ఇక ఉద్ఘాటన అంగరంగ వైభవంగా

ABN , First Publish Date - 2021-10-20T06:44:12+05:30 IST

ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న స్వయంభు పాంచనారసింహుడు వెలసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనను అంగరంగ వైభవంగా నిర్వహి స్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఇక ఉద్ఘాటన అంగరంగ వైభవంగా
విద్యుత్‌ వెలుగుల్లో యాదాద్రి ఆలయాన్ని పరిశీలిస్తున్న కేసీఆర్‌

వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు

వివరాలు వెల్లడించిన సీఎం  కేసీఆర్‌

ఎనిమిది గంటలపాటు యాదాద్రిక్షేత్రంలో పర్యటన

ఆలయ పనుల పరిశీలన, అధికారులకు దిశానిర్దేశం



యాదాద్రి టౌన్‌: ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న స్వయంభు పాంచనారసింహుడు వెలసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనను అంగరంగ వైభవంగా నిర్వహి స్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ మంగళవారం సందర్శించి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం కొండపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ ఉద్ఘాటన ముహూర్తం వివరాలను వెల్లడించారు.



యాదాద్రి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 21న పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం స్వస్తిపుణ్యహవాచన పూజలతో మహాసుదర్శన యాగాన్ని నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. యాదాద్రి పనుల పరిశీలన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణ పనులపై శ్రీవైష్ణవ పీఠాధిపతి చిన్నజీయర్‌ స్వామి సలహాలు, సూచనలు అందజేస్తూ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రధానాలయ పనులు తుదిదశకు చేరిన నేపథ్యంలో ఉద్ఘాటన ముహూర్తంపై జీయర్‌ స్వామితో సమాలోచన చేసినట్లు తెలిపారు. జీయర్‌స్వామి విధ్వత్‌సభ, సిద్ధాంతుల సభలో ఆలయ ఉద్ఘాటన ముహూర్తంపై చర్చించి నిర్ణయించారన్నారు. జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం చేసుకున్న ఆలయాలను మహాకుంభ సంప్రోక్షణ పూజలతో పునఃప్రారంభించాలని, మహాసుదర్శన యాగాన్ని నిర్వహించాలని వారు సూచించినట్లు తెలిపారు. బాలాలయంలోని సువర్ణ ప్రతిష్ఠాలంకారమూర్తుల చెంత స్వామివారి ముహూర్త పత్రికకు ప్రత్యేక పూజలు చేయించామన్నారు. వచ్చే ఏడాది మార్చి 21న స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం స్వస్తిపుణ్యహవాచన పూజలతో మహాసుదర్శన యాగాన్ని ఆరంభించనున్నట్లు చెప్పారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, మహా పూర్ణాహుతి పూజలతో యాగ పరిసమాప్తి అవుతుందన్నారు. ఆరువేల మంది రుత్వికులు, నాలుగు వేల మంది సహాయకులతో 1008 కుండలాలతో మహాయాగాన్ని నిర్వహిస్తామన్నారు. జీయర్‌స్వామి పర్యవేక్షణలో కొండకింద పాత గోశాల ప్రాంతంలోని  100ఎకరాల్లో యాగాన్ని నిర్వహిస్తామన్నారు.


యాదాద్రీశుడి సన్నిధిలో సీఎం పూజలు 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ 16వసారి మంగళవారం సందర్శించారు. క్షేత్ర సందర్శనకు వచ్చిన ఆయనకు అర్చక బృందం, వే ద పండితులు బాలాలయం వద్ద ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభం స్వాగతం పలికారు. బాలాలయం లో ప్రతిష్ఠా అలంకారమూర్తులను ఆయన దర్శించుకొని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆయన కు వేదమంత్రాలతో అర్చకులు ఆశీర్వచనం చేశారు. దేవస్థాన ఈవో గీతారెడ్డి స్వామివారి ప్రసాదాన్ని అందజేశా రు. అనంతరం దేవస్థాన ఉద్యోగుల సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.


సునీతమ్మా.. నీ జన్మధన్యం

ప్రపంచ ప్రఖ్యాత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం స్థానిక ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి హయాంలో పూర్తికానుండటంతో ఆమెను సీఎం అభినందించారు. యాదాద్రి పర్యటన సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ ఇంతటి బృహత్‌ కార్యం చేపట్టలేమని, సునీతమ్మా నీ జన్మధన్యమైందన్నారు.


