అక్షరమే ఆక్సిజన్‌

ABN , First Publish Date - 2021-07-19T05:51:55+05:30 IST

ఆయన వయసు 78 యేళ్లు. 24 గంటలూ ఆక్సిజన్‌ మాస్క్‌ ఉండాల్సిందే. కొన్ని నిమిషాలు దాన్ని తీసేసినా రక్తంలో ఆక్సి జన్‌ స్థాయిలు పడిపోతాయి. అంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు....

అక్షరమే ఆక్సిజన్‌

ఆయన వయసు 78 యేళ్లు. 24 గంటలూ ఆక్సిజన్‌ మాస్క్‌ ఉండాల్సిందే. కొన్ని నిమిషాలు దాన్ని తీసేసినా రక్తంలో ఆక్సి జన్‌ స్థాయిలు పడిపోతాయి. అంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక జీవించి నంత కాలమూ ఆక్సిజన్‌ మాస్క్‌తోనే జీవిం చాలి. ఇట్లాంటి గడ్డుకాలంలో ఎవరైనా ఏం చేయగలరూ! నిస్సహాయంగా మంచానికో, కుర్చీకో కరుచుకుపోయి చివరి గడియల కోసం ఎదురు చూడాల్సిందే. ఆయన అలా బేలగా లేరు. ఆక్సిజన్‌ మాస్క్‌ను మూతికి తగిలించుకునే, శక్తినంతా కూడదీసుకుని రాసుకుంటున్నారు. రాసినదాన్ని తానే ల్యాప్‌టాప్‌లో టైప్‌ చేసుకుంటున్నారు. సాహిత్యమే ఊపిరిగా జీవిస్తున్నారు. అదీ అనితర సాధ్యమైన ఆయన గుండెదిటవు. ఆయనే డాక్టర్‌ ఎం.వి. రమణారెడ్డి.


ప్రొద్దుటూరుకు పోయినప్పుడు తరచూ ఎంవి రమణా రెడ్డి గారిని కలిసే నేను ఈ నడుమ యేడాదిగా కలవలేదు. గత యేడాది చివరలో ఆయన ఆరోగ్యగతి విషమించిందనీ, డిసెంబర్‌లో ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయి ప్రొద్దుటూరు లోనే వుంటున్నారని తెలిశాక కూడా ఈ కోవిడ్‌ వాతావ రణంలో చూడపోలేనివిధి. నాల్గురోజుల కిందట ఆయనను చూసేందుకే ప్రొద్దుటూరు పయనమయ్యాను. 


ఫోన్‌ చేస్తే - ‘వెంటనే రండి, మళ్ళీ రెండు గంటలకు బైప్యాప్‌ (BiPAP) మీదికిపోతే మాట్లాడటానికి కుదర’ద న్నారు. ఆయన ఇంటికి చేరుకొని, వచ్చినట్లు ఫోన్‌ చేశాం. పైనున్న ఆయన గదిలో అడుగుపెట్టాము. తన మంచం ఎదురుగా కుర్చీలో కూర్చొని మంచంపైకి వంగి కాగితం మీద ఏదో రాసుకుంటున్నారు. ఆయన మూతికి ఆక్సిజన్‌ మాస్క్‌ వుంది. ఆయన ఎదురుగా మంచంపై ల్యాప్‌టాప్‌ తెరిచివుంది. పక్కనే మక్సిమ్‌ గోర్కీ ‘మదర్‌’ నవలా, దాని కింద ఒక నోట్‌బుక్‌, పెన్ను కనిపించాయి. మమ్మల్ని చూసి ల్యాప్‌టాప్‌ మూసేసి ‘చాలా రోజులయిందే!’ అన్నారు.


