ఆన్‌లైన్‌ వెంబడి..కరోనా చెబుతున్న పాఠం

ABN , First Publish Date - 2020-06-07T07:38:33+05:30 IST

చేతిలో లంచ్‌ బాక్సు. భుజాలకు పుస్తకాల సంచి. అమ్మానాన్నకు టాటా చెబుతూ బడికి వెళ్లే రోజులు పోతున్నాయి. తరగతి గదిలో గురువు చెప్పే పాఠం వింటూ..

ఆన్‌లైన్‌ వెంబడి..కరోనా చెబుతున్న పాఠం

బడి ఎప్పుడు తెరుస్తారో తెలియక..

బోధన మొదలెట్టిన ప్రైవేటు, కార్పొరేటు

కొత్త పద్ధతిపై భిన్నాభిప్రాయాలు


కర్నూలు (కల్చరల్‌), జూన్‌ 5: చేతిలో లంచ్‌ బాక్సు. భుజాలకు పుస్తకాల సంచి. అమ్మానాన్నకు టాటా చెబుతూ బడికి వెళ్లే రోజులు పోతున్నాయి. తరగతి గదిలో గురువు చెప్పే పాఠం వింటూ.. మధ్య మధ్యలో సందేహాలను నివృత్తి చేసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. మాస్టారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు స్నేహితులతో పోటీపడే సందర్భాలు ఇక ఉండకపోవచ్చు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు పట్టుకొని ఇంటిపట్టునే పాఠాలు వినాల్సి వస్తోంది. కొవిడ్‌-19 ప్రభావం విద్యారంగంలో పెను మార్పులకు కారణమౌతోంది. చిన్నారులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు సందేహిస్తున్నారు. ఒకచోట కుదురుగా ఉండరు. సమూహంలా కలిసిపోతారు. ఇది ఎలాంటి సమస్యలను తెస్తుందోనని భయపడుతున్నారు. 


ఆల్‌లైన్‌ పాఠం

విద్యా సంవత్సర ప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆగస్టు 3 నుంచి అని ప్రభుత్వం ప్రకటించినా, ఇంకా సందేహాలు వీడలేదు. అందుకే కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడం ప్రారంభించాయి. ఈ మార్పు తాత్కాలికమే అని వారు అంటున్నారు. బడి మొదలయ్యే లోగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోడానికి ఉపయుక్తంగా ఉంటాయని సమర్థించుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ బోధన (రికార్డు చేసిన పాఠ్యాంశాలు స్ర్కీన్‌పై ప్రదర్శించడం) ఉంటుందని కూడా అంటున్నారు. ఎంతైనా.. నేరుగా విద్యార్థికి, ఉపాధ్యాయునికి మధ్య ఏర్పడే గురుశిష్య బంధంతో పోలిస్తే ఇవి తేలిపోతాయి. పాఠాలు వింటున్నారా లేదా అన్నది ఉపాధ్యాయులు తరగతి గదిలో మాత్రమే గమనించగలరు. ఆన్‌లైన్‌లో ఇది ఏమాత్రం సాధ్యం కాదు. 


వాళ్లు మొదలు పెట్టారు

ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు డిజిటల్‌ బోధనకు అప్పుడే తెరతీశాయి. వారం రోజులుగా ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నాయి. ఒక్కో సబ్జెక్టును అరగంటకు పైగా బోధిస్తున్నారు. అసైన్‌మెంట్లు, రికార్డులు ఇస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, లంచ్‌ బ్రేక్‌ తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం రోజుకు నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులను బోధిస్తున్నారు. తల్లిదండ్రుల వాట్సాప్‌ గ్రూపులను క్రియేట్‌ చేసి అసైన్‌మెంట్లు ఇస్తున్నాయి. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ పాఠాల చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటర్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు చేసే విద్యార్థులు ప్రైవేట్‌ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను వింటున్నారు. 


