భాషావేత్తలో భేషైన కవీ ఉన్నాడు!

ABN , First Publish Date - 2021-10-25T06:10:45+05:30 IST

‘‘అంభోజాసనన్‌ బెండ్లి యాడుతఱి హోమాయత ధూమంబుచే...’’ అని పధ్నాలుగేళ్ళకే ఒకానొక పెళ్ళి సందర్భంగా తన పాఠశాల తెలుగు పండిట్‌ భారతుల మార్కం డేయశర్మగారు రాయమని ఆదేశిస్తే భద్రిరాజు కృష్ణమూర్తి రాసిన పంచరత్నాలలో ఒకటి అది....

భాషావేత్తలో భేషైన కవీ ఉన్నాడు!

‘‘అంభోజాసనన్‌ బెండ్లి యాడుతఱి హోమాయత ధూమంబుచే...’’ అని పధ్నాలుగేళ్ళకే ఒకానొక పెళ్ళి సందర్భంగా తన పాఠశాల తెలుగు పండిట్‌ భారతుల మార్కం డేయశర్మగారు రాయమని ఆదేశిస్తే భద్రిరాజు కృష్ణమూర్తి రాసిన పంచరత్నాలలో ఒకటి అది. అప్పుడు కృష్ణమూర్తిగారు పదవ తరగతి చదువుతున్నారు. పదకొండవ తరగతిలో (ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. అనేవారు) వారి తెలుగు పాఠ్య పుస్తకంలోని విశ్వనాథ సత్యనారాయణ గారి ‘రెండు నక్షత్రాలు’ కావ్యాంశం చదివి, ‘ఆత్మార్పణం’ అనే కవితా ఝురిని సృజిం చారు- ‘‘అట్లతండు ప్రాణ హత్యాకృత్యధృఢ నిశ్చయుండై మందాకినీ ధునీ, తటంబుజేరి, నాకున్‌ దీఱె జగమ్ముతోడ ఋణమీనాడే - సమర్పింతు నీ నా కాయమ్మును - సర్వజంతు కృత న్యానపాప సంహరిణీ... కొన్మను మానమేలయిక నీ నిర్భాగ్యు భాగిరథీ’’ అని. ఒక కవి తన పేదరికానికి తట్టుకోలేక, తన కవిత్వానికి ఆదరణలేక జీవితం ముగించుకొనే ప్రయ త్నంలో స్వగతంగా ఆశువుగా చెప్పిన కవిత్వం ఇది. ఈ పద్యం 1942లో ఆచ్చయింది. గురువుగారైన పళ్ళపూర్ణ ప్రజ్ఞాచార్యులు నాటి గుంటూరు హిందూకాలేజిలో సంస్కృతాంధ్రాలలో పండి తులు. 1943-45ల మధ్య కృష్ణమూర్తి గారు అక్కడ ఇంటర్మీ డియట్‌ చదివారు. ఆ సంవత్సరం ఉత్తీర్ణులై కాలేజీ నుంచి సహవిద్యార్థులతో కాలేజి వీడ్కోలు సందర్భంగా జరిగిన సభలో కృష్ణమూర్తి గారు రాసిన పద్యాలలో ఒకటి: ‘‘...మతి వికసించె, నీ చలువమాటునన్‌, బెంపును గాంచి వత్సర ద్వితీయము వెళ్ళ బుచ్చితిమి, ముందెటుల్‌ పరిణమింపగనున్నదో మాదు భావి జీవితము లిన్‌కెన్ని యెన్ని నెఱ వేర్పగనున్నవియోమహత్కృతుల్‌’’ అని. ఈ వాక్యము కృష్ణమూర్తి కాలేజీ నుంచి వీడ్కోలు తీసు కొంటున్న తన సహచర విద్యార్థులందరి సమిష్టి మనోభావ మ్ముగా రాసినా, అందులోని భవిష్యత్‌ దర్శనం కృష్ణమూర్తి జీవితంలో మటుకు అక్షరాల నిజమై నిల్చింది. ఆ ‘మహత్కృ తుల్‌’లో భాగంగానేమో భద్రిరాజు వారు సాహిత్యం నుంచి భాషాశాస్త్రం వైపుకు మరలి అంతర్జాతీయ ఖ్యాతి పొంది, తెలుగుజాతికి గర్వాన్ని కూర్చారు. 