నాలుగేళ్ల కిందట ఆయనకు తలెత్తిన సిఒపి వ్యాధి (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) గత యేడాది నవంబర్‌, డిసెంబర్‌లలో తీక్షణమై ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా చెడిపోయింది, డాక్టర్లకు కూడా నమ్మకం లేకపో యింది. ఆయనకు మాత్రం ‘ప్రపంచ చరిత్ర’ పూర్తి చేయ లేకపోయాననే ఆలోచన తప్ప ఇతరం లేదు. ఇప్పుడు ఆయనకు రాత్రి 10 గంటల నుండి ఉదయం నిద్ర లేచేంత వరకు బైప్యాప్‌ మిషన్‌ (ఒత్తిడితో ఆక్సిజన్‌ను ఊపిరితిత్తు ల్లోకి పంపేది) తప్పనిసరి. ఉదయం రెండు గంటలకొక సారి బైప్యాప్‌ మిషన్‌ మాస్క్‌తోను, మరో రెండు గంటలు కాన్సన్‌ట్రేటర్‌ మాస్క్‌ మిషన్‌తోను గడుపుతారు. కాన్సన్‌ ట్రేటర్‌ మాస్క్‌తో వున్న సమయంలోనే ఆయన ఎవ్వరితో నైనా మాట్లాడడం, తినడం, తాగడం చేయగలరు. ఎంవిఆర్‌ ఆస్పత్రి నుండి ఇంటికి చేరిన కొన్నాళ్ళకు తిరిగి కోలుకొని ప్రపంచ చరిత్ర నాల్గవ భాగంలో మిగిలిపోయిన అధ్యా యాలను పూర్తి చేశారు. ఇప్పుడు మక్సిమ్‌ గోర్క‘మదర్‌’ నవలను ‘కడుపు తీపి’ పేరుతో అనువదిస్తున్నారు.


అనేకమంది అనువదించిన ‘మదర్‌’ను ఎందుకు తీసుకు న్నారన్న ప్రశ్నకు, ఇంతకుముందు అనువదించిన వారు గోర్కి రచనలోని ‘ఫీల్‌’ను అనువాదంలోకి తీసుకురాలేక పోయారని సమాధానమిచ్చారు. ‘‘సాహిత్యంలో చేయాల్సింది దండిగా ఉంది. ఇదొక లాంగ్‌ రోడ్‌. అవతల కొస కనిపించని రస్తా. చదువుతూ వుంటే ఏది నచ్చితే అది అనువదిస్తా’’ అన్నారు. 