విద్యార్థులకు నష్టం

ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా పేద విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. వీరి తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్‌ సిస్టమ్‌లు కొనిచ్చే పరిస్థితి లేదు. పైగా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయారు. చిన్నచిన్న కుటుంబాల్లో పాఠ్య పుస్తకాల కొనుగోలు, ఫీజులు చెల్లించడమే ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో ఆన్‌లైన్‌ తరగతులు కష్టాలను జోడిస్తాయి. నెట్‌ సరిగా లేని ప్రాంతాల్లో అసలే పాఠాలు వినలేదు. సాధారణంగా తల్లిదండ్రుల ఫోన్లనే పిల్లలు వినియోగిస్తారు. మధ్యలో కాల్స్‌ వస్తే ఇబ్బందులు తప్పవు. పైగా చిన్నారుల కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. డిజిటల్‌ తరగతులు అర్థం కావాలంటే ఆంగ్లంలో పట్టు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఇది ఇబ్బందికర పరిస్థితి. ఆన్‌లైన్‌ క్లాసులు కాలేజీ విద్యార్థులకు మాత్రమే ఉపయుక్తంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 


ఆహ్వానించదగ్గ పరిణామం

ఆన్‌లైన్‌ బోధనలు ఆహ్వానించదగ్గ పరిణామమే. కరోనా వైరస్‌ నేపథ్యంలో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. దీంతో కొన్నాళ్లు ఇంట్లోనే ఉండి విద్యనభ్యసించడం మంచిది. ఈ లెర్నింగ్‌ విధానం వల్ల పిల్లల్లో పాజిటివ్‌ దృక్పథం కూడా పెంపొందించవచ్చు. మా అకాడమీలో యూసీ మాస్‌ అబాకస్‌లో శిక్షణ ఇస్తున్నాం. 4 నుంచి 10వ తరగతి వరకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌, హిందీ చెబుతున్నాం. ఇంటరాక్టివ్‌ విధానంలో చెప్పడంతో విద్యార్థులు అలవాటు పడ్డారు. పీపీటీలు, యానిమేటెడ్‌ వీడియోస్‌, డిజిటల్‌ పెన్‌ట్యాబ్స్‌, వెబ్‌ క్యామ్స్‌ సహాయంతో లైవ్‌ క్లాసులను ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధానం పట్ల తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

- రూప, రైమ్స్‌ అకాడమీ డైరెక్టర్‌, కర్నూలు 



ఆధునిక పరిజ్ఞానం అవసరమే...

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అవసరం. పై తరగతుల్లో వినాల్సిన ఆన్‌లైన్‌ క్లాసులను పాఠశాల స్థాయిలోనూ వినాల్సి వస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇది తప్పనిసరి అయింది. ఈ శిక్షణ సత్ఫలితాలు ఇవ్వాలంటే మంచి టీచర్‌తో పాఠాలు చెప్పించాలి. మంచి ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, కంప్యూటర్‌ వంటి పరికరాలు ఇవ్వాలి. ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. లేదంటే ప్రయోజనం ఉండదు. 

- జి. పుల్లయ్య, డైరెక్టర్‌, రవీంద్ర విద్యాసంస్థలు, కర్నూలు 



విద్యార్థులు నష్టపోకుండా...

ఆన్‌లైన్‌ బోధనలు తాత్కాలికమే. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. ఆన్‌లైన్‌ బోధన వల్ల విద్యార్థులు వందశాతం లబ్ధి పొందలేరు. కేవలం 20 శాతం మాత్రమే సాధ్యం. 80 శాతం బోధన మళ్లీ తరగతి గదిలో కొనసాగాల్సిందే. పేద, మధ్య తరగతి విద్యార్థులకు కొంత ఇబ్బందికరమే.

- బి.వాసుదేవయ్య, రాష్ట్ర సలహాదారు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య సంఘం


తరగతి గదే అత్యుత్తమం..

తరగతి గదికి జీవం ఉంటుంది. ఆన్‌లైన్‌లో అది ఉండదు. తరగతి గదికి మించిన బోధన ఇంకెక్కడా లేదు. తరగతి అంటేనే అక్కడ ఏదో తెలుసుకోవాలనే భావన ప్రతి విద్యార్థిలో ఏర్పడుతుంది. విద్యార్థికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే విజ్ఞాన భాండాగారం తరగతి గది. గురుశిష్యుల మధ్య అనుబంధం కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. తరగతి గదిలో ఏక బిగిన పాఠాలు చెప్పరు. మధ్యమధ్యలో చలోక్తులు, హాస్య సందర్భాలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. ఆన్‌లైన్‌లో ఇవి ఉండవు. - డాక్టర్‌ ఎం.హరికిషన్‌, ఉపాధ్యాయుడు, బాలల కథా రచయిత

Updated Date - 2020-06-07T07:38:33+05:30 IST