భద్రిరాజు కృష్ణమూర్తి రాసిన చిన్ననాటి కవితలను వారు 1998లో సంకలన రూపంలో తెచ్చారు- ‘చిన్ననాటి పద్యాలు’గా. ఈ కవితా సంకలనానికి నాటి ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త, స్వతహగా కవి, విమర్శకుడు, భద్రిరాజు వారి శిష్యుడు అయిన చేకూరు రామారావు (చేరా) గారు పీఠిక రాశారు. ఆ సంద ర్భంగా ఆయన ఈ కవితా సంకలనాన్ని ఆమూలాగ్రంగా విశ్లే షించటమే గాక, కృష్ణమూర్తి గారి ఆప్తుడిగా ఎన్నో వ్యాఖ్యాలు చేశారు. ‘‘సాహిత్య పఠన, రచన ఆయనకు చాలా ఇష్టమైన వ్యాసంగాలని చాలా మందికి తెలీదు. భారతంలో పద్యాలు, శ్రీనాథుడి కవిత్వం వారికి కంఠోపాఠం... విశ్వనాథ సత్యనారా యణ కవిత్వం అంటే ఎంతో మక్కువ. వ్యవహారిక భాషా వాదాన్ని విమర్శిస్తూ కృష్ణమూర్తి గారిని ప్రస్తావిస్తూ ‘ఆతనికి నా కవిత్వం అంటే ఎంతో ఇష్టం’ అని స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ గారే ఒకానొక సందర్భంలో ఒక పత్రికలో వ్యాసంగా రాశారు. విశ్వనాథ వారి ‘ఆంధ్ర భిక్షువు’ను వారితోనే చదివించుకొని తన వద్ద టేపులో భద్రంగా దాచుకొన్న గడుసరి భద్రిరాజు వారు’’ అని వ్యాఖ్యానించారు.


‘‘అలాగే చేకూరి రామారావు రాసిన ‘స్మృతి కంకణం’ గేయాన్ని 1959లో వారే చదవగా దాన్ని కూడ టేపు చేసి భద్రంగా పదిలపరచుకొన్నారు భద్రిరాజు వారు’’, అని చేరా స్వయంగా ఈ సంకలన పీఠికలో తెలిపారు. కావ్య సాహిత్యం, భావ కవిత్వం, గేయ రచనలపై కృష్ణమూర్తికి ఉన్న సాధికా రతకు ఆయన సంపాదకత్వంలో వెలువడిన ‘నన్నయ్య పద ప్రయోగకోశం’, ‘తిక్కన పద ప్రయోగ కోశం’ చాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన గంటి జోగిసోమ యాజి గారి వద్ద ‘తెలుగు ధాతువులు, పుట్టు పూర్వోత్తరాలపై’ పరిశోధిస్తున్నప్పుడే భద్రిరాజువారు తెలుగు, సంస్కృత వ్యాకర ణాలను క్షుణ్ణంగా శోధించారు. ‘బాల వ్యాకరణం’ నుంచి పాణిని ‘అష్టాధ్యాయి’ వరకు కృష్ణమూర్తికి కంఠోపాఠమే. ఈ విధమైన భాషాధ్యాయనం ఆయన కవిత్వానికి పదును, పాండి త్యం సమకూర్చింది. చాలామందికీ ఈ విషయాలు తెలియవు. కేవలం ఆంగ్లంలో భాషా పండితుడు అని అనుకొంటారు. ఆయన అమెరికా గురువు ముర్రె బి. ఎమనో గారు సంస్కృ తంలో ఆచార్యుడని గూడ చాలామందికి తెలియదు.


భద్రిరాజు కృష్ణమూర్తి గారు 1942-45 మధ్యకాలంలో రాసిన కవిత్వం చాలా ఉన్నతమైనది. నూతన ఒరవడులకు, ప్రమా ణాలకు శ్రీకారం చుట్టింది కూడ. ఈ విషయమై స్వయంగా కృష్ణమూర్తిగారు తన కవిత సంకలనం ముందుమాట (నా మాట)లో ఇలా రాశారు. ‘‘ఆరోజుల్లో గేయంకన్నా పద్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కారణం అవధాన కవుల ప్రభావం కావచ్చు; మనకున్న సాహిత్య సంప్రదాయ ప్రభావం కావచ్చు. భావ కవిత్వం రోజులవి. అయినా తల్లావఝ్ఝల, రాయప్రోలు, నాయని, దేవులపల్లి, విశ్వనాథ, వేదుల సత్య నారాయణశాస్త్రి మొదలైన వాళ్ళంతా పద్యాలే ఎక్కువగా రాశారు. అందుకని నేనూ ఛందో బద్ధమైన పద్యాలే 1940-50 మధ్య రాశాను.... చివర చివర కాస్త గేయ రచన ధోరణి పట్టుకొంది’’ అని.


