశా వరకు పయనించి బలహీనం

కృష్ణా నుంచి విశాఖ వరకు రెడ్‌ అలర్ట్‌

నేడు కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం

తీరంలో గంటకు 85 కి.మీ. వేగంతో గాలులు

ఓడరేవుల్లో పదో నంబరు హెచ్చరిక

పంటలకు నష్టం.. విద్యుత్‌కు అంతరాయం?

వాహన రాకపోకలపైనా ఆంక్షలకు సన్నద్ధం

విపత్తుల శాఖతో కేంద్రహోంశాఖ కార్యదర్శి సమీక్ష


విశాఖపట్నం, మే 10(ఆంధ్రజ్యోతి): ఒడిశా వైపు వెళుతుందనుకున్న ‘అసాని’ తీవ్ర తుఫాన్‌ దిశ మార్చుకొని కోస్తా వైపు దూసుకొస్తోంది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న రిడ్జ్‌ ప్రభావంతో సోమవారం రాత్రి అసాని దిశ మార్చుకుని విశాఖపట్నం, మచిలీపట్నం దిశగా వస్తోంది. విశాఖ నుంచి కృష్ణా జిల్లా వరకూ భారీ నుంచి అతిభారీ, కుంభవృష్టి వర్షాలు కురవనున్నాయని, తీరం వెంబడి బలమైన పెనుగాలులు వీస్తాయని, తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ‘రెడ్‌’ అలర్ట్‌  జారీచేసింది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అసాని పశ్చిమ వాయవ్యంగా దిశ మార్చుకుని మంగళవారం ఉదయం నుంచి గంటకు 25 కి.మీ. వేగంతో పయనిస్తోంది. రాత్రికి కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 190 కి.మీ, విశాఖపట్నానికి దక్షిణ నైరుతిగా 300 కి.మీ, గోపాల్‌పూర్‌కు నైరుతిగా 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్యంగా పయనించి బుధవారం ఉదయానికి కోస్తా దిశగా పయనించి ఉభయ గోదావరి జిల్లాల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.


ఆ తర్వాత బలహీనపడి తుఫాన్‌గా మారి, అక్కడ నుంచి తొలుత ఉత్తరంగా, తర్వాత ఉత్తర ఈశాన్యంగా విశాఖ వరకు తీరం వెంబడి పయనిస్తుంది. విశాఖ సమీపంలో తిరిగి సముద్రంలో ప్రవేశించి తీరానికి సమాంతరంగా పయనించి ఒడిశా వైపు పయనిస్తూ గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుంది. 


స్పష్టత ఇవ్వని ఐఎండీ

‘అసాని’ ఎక్కడ తీరం దాటుతుందో ఐఎండీ స్పష్టత ఇవ్వడం లేదు. బుధవారం ఉదయానికి విశాఖ, కాకినాడ తీరాలకు సమీపంగా వస్తుందని, తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనించి కాకినాడ-విశాఖ మధ్యన సముద్రంలో ప్రవేశించి అక్కడ నుంచి తీరానికి సమాంతరంగా పయనిస్తూ గురువారం ఉదయానికి ఒడిశా వైపు వెళుతూ బలహీనపడుతుందని తెలిపింది. కొందరు నిపుణులు మాత్రం.. తీవ్ర తుఫాన్‌ మంగళవారం రాత్రి బలహీనపడి తుఫాన్‌గా మారుతుందని, బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటుతుందని, ఆ తరువాత దిశ మార్చుకుని తీరం వెంబడి పయనించి విశాఖ, కాకినాడ మధ్య తిరిగి సముద్రంలో ప్రవేశించి ఒడిశా వైపుగా తీరానికి సమాంతరంగా పయనిస్తుందని వివరించారు. 


నాలుగు జిల్లాలకు రెడ్‌ మెసేజ్‌..

