అధికారపార్టీ నేతల ఆగడాలు

ABN , First Publish Date - 2020-08-13T07:25:20+05:30 IST

గ్రామాల్లో పేద ప్రజలు వలస వెళ్లకుండా ఉన్న చోటే పని కల్పించేందుకు ప్రారంభించిన ఉపాధి హామీ పథకం కొందరు అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారింది. ఉపాధి పనులకు వెళ్లపోయినా వా

అధికారపార్టీ నేతల ఆగడాలు

 నేతకు ‘ఉపాధి’ మేత!

 కూలీల కష్టం దోపిడీ..

 పట్టణాల్లో కాపురాలు.. పల్లెల్లో పనులు పనిచేసినట్లు రికార్డులు

 ప్రతి వారం ఉపాధి బిల్లులు

 వైసీపీ కన్వీనర్‌ నుంచి నాయకుల వరకు మంజూరు

 ఉపాధి హామీ పథకంలో అక్రమాల పర్వం


కదిరి/గాండ్లపెంట, ఆగస్టు 12: గ్రామాల్లో పేద ప్రజలు వలస వెళ్లకుండా ఉన్న చోటే పని కల్పించేందుకు ప్రారంభించిన ఉపాధి హామీ పథకం కొందరు అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారింది. ఉపాధి పనులకు వెళ్లపోయినా వారంవారం కూలి మాత్రం వారి ఖాతాల్లో జమవుతోంది. వారమంతా కష్టపడి పనిచేసే కూలీల కష్టంతో వైసీపీ నాయకులు లక్షల రూపాయలు దండుకుంటున్నారు. కష్టం కూలీలది.. వేతనం వైసీపీ నాయకులది అన్న తరహాలో అక్రమాలు సాగుతున్నాయి.


వీటిని అడ్డుపెట్టుకుని, కొన్ని మండలాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూడా కొన్ని జాబ్‌ కార్డులలోని కూలీలు పనులకు రాకున్నా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గాండ్లపెంట మండలంలో వైసీపీ నాయకులకు ఉపాధి హామీ పనులు జేబులు నింపే అదాయవనరుగా మారాయి.


పనికి వెళ్లకున్నా.. బిల్లులు

గాండ్లపెంట మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో అధికార పార్టీ నాయకులు ఎక్కువ భాగం పనులకు వెళ్లకుండానే ప్రతి వారం బిల్లులు తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులు మంజూరు చేసినపుడు నాయకుల పేర్లు నమోదు కావటంతోపాటు పనులు చేయకపోయినా బిల్లులు చేసుకుంటున్నట్లు ఆన్‌లైన్‌ జాబితా బహిర్గతం చేస్తోంది.


తూపల్లి గ్రామ పంచాయతీలో జాబ్‌కార్డు నెంబరు ఏపీ-12-043-005-005, ఐడీ నెంబరు 150052పై మే నెల నుంచి జూలై వరకు కదిరి పట్టణంలో కాపురం ఉంటున్న వైసీపీ కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన భార్య మాజీ ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి ప్రసన్న పనులు చేసి, బిల్లులు పొందినట్లు ఆన్‌లైన్‌ జాబితాలో నమోదైంది.


తుమ్మలబైలు పంచాయతీలో సహకార బ్యాంకు త్రిసభ్య కమిటీ సభ్యుడిగా ఉన్న రవీంద్రనాయక్‌, ఆయన భార్య కళావతి జాబ్‌కార్డు నెంబర్‌ ఏపీ-12-043-002-002, ఐడీ నెంబరు 030048పై 80 రోజులు పనిచేసి, బిల్లులు తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదైంది.


కొన్ని సంవత్సరాలుగా కదిరి పట్టణంలో స్థిరపడి, వ్యాపారాలు చేసుకునే వారికి మండల కేంద్రంలో కిరాణా, వస్త్ర దుకాణాలు, మెడికల్‌షాపు నిర్వాహకులకు కూడా ఉపాధి పనుల బిల్లులు మంజూరరయ్యాయి. ప్రతి వారం ఒక్కో నాయకుడికి రూ.900 నుంచి రూ.1200 వరకు బిల్లులు మంజూరవుతున్నాయి. వైసీపీ కన్వీనర్‌ నుంచి ఓ మోస్తరు నాయకుడి వరకు బిల్లులు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


చేతి వాటం ప్రదర్శిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

వైసీపీ అధికారంలోకి రాగానే గతంలోనే పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారు. వైసీపీ కార్యకర్తలను నియమించుకుని, ప్రతి గ్రామ పంచాయతీలో 10 నుంచి 20 మంది అధికార పార్టీ నాయకులు పనులు చేయకుండానే లబ్ధి పొందుతున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి.


వైసీపీ నాయకులతోపాటు ఉపాధి పనులను పర్యవేక్షించి, మస్టర్లలో పేర్లు నమోదు చేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూడా పనులు చేయక పోయినా వారి కుటుంబ సభ్యుల పేర్లు మస్టర్లలో చేర్చి, బిల్లులు పొందుతున్నట్లు ఆన్‌లైన్‌లో పొందుపరచిన జాబితా ద్వారా తెలుస్తోంది.


గతంలో నంబులపూలకుంట మండలంలో కొంతమంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు జాబ్‌ కార్డులు ఉండి, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లు కూలీల జాబితాలో చేర్చి బిల్లులు పొందినట్లు అరోపణలు వెల్లువెత్తాయి. కొన్నిరోజుల కిందట అందోళన కూడా సాగింది. బిల్లులు సక్రమంగా చెల్లించలేదనీ, తమకు కావాల్సిన వారి పేర్లు అదనంగా చేర్చుకుంటున్నారని లాక్‌డౌన్‌కు ముందు తలుపుల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కూలీలు ధర్నా చేశారు. పనులు చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నా, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. 


మాట వినకుంటే మార్పే..

 గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు.. వైసీపీ నాయకుల మాట వినకుంటే మార్పు తప్పదు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మండలాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. నంబులపూలకుంట మండలంలోని పీ కొత్తపల్లిలో గతంలో ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తమ మాట వినలేదని అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించుకున్నారు. అలాగే వంకమద్ది ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను హోల్డ్‌లో పెట్టారు.


స్థానిక నాయకులు తమ వారికి బిల్లులు చేయలేదన్న కారణంగా ఇలా చేసినట్లు సమాచారం. తమ వారు పనులు చేయకున్నా బిల్లులు చేయాలనీ, తాము చెప్పిన చోటే పనులు పెట్టాలని హుకుం జారీ చేశారు. దీనికి ఫీల్డ్‌ అసిస్టెంట్‌  ఒప్పుకోలేదు. దీంతో ఆయనపై కక్ష సాధిస్తున్నట్లు అరోపణలు ఉన్నాయి. తనకల్లు మండలంలో కూడా తమ మాట వినని ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించటానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.


బిల్లుల మంజూరుపై విచారణ చేయిస్తాం:హారున్‌రషీద్‌, ఏపీఓ, గాండ్లపెంట

మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కూలీల్లో 189 మంది ఈ పాటికే 100 రోజుల పనులు పూర్తి చేశారు. ప్రతి వారం మస్టర్లలో వచ్చే పేర్ల ఆధారంగా బిల్లుల కోసం పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. పనులు చేయకుండానే బిల్లులు మంజూరు చేశారని వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. అక్రమాలకు పాల్పడి ఉంటే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-08-13T07:25:20+05:30 IST