కోఆప్షన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ఖరారు

ABN , First Publish Date - 2020-08-03T10:43:40+05:30 IST

నగరపాలక సంస్థలోని ఐదు స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కోఆప్షన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ఖరారు

ఒకటి ఎంఐఎంకు కేటాయింపు

నేడు దరఖాస్తుల ఆఖరిరోజు 

దాదాపు అన్నీ ఏకగ్రీవమే...


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 2: నగరపాలక సంస్థలోని ఐదు స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఐదింటిలో ఒక స్థానాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీకి మిత్రపక్షంగా ఉంటున్న ఎంఐఎంకు కేటాయించగా మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. కో ఆప్షన్‌ పదవులకు దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం ముగియనుండడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరా శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ పార్టీ అధినాయకత్వంతో చర్చించి దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలోని 60డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 41మంది, ఎంఐఎంకు చెందిన ఐదుగురు, బీజేపీ నుంచి గెలుపొందిన 14మంది కార్పొరేటర్లు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు ఎంఐఎం పార్టీతో కలిసి ఆ పార్టీలకు 46మంది బలం ఉండడంతో ఆ పార్టీలు సూచించిన వారే గెలిచే అవకాశముంది. దీనితో కోఆప్షన్‌ పదవుల కోసం టీఆర్‌ఎస్‌ పార్టీలో చాలామంది ప్రయత్నించారు.


ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ టికెట్‌తో ఓడిపోయిన మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిర్లతోపాటు పార్టీ టికెట్‌ లభించక పోవడంతో పోటీ నుంచి ఉపసంహరించుకొని టీఆర్‌ఎస్‌ పార్టీకి సహకరించిన మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డుసభ్యులు కూడా కో ఆప్షన్‌ పదవులకు పోటీపడ్డారు. పోటీ తీవ్రంగా ఉండడంతో గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇచ్చిన వారికి కాకుండా పోటీ నుంచి తప్పుకొని పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేసిన వారికే కో అప్షన్‌ పదవులు కట్టబెట్టాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకొని ఆ మేరకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధపడి పార్టీ సూచన మేరకు పోటీ నుంచి విరమించుకున్న మాజీ కార్పొరేటర్లు నందెల్లి రమాదేవి, సిహెచ్‌ అజిత్‌రావుతోపాటు 20వ డివిజన్‌ ఆరెపల్లిలో ఏకగీవ్రంగా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యేందుకు పోటీ నుంచి తప్పుకొని సహకరించిన అక్కడి నాయకుడికి కోఆప్షన్‌ పదవికి ఎంపిక చేసినట్లు తెలిసింది.


ముస్లిం మైనార్టీ కోటాలోని రెండు పదవుల్లో ఒకటి ఎంఐఎంకు, మరొకటి మాజీ కోఆప్షన్‌ సభ్యుడు అమ్జద్‌ను ఎంపిక చేసినట్లు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిని కూడా పోటీనుంచి తప్పించి దాదాపుగా ఐదు స్థానాల్లో ఏకగ్రీవం చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. 14మంది కార్పొరేటర్లతో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ కోఆప్షన్‌ ఎన్నికలకు దాదాపుగా దూరంగానే ఉంటుందని, అందుకే ఇప్పటివరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదని, ఆ చర్చ కూడా పార్టీలో జరుగలేదని తెలిసింది. సోమవారం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిస్తే కో ఆప్షన్‌ సభ్యులు ఎవరన్నది దాదాపుగా తెలిసిపోతుంది.

Updated Date - 2020-08-03T10:43:40+05:30 IST