అర్చకులు, ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు

జర్నలిస్టులు, యాదాద్రి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్టు విలేకరుల సమావేశంలో సీఎం ప్రకటించారు. యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు గండి చెరువు సమీపంలో వెయ్యి చదరపు అడుగుల్లో దుకాణాలను నిర్మించి ఇవ్వాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లిస్తామన్నారు. తరతరాలుగా యాదాద్రిలో వ్యాపారం చేసుకుంటున్న నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, వారి జీవనోపాధికి ఎటువంటి భంగం రానివ్వొద్దని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పీఆర్‌సీ, అమలైందా అని ప్రశ్నించగా సిబ్బంది వస్తోందని సమాధానం ఇవ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌కు మంత్రులు గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీత, శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, రాచకొండ సీపీ మహేశ్‌ ఎం.భగవత్‌, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, నార్మాక్స్‌ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి తదితరులు తులసీ మొక్కలు అందించి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌, దేశపతి శ్రీనివాస్‌ ఉన్నారు.


సీఎం పర్యటన సాగిందిలా...

యాదాద్రి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ 16వ సారి సందర్శించారు. మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.50 గంటల వరకు సుమారు 8గంటలకు పైగా యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటించి ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు.

మధ్యాహ్నం 12.30గంటలకు ప్రగతి భవన్‌ నుంచి యాదాద్రికి చేరుకున్న సీఎం

12.32 వరకు హెలీకాప్టర్‌లోనే యాదాద్రి ఆలయ పరిసరాల పరిశీలన

12.37కు పెద్దగుట్ట పైనున్న టెంపుల్‌ సిటీ హెలీప్యాడ్‌కు చేరుకున్న సీఎం

12.42కు టెంపుల్‌ సిటీ నుంచి కాన్వాయిలో రోడ్డు మార్గంలో యాదాద్రి కొండకు

12.49కి కొండపైన గెస్ట్‌హాస్‌ వద్ద  ఎలిఫెంట్‌ ప్యానల్‌ నిర్మాణాల పరిశీలన

12.55కు పడమటి దిశలోని లిఫ్ట్‌ ద్వారా ఉత్తర దిశలోని ప్రాకార మండపానికి చేరుకొని గ్రీనరీ పరిశీలించి అధికారులకు సూచన

1.02కు బాలాలయ వద్ద సీఎంకు అర్చక బృందం పూర్ణకుంభ స్వాగతం

1.03కు సీఎం కేసీఆర్‌ పేరిట సంకల్ప పూజలు, సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్న సీఎం

1.14కు బాలాలయం నుంచి బయటికి వచ్చిన సీఎం గ్రీనరీ పరిశీలన, లోహపు దర్శన క్యూలైన్ల గుండా తూర్పురాజగోపురం వద్దకు చేరిక

2.42కు పడమటి దిశలోని లిఫ్ట్‌ మార్గం ద్వారా అతిథి గృహానికి

3.45కు కొండకింద రింగురోడ్డు, పుష్కరిణి, ఆర్టీసి బస్టాండ్‌ తదితర ప్రాంతాలను పరిశీలిస్తూ వైకుంఠ ద్వారం వద్దకు.

సుమారు 15నిమిషాల పాటు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చ. అదే సమయంలో అంబులెన్స్‌ రావడంతో దారి ఇచ్చి పంపించిన సీఎం

4.25కు టెంపుల్‌ సిటీకి చేరుకొని వైటీడీఏ గెస్ట్‌ హౌస్‌, ప్లాటింగ్‌ పరిశీలన

4.35కు రింగురోడ్డు పనుల పరిశీలన

4.57కు టెంపుల్‌ సిటీకి చేరుకొని జీయర్‌ స్వామికి కేటాయించిన స్థలం పరిశీలన

5.15కు తిరిగి గండి చెరువు వద్దకు

6.10కు కొండపైకి చేరుకొని అరగంట పాటు ప్రధానాలయం విద్యుద్దీకరణ పనుల పరిశీలన

6.45కు గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌

రాత్రి 7.05కు కొండపైన సుమారు గంటకుపైగా విలేకరుల సమావేశం

8.30కు తిరిగి గెస్ట్‌హౌస్‌కు

 8.50కు కాన్వాయిలో హైదరాబాద్‌కు పయనమైన సీఎం కేసీఆర్‌





Updated Date - 2021-10-20T06:44:12+05:30 IST