 విశాఖ నుంచి కృష్ణా జిల్లా వరకు ముప్పు ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా  జిల్లాలకు రెడ్‌ మెసేజ్‌ జారీచేసింది. మంగళవారం ఉదయం నుంచే కోస్తాలోని అనేక జిల్లాలో విస్తారంగా, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గాలుల వేగం పెరిగింది. అలలు ఎగిసిపడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి గాలుల వేగం మరింత పెరిగింది. బుధవారం కోస్తాలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయి. కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. కృష్ణా నుంచి విశాఖ వరకు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. బుధవారం తెల్లవారుజాము నుంచి కోస్తాలో 55 నుంచి 65, అప్పుడప్పుడు 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. అయితే విశాఖ నుంచి కృష్ణా జిల్లా వరకు గంటకు 75 నుంచి 85, అప్పుడప్పుడు 95 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగిసిపడటంతో తీరానికి ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది.


గాలుల వేగం, వర్ష బీభత్సానికి అరటి, కొబ్బరి, బొప్పాయి, తమలపాకులు, మామిడి తోటలకు భారీనష్టం వాటిల్లనుంది. ఇంకా కోతకు సిద్ధంగా ఉన్న వరి, ఇతర పంటలకూ నష్టం సంభవించనుంది. చెట్లు, స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. వాహన రాకపోకలపైనా ప్రభావం పడనుంది. బుధవారం ఉదయం నుంచి రోడ్లపై ట్రాఫిక్‌ను నియత్రించే అవకాశం ఉంది. కలింగపట్నం, వాడరేవు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, భీమిలి ఓడరేవుల్లో గ్రేట్‌ డేంజర్‌ సిగ్నల్‌ పదో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలలో ఎనిమిదో నంబరు భద్రతా సూచిక ఎగురవేసినట్టు విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

 

 ప్రకాశంలోనే ఎక్కువ: ఇస్రో నిపుణుడు

కాగా ‘అసాని’ మంగళవారం రాత్రికి బలహీనపడి తుఫాన్‌గా మారి బుధవారం ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య మచిలీపట్నం-నిజాంపట్నం మధ్య తీరం దాటుతుందని అమెరికా నౌకాదళానికి చెందిన జేటీడబ్ల్యుసీ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 80-90 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తీరందాటిన తుఫాన్‌ దిశ మార్చుకుని విశాఖ వైపు వచ్చి...అక్కడ మళ్లీ సముద్రంలో ప్రవేశిస్తుందని వెల్లడించింది. బుధ, గురువారాల్లో కృష్ణా నుంచి నెల్లూరు జిల్లా వరకూ భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం జిల్లాలోనే ఎక్కువ వర్షం కురుస్తుందని, అనేకచోట్ల అతిభారీ నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు. 


విశాఖలో విమాన సర్వీసుల రద్దు

అసాని ప్రభావంతో విశాఖపట్నం విమానాశ్రయానికి బుధవారం విమానాల రాకపోకలను ఇండిగో సంస్థ నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. దేశంలోని పలు నగరాల నుంచి ఇండిగో సంస్థ విశాఖకు సుమారు 23 విమానాలను నడుపుతోంది. వాతావరణం అనుకూలంగా లేనందున ఆ సర్వీసులన్నింటినీ రద్దు చేసినట్టు పేర్కొంది. ఇదే కారణంతో సోమ మంగళవాల్లో పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ మీదుగా విశాఖ రావాల్సిన ఎయిర్‌ ఏసియా సర్వీస్‌, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, రాయపూర్‌, కోల్‌కతా తదితర నగరాలకూ సర్వీసులు నిలిచిపోయాయి.


 రంగంలోకి 18 సహాయ బృందాలు 

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయ చర్యలకు 9 ఎన్డీఆర్‌ఎఫ్‌, 9 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్లు రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ చెప్పారు. ప్రభావిత రాష్ట్రాల విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో కేంద్రహోంశాఖ కార్యదర్శి మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం సాయిప్రసాద్‌ మాట్లాడుతూ.. స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. తుఫాన్‌ గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేస్తున్నామని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు.

Read more