ప్రపంచ చరిత్ర ఎందుకు రాయాలనిపించిందో మాట్లా డుతూ, తను మెడికల్‌ స్టూడెంట్‌గా వున్నప్పుడే హెచ్‌.జి. వెల్స్‌ రాసిన చరిత్రను అనువదించాలని అనుకున్నట్లు తెలిపారు. తీరా దాన్ని అనువదించే సమయం వచ్చేసరికి అది అసంపూర్ణంగా కనిపించింది. అది రాసి నూరేళ్ళు పైబడింది. దాని తర్వాత చెప్పాల్సింది చాలా వుందని అనిపించిందాయనకు. ఇతర అనేక చరిత్ర పుస్తకాలు చదివి తాను స్వంతంగా ఒక చరిత్రను విద్యార్థుల కోసం రాయాలనిపించి ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ నాల్గు భాగాలు రాశానన్నారు. తెలుగులో వచ్చిన వ్యాకరణాలపై కూడా ఎంవిఆర్‌కు అసంతృప్తి వుంది. బాలల వ్యాకరణం పెద్దలకూ అర్థం కాదంటారాయన. తాను ‘వారెన్‌ అండ్‌ మార్టిన్‌’ గ్రామర్‌ను బేస్‌ చేసుకొని ‘ఇంటింటి వ్యాకరణం’ రాశానని చెప్పారు. తెలుగులో నిఘంటువులపై కూడా ఆయనకు అసహనం ఉంది. ప్రాంతాలు, వృత్తులను బట్టి కొన్ని ప్రత్యేక పదాలు వుండగా వాటి అర్థాలు కూడా భాషా పండితులకు తెలియవని ఎంవిఆర్‌ అంటారు. అటువంటి పదాలకు నిఘంటువుల్లో ఉనికే లేదని అన్నారు. కొన్ని ఉదాహరణలు చెబుతూ ‘‘మహాభారతం విరాటపర్వంలో కౌరవులు రాజ్యాన్ని చుట్టిముట్టినప్పుడు, ఉత్తర కుమారుడు తనకు సరైన రథసారథి లేడనీ, సారథి వుంటే ‘ఎత్తైల గొందు కౌరవుల...’ అని చెప్పే పద్యంలో మన పండితులకు ‘ఎత్తైల’ అన్న పదం ఉందనికూడా తెలియదంటారాయన. ఇది జాలర్లు సన్నని చేపలను ఒక్కసారిగా ఊడ్చి ఎత్తేందుకు వాడే ఒక వల పరికరమని ఆయన తెలిపారు. ఈ పదానికి అర్థం తెలియక టిటిడి ప్రచురిం చిన మహాభారతంలో ఆ పదాన్నే మార్చేశారంటారాయన. అలాగే ద్రౌపది తన భర్తలపై నిష్టూరంతో ‘తేజము పొలిచిన భర్తలు...’ అని కృష్ణుడితో చెప్పిన పద్యంలో కూడా ‘పొలిచిన’ అనే పదానికి ‘ప్రకాశము’ అనే పర్యాయపదంతో అర్థం చెప్పారన్నారు. ఆ సందర్భంలో పొలిచిన అంటే ‘చచ్చిన’ (మరణించిన) అనే అర్థం వస్తుందని ఎంవిఆర్‌ అభిప్రాయం. టిటిడి పండితులతో తనకు అనేక పదాలపై వాదం జరిగిందని, వారు కొన్ని ఆమోదించి మరికొన్ని ఆమోదించలేదని ఎంవిఆర్‌ అంటారు.


ఇటువంటి అనేక సందర్భాలు చూసిన ఎంవిఆర్‌కు ఒక నిఘంటువును తయారు చేయాలనే ఆలోచన ఉంది కానీ, ఈ పరిస్థితులలో సాధ్యం కాదేమోనని నిస్సహాయపడ్డారు. దానికి ముగ్గురు నల్గురు సహాయకుల అవసరం కూడా ఉంటుందన్నారు. మావోయిస్టు-లెనినిస్టు పార్టీ నుండి ఆరంభమైన ఎంవిఆర్‌ తర్వాతి కాలంలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అహింసా పోరాట చరిత్రను ‘ఆయుధం పట్టని యోధుడు’గా రాయడం ఆయనలో సెద్ధాంతిక మార్పుకు చిహ్నమా అనే ప్రశ్నకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తాను విరసం వ్యవస్థాపకుల్లో ఒకరినని, తక్కినవారు శ్రీశ్రీ, దిగంబర కవులు, వరవరరావు, ఆ తర్వాత కెవి రమణారెడ్డి, రావిశాస్త్రి, కాళీపట్నం రామా రావు వంటి దిగ్గజాలు చేరారని తెలిపారు. ఆ కాలంలోనే వరవరరావు మొదలైనవాళ్లు రచయితలందరినీ సామూహికంగా ‘నిబద్ధత’ పేరుతో నియంత్రించచూడడం తనకూ, దిగంబర కవులకూ నచ్చలేదని ఆయన అంటారు. ఆ కారణాలతో విరసం నుండి బయటికి వచ్చిన సమయంలోనే తనలో మార్పు మొదలైందని అన్నారు.  


