మైలవరం జలాశయం ఎడమగట్టు మట్టిపనులు పూర్తి

ABN , First Publish Date - 2021-11-28T04:57:48+05:30 IST

మైలవరం జలాశయానికి 300 మీటర్ల దూరంలో ఎడమగట్టుకు పడిన రంద్రం వద్ద శనివారంతో పనులు పూర్తయ్యాయి.

మైలవరం జలాశయం  ఎడమగట్టు మట్టిపనులు పూర్తి
మైలవరం ఎడమగట్టుకు నూతనంగా వేసిన మట్టికట్ట

మైలవరం, నవంబరు 27: మైలవరం జలాశయానికి 300 మీటర్ల దూరంలో ఎడమగట్టుకు పడిన రంద్రం వద్ద శనివారంతో పనులు పూర్తయ్యాయి.  ఈ నెల 20వ తేదీన మైలవరం నుంచి పెన్నానదికి 1,60,000 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఎడమగట్టు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని జలాశయం అధికారులు అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం. కలెక్టర్‌ ఆదేశాలతో జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు జలా శయ అధికారులు దగ్గరుండి వెంటనే తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టి  ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మైల వరం జలాశయం నుంచి పెన్నాకు వరద ఉధృతి తగ్గడంతో వారం రోజులు గా ఇక మట్టికట్టకు ఎలాంటి ముప్పులేకుండా ఎడమగట్టు దెబ్బ తిన్న చోట ఎత్తు 26 అడుగులు, వెడల్పు 15 మీటర్లు, పొడవు 70 మీటర్ల మేర రాళ్లు, మట్టికట్టను ఏర్పాటుచేశారు. మైలవరం జలాశయం నుంచి పెద్ద ఎత్తున  పెన్నానదికి నీరు విడుదల చేసిన కట్ట తెగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జలాశయం అధికారులు తగుచర్యలు తీసుకున్నారు. దీంతో పెన్నాకు భారీ వరద వచ్చిన ఇక ఇబ్బందులు ఉండవని అధికారులంటున్నారు.

 పెన్నాకు కొనసాగుతున్న నీటి విడుదల

మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కొనసాగుతుంది.  పెన్నానదికి 9,146 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జలాశయ ఏఈఈ గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి  మైలవరానికి ఇన్‌ప్లో పెరిగితే పెన్నాకు మరింత నీటిలో వదిలే అవకాశం ఉన్నందున పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం  జలాశయంలో 3.133 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

గండికోట నుంచి మైలవరానికి 5వేల క్యూసెక్కులు 

కొండాపురం, నవంబరు 27: గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి ప్రస్తుతం 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీబీఆర్‌తో పాటు వరదనీరు ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. వచ్చేనీటిని యథాతథంగా మైలవరం జలాశయానికి వదులుతున్నారు. కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 23.81టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-11-28T04:57:48+05:30 IST