వామపక్షాలు కేంద్రంగా ఐక్య ప్రత్యామ్నాయం

ABN , First Publish Date - 2022-01-25T07:32:16+05:30 IST

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే వామపక్ష శక్తులు

వామపక్షాలు కేంద్రంగా ఐక్య ప్రత్యామ్నాయం

  •  బీజేపీని నిలువరించేందుకు ఇది అవసరం
  •  అప్పుడే టీఆర్‌ఎస్‌ అరాచకాలకు అడ్డుకట్ట
  •  సీపీఎం రాష్ట్ర కార్యవర్గ భేటీలో తీర్మానం
  •  రామానుజ విగ్రహం ఏర్పాటు వెనుక రాజకీయ, మత ఉద్దేశాలు : తమ్మినేని


హైదరాబాద్‌, హయత్‌నగర్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే వామపక్ష శక్తులు కేంద్రంగా ప్రజాతంత్ర, సామాజిక శక్తుల ఐక్య ప్రత్యామ్నాయమే కీలకమని సీపీఎం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఇస్తున్న ప్రాధాన్యం ప్రజల సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని, ఎన్నికల వాగ్దానాల అమలులో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆరోపించింది.


రాష్ట్రంలో వివిధ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని ఆసరా చేసుకుని బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున ఆ పార్టీ నుంచి ప్రమాదం ముంచుకొస్తోందని పేర్కొంది. మోదీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేశారని ఆరోపించింది. వివాదాలకు, మత కొట్లాటలకు కేంద్రమైన చార్మినార్‌ను ఆనుకుని ఉన్న ఆలయం నుంచే ఈ పాదయాత్ర ప్రారంభించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజేపీని నిలువరించేందుకు, టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పాలనను అడ్డుకునేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక శక్తుల ప్రత్యామ్నాయం అవసరమని స్పష్టం చేసింది.


రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదిత రామానుజ విగ్రహం ఏర్పాటు వెనుక భక్తి, విశ్వాసాలతో పాటు రాజకీయ, మత ఉద్దేశాలు కూడా ఉన్నాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కొన్ని మతాల ఆధిపత్యాన్ని పెంచే కుట్ర ఉందన్నారు. డబ్బులిచ్చి భూములు కొనుగోలు చేసి పేదలకు ఆ భూములు ఇవ్వడం సాధ్యం కాదని, భూస్వాముల నుంచి భూములు తీసుకుంటేనే ఆ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంత మతోన్మాదంతో కాంగ్రెస్‌ రాజీ పడుతోందని తమ్మినేని ఆరోపించారు.


కాషాయ విషం పల్లెల్లోకి చొచ్చుకుపోతే కమ్యూనిస్టు పార్టీలకు పూర్వ వైభవం కలగానే మిగిలిపోతుందన్నారు. ఇది జరగకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక, సాంస్కృతిక పోరాటాలను మిళితం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. కాగా, రాష్ట్రంలో బీజేపీని నిలువరిస్తామని, టీఆర్‌ఎస్‌ను అడ్డుకుంటామని సీనియర్‌ నేతలు ఎస్‌. వీరయ్య, నాగయ్యలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేసిందని ఆరోపించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీతోపాటు ఇతర పరిశ్రమలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 


 తీర్మానాలు ఇవీ.. 

తెలంగాణాపై కేంద్రం వివక్ష, నిర్లక్ష్యం విడనాడాలి.. ఇతోధికంగా సాయం చేయాలి. గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతానికి రిజర్వేషన్‌ పెంచాలి. వ్యవసాయ ఉత్పత్తులకు శాస్త్రీయంగా మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలి. ఈ రంగం సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ ప్రణాళిక రూపొందించాలి. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేంద్రం సమగ్ర శాసనం చేయాలి. దళితుల సంక్షేమానికి ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేయాలి. చేతివృత్తిదారుల ఉపాధికి చర్యలు తీసుకోవాలి.


మైనారిటీల సంక్షేమానికి నిధులు పెంచాలి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ చేయవద్దు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను వెంటనే ఉప సంహరించుకోవాలి. కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వ పథకాలు వర్తింప జేయాలి. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నిర్ధిష్టకాలంలో పూర్తిచేయాలి. ధరణి లోపాలు సరిచేసి తక్షణం పాసుపుస్తకాలు ఇవ్వాలి. సింగరేణి బ్లాకుల వేలం నిలిపివేయాలి. జాతీయ పెన్షన్‌ పథకం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి. 



Updated Date - 2022-01-25T07:32:16+05:30 IST