ఆయన మెడిసిన్‌ పూర్తి అయిన తర్వాత ప్రొద్దుటూరు నుండి ‘ప్రభం జనం’ పత్రిక నడిపారు. ప్రొద్దుటూరు రాజకీ యాల్లో ఎంవిఆర్‌ సృష్టించిన కరపత్ర సాహిత్యం ఒక సంచలనం. ఎమర్జెన్సీలో జైలు జీవితంలోనూ, కార్మికోద్యమ కేసుల్లో జైలు జీవితంలోనూ ఆయన ఊరకే కూర్చోలేదు. పుస్తకాలు అనువదించారు, కథలు రాశారు. రాయలసీమ సమస్యల పోరాటంలో ఆమరణ దీక్షకు దిగిన సందర్భంలో ఆయన రాసిన ‘రాయలసీమ కన్నీటిగాథ’ ఇప్పటికి లక్షకాపీలు దాటిపోయింది. ఇప్పటికీ రాయలసీమ వాదులకు ఈ పుస్తకం ఒక దారిదీపం. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒకపక్క ప్రొద్దుటూరు రాజకీయాలలో కీలక భూమిక నిర్వహిస్తూనే, ఆర్‌కె నారాయణ్‌ రాసిన ‘ఎ టైగర్‌ ఇన్‌ మాల్గుడి’ పుస్తకాన్ని హెచ్‌బిటి కోసం ‘పెద్ద పులి ఆత్మకథ’గా అనువదించారు. మార్గరెట్‌ మిఛల్‌ రాసిన ‘గాన్‌ విత్‌ విండ్‌’ను ‘చివరికి మిగిలింది’గా అనువదించారు. నుడికారం, కండకలిగిన తెలుగును సమర్థవంతంగా అను వాదాల్లోకి తీసుకువచ్చిన అతికొద్దిమంది తెలుగు రచయి తల్లో ఎంవిఆర్‌ ఎత్తుపీటన నిలుస్తారు.




చాలామందికి వెంటిలేటర్‌ మీదికి పోగానే ప్రాణంమీద ఆశ సన్నగిల్లుతుంది. ఇదే ప్రశ్న ఎం.వి. రమణారెడ్డిని అడిగితే - ‘‘ఏమయితుందో అని భయపడినా జరిగేది జరగక మానదు. అటువంటి దానికి భయపడడం దండగ. చేయాలనుకున్నది చేసుకుంటూ పోవడమే. ఇప్పుడదే చేస్తున్నాను’’ అంటారు. ఇంతటి గడ్డుదెసలో సాహిత్యాన్ని ఊపిరిచేసుకున్న రచయితలు బహుశా చరిత్రలో ఎవ్వరూ లేరేమో. మక్సిమ్‌ గోర్కి తొలినుండీ అనారోగ్యంతో బాధ పడుతూనే రచనలు చేసినా, పూర్తి మెత్తబడిన తర్వాత ఏమీ రాయలేదు. జాన్‌మిల్టన్‌ చూపు పోయిన తర్వాత ‘ప్యారడైజ్‌ రీగెయిన్డ్‌’ రాశారు (సహాయకుడికి చెబుతూ రాయించారు). తెలుగులో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు రేచీకటి వ్యాధి తీవ్రమైన అవస్థలో కొంత రచన చేశారు. అందే నారాయణ స్వామి మలేరియాకు అప్పుడ ప్పుడే మార్కెట్‌లోకి వచ్చిన ‘క్లోరోక్విన్‌’ అధిక మోతాదులో తీసుకోవడంతో కంటిచూపు కోల్పోయారు. గుడ్డితనం వచ్చాక ఆయన ఐదారు కథలు రాశారు. యు.ఎ.నరసింహ మూర్తి చూపు కోల్పోయాక భార్య సహాయంతో కొన్ని సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. వీరందరికంటే, ఇంతటి సమవస్థలో రచనలు చేసిన సాహిత్యకారుడిగా ఎం.వి.రమణారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.

పాలగిరి విశ్వప్రసాద్‌

98665 11616


Updated Date - 2021-07-19T05:51:55+05:30 IST