ముక్తినిచ్చే మురుడేశ్వరుడు

ABN , First Publish Date - 2020-10-02T06:56:05+05:30 IST

ఆధ్యాత్మిక యాత్రికులనూ, ప్రకృతి ప్రేమికులనూ సమానంగా ఆకర్షించే అపురూపమైన ప్రదేశం మురుడేశ్వర్‌...

ముక్తినిచ్చే మురుడేశ్వరుడు

ఆధ్యాత్మిక యాత్రికులనూ, ప్రకృతి ప్రేమికులనూ సమానంగా ఆకర్షించే అపురూపమైన ప్రదేశం మురుడేశ్వర్‌. మూడు వైపులా అరేబియా మహా సముద్రం ఆవరించి, ఒక దీవిలా కనిపించే ఈ క్షేత్రంలో మురుడేశ్వరుడిగా పరమేశ్వరుడు కొలువు తీరాడు. అంతేకాదు, ప్రపంచంలోనే అతి ఎత్తైన శివ విగ్రహాల్లో రెండవది ఇక్కడుంది.


కర్ణాటక రాష్ట్రంలో సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో మురుడేశ్వర్‌ ఒకటి. అరేబియా సముద్రం మూడు పక్కల నుంచీ ముట్టడిస్తున్నట్టు కనిపించే కందుకా పర్వతం మీద ఉన్న ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని స్థలపురాణం చెబుతోంది. రావణుడు కైలాసానికి వెళ్ళి, శివుణ్ణి మెప్పించి, శివుని ఆత్మలింగాన్ని సంపాదించాడు. ఆ ఆత్మలింగాన్ని నేల మీద పెడితే తిరిగి పైకి తియ్యడం అసాధ్యమని శివుడు హెచ్చరిస్తాడు. రావణుడు తిరిగి లంకకు వెళ్తూ ఉండగా సంధ్యా సమయం అయింది. సంధ్య వార్చుకోడానికి చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని బాలుడి రూపంలో అక్కడికి వచ్చిన వినాయకుడి చేతిలో రావణుడు ఉంచాడు. మూడు సార్లు పిలిచే లోగా రాకపోతే విగ్రహం నేల మీద పెట్టేస్తానని ఆ బాలకుడు చెబుతాడు. రావణుడు అక్కడి నుంచి వెళ్ళగానే మూడు సార్లు రావణుణ్ణి పిలిచి, ఆ విగ్రహాన్ని నేల మీద ఆ బాలకుడు వదిలేస్తాడు. అది చూసిన రావణుడు ఆ విగ్రహాన్ని ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించగా, దానిలో ఒక శకలం కందుకా పర్వతం మీద పడిందట! శివుడి ఆత్మలింగాన్ని గణపతి నేలపై ఉంచిన చోటు భూకైలాసమైన గోకర్ణ క్షేత్రంగా ఖ్యాతి పొందింది. కందుకా గిరిపై పడిన శివ లింగ శకలం మురుడేశ్వరుడిగా పూజలందుకుంటోంది. ఈ స్వామిని పూజిస్తే ముక్తిని ఇస్తాడని భక్తుల నమ్మకం. 


మురుడేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. మురుడేశ్వర శివలింగం భూమికి దిగువన దర్శనమిస్తుంది. ఈ ఆలయ రాజగోపురం ఇరవై అంతస్థుల ఎత్తుతో సమున్నతంగా కనిపిస్తుంది. లిఫ్ట్‌ ద్వారా ఈ గోపురం పై అంతస్థుకు చేరుకోవచ్చు. ఆలయం వెనుక మురుడేశ్వర్‌ కోట ఉంటుంది. దాన్ని టిప్పుసుల్తాన్‌ కాలంలో పునరుద్ధరించారు. 


ఇక్కడ మరో విశేషం ఎత్తైన శివుడి విగ్రహం. ప్రపంచంలో అతి ఎత్తైన శివ విగ్రహం నేపాల్‌లోని కైలా్‌సనాథ్‌ మహాదేవ్‌ది (143 అడుగులు) కాగా, మురుడేశ్వర ఆలయం పక్కన 123 అడుగుల ఎత్తులో నిర్మించిన శివుడి విగ్రహానిది రెండో స్థానం. నేపాల్‌ విగ్రహం నిలువెత్తుది. మురుడేశ్వర్‌లో శివుడు ఆశీనుడై దర్శనమిస్తాడు. మురుడేశ్వర ఆలయనిర్మాణం చాళుక్య, కదంబ శిల్ప శైలిలో జరిగింది. ఆలయంలో రెండు భారీ ఏనుగు విగ్రహాలు సందర్శకుల్ని స్వాగతిస్తాయి. బంగారు రంగులో ఉండే సూర్యరథం శివ విగ్రహానికి పక్కనే ఉంటుంది. అక్కడ అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తున్న దృశ్యాన్ని మలిచారు.

Updated Date - 2020-10-02T06:56:05+05:30 IST