పేదల ఇళ్ల స్థలాలను కాజేస్తున్న అధికార పార్టీ నాయకులు

ABN , First Publish Date - 2021-09-29T06:37:03+05:30 IST

పట్టణంలో పేదల ఇళ్ల స్థలాలను కొందరు అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు.

పేదల ఇళ్ల స్థలాలను కాజేస్తున్న అధికార పార్టీ నాయకులు
భారీ బేస్‌మెంటును కాదని ఇతర బేస్‌మెంట్లను కూల్చేసిన దృశ్యం

ప్రభుత్వం రద్దు చేసిందంటూ ప్రచారం

ఆపై యథేచ్ఛగా కబ్జా చేసి, అమ్మేస్తున్న వైనం

గుంతకల్లు, సెప్టెంబరు 28: పట్టణంలో పేదల ఇళ్ల స్థలాలను కొందరు అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. స్థలాలను కబ్జా చేసి, అమ్ముకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఖాళీగా కనిపించే ఇళ్ల స్థలాలపై కన్నేసి, దందా నడుపుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిందంటూ లబ్ధిదారుల నుంచి స్థలాలను లాగేసుకుని, అమ్ముకుంటున్న ఉదంతాలు గుంతకల్లులో కోకొల్లలు. విషయం తెలిసి డీఎస్పీ.. సంబంధిత నాయకులను పిలిచి, వార్నింగ్‌ కూడా ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధి కూడా వారిని హెచ్చరించారు. అయినా.. వారి తీరు మారలేదు. ప్రభుత్వం గృహ నిర్మాణ రుణాలను మంజూరుచేస్తే నిర్మించుకుందామని ఎదురుచూస్తున్న పేదలకు ఈ కబ్జాదారులు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. దోనిముక్కల రోడ్డులో పేదల స్థలాల్లో కొందరు భారీ బేస్‌మెంట్లను వేసి, కబ్జా చేసేశారు. పదహారు భారీ బేస్‌మెంట్లను నిర్మించారు. ఒకే వరుసలో వీటిని ఎవరు వేశారో రెవెన్యూ అధికారులు తేల్చాలి. నోరెత్తలేని లబ్ధిదారుల బేస్‌మెంట్లను ఎక్స్‌కవేటరుతో పెకలించిన వైసీపీ నాయకులు వాటి రాళ్లను కూడా అమ్మేశారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.


కబ్జాలకు అంతే లేదు..

ఇళ్లు నిర్మించుకోలేదు కనుక ప్రభుత్వం పట్టాలను రద్దు చేసిందంటూ అసత్య ప్రచారాలు మొదలెట్టారు. అలా పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాలకు తూర్పు వైపున ఉన్న ఎస్సీ కాలనీలో నివేశన స్థలాలను లాగేసుకున్నారు. ఈ స్థలాలను ప్రభుత్వం ఏళ్ల కిందట పేదలకు పం చింది. ఈ ప్రాంతం ఊరికి దూరంగా ఉండటంతో అక్కడ ఇళ్లను నిర్మించుకుని చేరడానికి ఇన్నాళ్లూ లబ్ధిదారులు సుముఖత చూపలేదు. ఇటీవలే కాలనీలు విస్తరించడంతో ఒక్కొక్కరు గా ఇక్కడ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. స్థలాలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా డి మాండ్‌ రావడంతో కబ్జాదారుల కన్ను ఈ కాలనీపై పడింది. తహసీల్దార్‌ స్థలాలను రద్దు చేశారంటూ కొందరు ఇక్కడ కబ్జాలకు తెరలేపారు. ఖాళీ స్థలాలను కాజేసి, అమ్మకానికి పెట్టారు. ఇటీవల దోనిముక్కల రోడ్డులోని స్థలాలను కాజేయడానికి యత్నించి, విఫలమయ్యారు.


డీఎస్పీ వార్నింగ్‌?

స్థలాల కబ్జాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకుల్లో ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరిని ఇక్కడ ఇటీవల రిలీవ్‌ అయిన ఇనచార్జ్‌ డీఎస్పీ చైతన్య పిలిపించి, తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. ఇంకోసారి ఫిర్యాదులు వస్తే సహించేది లేదంటూ వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంగా పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే మందలించినట్లు తెలిసింది. ఇప్పటికైనా స్థలాల ఆక్రమణలను అరికట్టి, లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.



Updated Date - 2021-09-29T06:37:03+05:30 IST