కృష్ణమూర్తి హైస్కూలు, ఇంటర్మీడియట్‌ చదివే రోజుల్లో సాంప్రదాయక కవిత్వం, భావ కవిత్వం ఎక్కువగా చదివారు. తిరుపతి వేంకట కవులు ఆయన కవిత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారని ఆయనే చెప్పుకొన్నారు. నాటి భావ కవుల్లో గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, వేదుల సత్యనారాయణశాస్త్రి వంటి కవులు రాసిన పద్యాలు వారికి చాలా నచ్చిన పద్యాలు. ప్రాచీన ప్రబంధాలు, భారతం, భాగవతం, వంటివి ఆయన 1942లో రాసిన ‘మాతృ సందేశం’ ముందే చుట్టబెట్టేసినవి.


1942లో క్విట్‌ ఇండియా ఉద్యమానికి గాంధీజీ పిలుపు నిచ్చిన రోజులవి. కృష్ణమూర్తి గారు హైస్కూల్లో చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆ నేపథ్యంలో కృష్ణమూర్తి రాసినదే ‘మాతృ సందేశం’ అనే ఖండకావ్యం. మచ్చుకకు ఒక పద్యం చదివితే చాలు ఈ ‘మాతృ సందేశం’లోని పద్యాలు ఎంత జటిలంగా ఉన్నాయో తెలుస్తుంది. ‘‘వితతం బైన చరచరాత్మక మహ విశ్వ ప్రపంచంబునన్‌, బ్రతి జీవాణువునన్‌ భ్రమించుచున్‌ బరబ్రహ్మైక రూపంబునై, శ్రుతిలోక ప్రధమ ప్రకాశితమునై రూపొందె నే పూజనీ, యతన్‌ గన్నటి పదార్థ యయ్యమృత శబ్దావాప్తి నూహించెదన్‌’’- ఈ ఖండ కావ్యం 28-12-1945న ముగించినట్లు కృష్ణమూర్తి గారే స్వయంగా రాశారు. 297 పద్యాలు, భిన్న ఛందోరీతుల్లో సాగే కావ్యం ఇది. స్వాతంత్య్రము సిద్ధించిన యాభై సంవత్సరములకు దీన్ని అచ్చు వేశారు భద్రిరాజువారు.


‘‘గురువు గారి తొలి పద్యాలలో సహజంగానే భాషాడంబరం, సమాస రచనపై మోజు, భావాల్లో వివేచనకన్నా మోగ్ధ్యం కనిపిస్తుంది... ‘మాతృ సందేశం’ గురువుగారి చేత పద్య రచనాభ్యాసం చేయించింది. ఆ తర్వాత స్వాతంత్ర్యానంతరం ‘ఆశంస’ పేరుతో రాసిన పద్యాల్లో ఎక్కువ పరిణతి కనిపి స్తుంది. సమాసాల మోజు తగ్గి తెలుగు మాటల మార్పువైపు మొగ్గు కనిపిస్తుంది’’, అని రాశారు చేకూరి రామారావు. ‘‘తెలిదమ్మి రేకు కత్తుల బోనులలో నుండి, చివ్వున తుమ్మెద చెంగలించె పెనుబాపఱేడు తా విడలేక విడలేక, మొగలిపై చుట్ట విప్పుకొని పోయె, ఒడిసిపట్టిన చంద్రునుడుపకయే కాల, బద్ధుడై రాహువు పట్టువదలె, చీకటి కప్పు విచ్చిన జాడన్‌ జూచిగూ, బలు చెట్టుగుట్టల పాలన్‌ బడియె’ - అలా సాధారణ అలతి అలతి తెలుగు పదాల సొబగులతో పోతన రీతిలో కవితా ఝరి నడిపించారు ‘ఆశంస’లో. ఈ రకపు పద్యరచన తిక్కన గారిపై భద్రిరాజు వారికున్న అపారమైన అభిమానం వలన అయి ఉంటుంది. భద్రిరాజు వారు ‘తిక్కన’ మహాభారతంపై ‘స్పెషలిస్ట్‌’ ప్రసంగాలు చేసేవారు. చిన్ననాడే తిక్కన కవిత్వంపై విపరీతమైన అనురక్తి పెంచుకోవటం వలన కాబోలు ఆయన తిక్కన భారత పర్వాలను క్షుణ్ణంగా శోధించారు.


