దేశం ఎదురుచూస్తున్న నేత

ABN , First Publish Date - 2022-10-05T06:50:31+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకున్నాం. రెండు శతాబ్దాల పాటు పరాయి పాలకుల చేతుల్లో చిక్కుకున్న మన దేశానికి స్వాతంత్య్ర సాధన కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు...

దేశం ఎదురుచూస్తున్న నేత

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకున్నాం. రెండు శతాబ్దాల పాటు పరాయి పాలకుల చేతుల్లో చిక్కుకున్న మన దేశానికి స్వాతంత్య్ర సాధన కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు. స్వాతంత్య్ర ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలన్న సత్సంకల్పంతో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. అట్టడుగు ప్రజలకూ సంక్షేమం సమకూరేలా దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిపథంలో నడిపించాల్సిన బాధ్యతను అధికారం చేపట్టిన నాయకుల చేతుల్లో పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తూ పాలకుల చిత్తశుద్ధి లోపించింది. అధికారం కోసం ఆరాటంలో భాగంగా, నమ్మి గెలిపించిన ప్రజలకు వెన్ను చూపిన జాతీయ పార్టీలు సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం అభివృద్ధిలో మాత్రం అన్ని దేశాలకు ఆదర్శంగా ఉండి పెద్దన్న పాత్ర పోషించలేకపోతోంది. అపార ఖనిజసంపద, వెలకట్టలేని మానవవనరులు ఉన్నా అభివృద్ధిలో మాత్రం మన దేశం నేలచూపులు చూస్తూనే ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని యేండ్లు గడుస్తున్నా దేశ ప్రజలకు సాగు నీరు, తాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. 


దేశంలో సాగునీటి విషయానికి వస్తే నదీ జలాల వినియోగంలో స్పష్టమైన ఒక జాతీయ కార్యాచరణ లేదన్నది సుస్పష్టం. వివిధ రాష్ర్టాల మధ్య నదీ జలాలకు సంబంధించి అనేక కేసులు ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్నాయి. ఈ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ర్టాలకు ఒక పరిష్కార మార్గాన్ని సూచించలేకపోయాయి. మరోవైపు కొన్ని వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. జాతీయ స్థాయిలో అధికారం నిలవాలంటే రాష్ర్టాల్లో అధికారం చేపట్టాలన్న ఆకాంక్ష దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా చేస్తోంది. తాము అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి బీజేపీ దొడ్డిదారిన కుట్రలు చేసిన సందర్భాలు అనేకం. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే దేశంలో సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లాలి. ప్రాంతీయ పార్టీలు కూడా దేశ ప్రగతిలో భాగస్వామ్యమన్న విషయాన్ని జాతీయ పార్టీలు గుర్తించాలి. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి రాష్ర్టాలకు, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడానికి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వెనుకాడడం లేదు. 


అభివృద్ధి చేయడం మరిచి అధికారాన్ని అడ్డంపెట్టుకొని దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా బీజేపీ విధానాలు ఉన్నాయి. దేశప్రజలకు కూడు, గుడ్డ, నీరు వంటి కనీస వసతులు అందించడంలో రాష్ట్రాల భాగస్వామ్యంతో పనిచేయాలన్న సోయి బీజేపీకి లేదు. అదే క్రమంలో ఎనిమిదేండ్లుగా దేశంలో అధికారం నిలబెట్టుకోవడానికి విద్వేష రాజకీయాలకు బీజేపీ తెరతీసింది. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఇదొక ప్రమాదకరమైన పరిణామం. అంతర్జాతీయ సమాజంలో భారతదేశ ప్రతిష్ఠకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విద్వేష, ప్రతీకార రాజకీయాల నుంచి అభివృద్ధి, సంక్షేమం దిశగా దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యామ్నాయ ఎజెండా వైపు దేశ ప్రజల దృష్టిని మరల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఈ క్రమంలోనే మహాత్ముని అడుగుజాడల్లో అలుపెరుగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి సమైక్య పాలనలో ఆగమైపోయిన తెలంగాణను ఎనిమిదేండ్లలో అభివృద్ధి చేసి దేశ ప్రజలు ముందు ఉంచిన మహోజ్వల సందర్భాన్ని మనం చూస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి. రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నాడు నీళ్లు లేక నోళ్లు తెరుచుకున్న బీడుభూములు కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టులతో దాహార్తిని తీర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చని పైర్లతో కళకళలాడుతున్న సందర్భం. మిషన్‌ భగీరథతో రాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించడం జరుగుతోంది. ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టడం జరిగింది. మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం పల్లె ప్రగతిని చేపట్టడం జరిగింది. తద్వారా గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పట్టణ ప్రగతితో నగరాల్లో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. తెలంగాణ రాష్ర్టాన్ని హరితవనం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం రాష్ర్టానికి పచ్చలహారంగా మారి భవిష్యత్‌ తరాలకు గొప్ప భరోసాను అందించింది. నాడు కొలువులు లేక వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు నేడు సొంత రాష్ర్టానికి వాపస్‌ వస్తున్నారు. పెద్దఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషిచేయడం జరిగింది. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడం జరుగుతోంది. 


బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టడానికై దేశ ప్రజలను మభ్యపెట్టిన ఫేక్‌ గుజరాత్‌ మోడల్‌ ప్రస్తుత బంగారు తెలంగాణ మోడల్‌ ముందు వెలవెలబోతోంది. తెలంగాణకు హక్కుగా రావల్సిన నిధులు విడుదల చేసి అభివృద్ధిలో చేయూతను ఇవ్వకపోగా ప్రతీకార చర్యలకు బీజేపీ పూనుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టాల హక్కులను కాపాడే ఒక జాతీయ నాయకత్వం అవసరం ఏర్పడింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎందుకు జరగడం లేదన్న చర్చ ఏర్పడిన క్రమంలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడటానికి ఒక భరోసాగా కేసీఆర్‌ వైపు దేశం చూస్తోంది. 75 ఏండ్లుగా నెరవేరని ప్రజల ఆకాంక్షలలోంచి ఇది ఉద్భవించింది. దేశ యువజనులు ప్రపంచ దేశాలకు వలస వెళ్లుతున్న సందర్భంలో ఒక భరోసా అవసరం. దేశానికి తెలంగాణ మోడల్‌ కావాలి. దేశంలో ప్రతీ ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆస్వాదిస్తున్నట్లే అభివృద్ధి ఫలాలను ఆస్వాదించాలి. దేశ ప్రజల మౌలిక అవసరాలు నెరవేరి దేశాన్ని అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా చేసి, దేశ యువతకు భరోసా కల్పించేందుకు కేసీఆర్‌ నాయకత్వం అవసరం. అందుకే కేసీఆర్‌ వైపు దేశం చూస్తోంది. దేశానికి కావవసింది మాటల నాయకుడు కాదు. చేతల నాయకుడు. ప్రజల అవసరాలను గుర్తెరిగి వాటిని తీర్చగల సమర్థ నాయకత్వం నేడు దేశానికి అవసరం. ఒక్క కేసీఆర్‌తోనే అది సాధ్యమవుతుందని ఎనిమిదేండ్ల తెలంగాణ పురోగతి సాక్షిగా యావద్భారతీయులు గుర్తించిన సత్యం. అందుకే తెలంగాణ వైపు దేశం చూస్తోంది. కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది.

బాల్క సుమన్‌

ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే

Updated Date - 2022-10-05T06:50:31+05:30 IST