నాటి బహుభాషావేత్త, ఆంధ్రరాష్ర్టానికి రెండవ ముఖ్య మంత్రి, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన బెజవాడ గోపాల రెడ్డి గారికి కృష్ణమూర్తిగారి ‘తిక్కన’ ప్రసంగాలు అంటే ఎంతో ఇష్టం. తరుచూ కృష్ణమూర్తి గారికి ఖర్చులు ఇచ్చి నెల్లూరు పిలిపించుకొని ఆయనతో ప్రసంగాలను ఇప్పించేవారు. తగు పారితోషికం ఇచ్చి దుశ్శాలువతో సత్కరించే వారు. అదేవిధంగా నాటి విద్యాశాఖ మాత్యులు, తర్వాత కేంద్రంలో విద్యాశాఖా మాత్యులు, భారత ప్రధానిగా పనిచేసిన పి.వి. నర్సింహ రావు గారు కూడ కృష్ణమూర్తి గారి తిక్కన సోమయాజిపై ప్రసంగాలకు చెవి కోసుకొనే వారు. ఆకాశవాణి వారు తిక్కనపై వారి ఉపన్యాసాల పరంపరలకు మచ్చుతునకగా ఒక ఉపన్యాసాన్ని ‘తిక్కన పదసంపద’ పేరుతో ప్రసారం చేశారు. భద్రిరాజు వారి సంపాద కత్వంలో ‘తిక్కన పదప్రయోగ కోశం’ చేసే ప్పుడు ఆ యజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించిన నల్లాన్‌ చక్రవర్తుల రామానుజాచార్యుల వారు తన షష్టిపూర్తి సందర్భంగా భద్రిరాజు వారికి తిక్కన కవిత్వంపై, ఆ మహకవి వాడిన ప్రతి పదంపైన ఉన్న సంపూర్ణ సాధికారితను వివరించారు.  


అన్ని కాలాల్లోను కవులు తమ సమకాలీన సమస్యలనే వస్తువుగా స్వీకరించి కవితలల్లారు. భద్రిరాజు వారు కూడా అలానే అల్లారు. 1947లో బెంగాలులో, బీహారులో సంభవించిన హత్యాకాండలకు స్పందిస్తూ ‘ఆవేదన’ రాశారు. ఛందోబద్ధమైన ఈ కవితల్లో సంబోధితుడు బుద్ధుడు. స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్టు 15, 1947న రాసిన చందోబద్ధమైన పద్యమాలిక ‘ఆశంశ’. నాడు భద్రిరాజు వారి వయస్సు కేవలం పందొమ్మిది సంవత్సరాలు. ‘‘బహు కాలాగత పారతంత్య్ర నిగళా ప్రాప్తిన్‌ విభేదించి, సన్నిహితంబైన స్వతంత్రానవనవోన్మేషాంశులన్‌ భారతీ, యహృదం భోజ వికాసముం గొలిపి యద్యన్మూర్తి యొప్పులో, కహితోద్భూత! త్రివర్ణ భారతపతాకా! నీకు బ్రహ్మయువౌ?’’. 


కృష్ణమూర్తి దాదాపు 1950, 1951ల తర్వాత ప్రత్యేకించి, కవితలు, గేయాలు, కావ్య ఖండికలు రాయక పోయిన ఆశు కవిత్వంలో పద్యాలు అల్లి చెప్పేవారు - తన పండిత శిష్యుల మధ్య. 1987 జనవరిలో అనంతపురంలో జరిగిన ద్రావిఢభాషా పరిశోధన సంఘం వారి సమావేశంలో భద్రిరాజువారు, బూద రాజువారు పోటీలు పడి ఆశుకవిత్వం చెప్పారు. బూదరాజు రాధాకృష్ణ తన ‘సాహితీ వ్యాసాలు’ అనే గ్రంధాన్ని అబ్బూరి రామకృష్ణారావు స్మృతికి అంకితం చేసిన సందర్భంగా ఫతే మైదాన్‌ క్లబ్‌లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు అప్పటికప్పుడు సీసపద్యంలో వారికి నివాళి అర్పించారు (3-5-1990న).


భద్రిరాజువారు చిన్ననాడు ఒంగోలులో అష్టావధానాలు చేసే వారు. నాటి అవధానాలకు సాక్షులుగా భారతుల మార్కండేయ శర్మ, నాయని నరసింహరావు ఉండి, వారి పృచ్ఛకత్వానికి దీటుగా సమాధానాలు పద్యరూపంలో పలికినందుకు నాడు ‘కిష్టుడు’ అని ముద్దుగా పిలిచే భద్రిరాజు కృష్ణమూర్తిని అభినందించేవారు. కృష్ణమూర్తి సాహితీ పిపాస భాషా పరిశోధనతో సమాంత రంగా సాగేది. భాషా శాస్త్రం ఎంచుకొన్న తర్వాత కృష్ణమూర్తి కవితాసృజన ఆపేసినా, ఒకవేళ ఆయన కొనసాగించి ఉంటే ఏ స్థాయికి వెళ్ళేవారో ఊహించటం కష్టం అంటారు చేరా.

కొప్పరపు నారాయణమూర్తి

Updated Date - 2021-10-25T06:10:45+05:30 IST