సాఫీగా చివరి మజిలీ..

ABN , First Publish Date - 2022-01-24T05:18:04+05:30 IST

మనిషి బతికున్నంత కాలం వారిని కుటుంబీకులు ఎలా చూసుకుంటారో.. మరణం తర్వాత కూడా వారి అంత్యక్రియలను అన్ని మర్యాదలతో నిర్వహించాలని, సకల మర్యాదలతో సాగనంపాలని కోరుకుంటారు.

సాఫీగా చివరి మజిలీ..
తిమ్మాయిపల్లిలో వైకుంఠధామానికి నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌

  • గ్రామాల్లో అందుబాటులోకి వైకుంఠధామాలు
  • మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 61పంచాయతీల్లో నిర్మాణం
  • సొంతభూమి లేని వారికి తప్పిన ఇబ్బందులు

   మనిషి బతికున్నంత కాలం వారిని కుటుంబీకులు ఎలా చూసుకుంటారో.. మరణం తర్వాత కూడా వారి అంత్యక్రియలను అన్ని మర్యాదలతో నిర్వహించాలని, సకల మర్యాదలతో సాగనంపాలని కోరుకుంటారు. అయితే గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటి వరకు ఉమ్మడి శ్మశాన వాటికలు అందరికీ లేవు. ఈ సమస్యను దృష్టలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామానికి వైకుంఠధామాన్ని నిర్మించింది. వాటిలో అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు కల్పించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 61 గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు అందుబాటులోకి వచ్చాయి.


మేడ్చల్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు(శ్మశాన వాటికలు) అందుబాటులోకి వచ్చాయి. వాటిలో చాలా మట్టుకు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి. జిల్లాలోని ఐదు మండలాల్లో 61 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయ్యాయి. గతంలో శవ దహనం, ఖననం చేయాలంటే సొంత భూమి లేనివారికి ఇబ్బందిగా ఉండేది. అలాంటి వారు చెరువు శిఖం, గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో అంత్యక్రియలు చేసేవారు. కులాల వారీగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకున్నా అన్ని గ్రామాల్లో అవి లేవు. ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకొనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికో వైకుంఠధామం నిర్మించాలని లక్ష్యం పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హమీ నిధులు, పంచాయతీల నిధులతో వైకుంఠధామాల నిర్మాణాలు చేస్తున్నారు. ప్రతీ వైకుంఠధామం విస్తీర్ణం అర ఎకరం నుంచి ఎకరం వరకు ఉంది.


  • వైకుంఠధామాల్లో వసతుల కల్పన

గ్రామంలో ఎవరు మరణించినా మృతదేహాన్ని కల, మత భేదాలు లేకుండా వైకుంఠధామానికి తెచ్చి దహన సంస్కారాలు నిర్వహించుకుంటున్నారు. ఐదు మండలాల్లో 61 పంచాయతీల్లో వైకుంఠధామాలను ఒక్కోదాన్ని రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వ్యయంతో నిర్మించారు. అంత్యక్రియలకు వచ్చిన వారు స్నానాలు చేసుకోవడానికి, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు నిర్మించారు. ఆరుబటయట నల్లాలు, కర్మ కాండలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. వైకుంఠధామం చుట్టూ ప్రహరీ నిర్మించి, గేటు ఏర్పాటు చేశారు. లైటింగ్‌ పెట్టించారు. శ్మశాన వాటిక వరకూ సీసీ రోడ్డు వేశారు. వైకుంఠధామంలో వివిధ రకాల మొక్కలు, పూల మొక్కలు, కూర్చునేందుకు సిమెంట్‌ బెంచీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు కొత్త వైకుంఠధామాల్లో 589 మందిని దహనం చేసినట్టు రికార్డు చేశారు. ఇదిలా ఉంటే దహస క్రియలకు ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. అయితే దహనానికి వినియోగించే కర్రలు, కిరోసిన్‌ తదితర వస్తువులను మాత్రం మృతుడి కుటుంబీకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మృతుడి డెత్‌ సర్టిపికెట్‌ తీసుకునేందుకు గాను మున్సిపల్‌ క్రెమెటోరియాల్లో ఇచ్చినట్టుగానే పంచాయతీ కార్యదర్శి ఓ సర్టిఫికెట్‌ ఇస్తారు.


  • మండలాల వారీగా వైకుంఠధామాలు ఇలా...

ఘట్‌కేసర్‌ మండలంలో 11 వైకుంఠదామాలు, కీసరలో 10, మేడ్చల్‌లో 17, మూడు చింతలపల్లి మండలంలో 13, శామీర్‌పేట మండలంలో 10 చొప్పున వైకుంఠధామాలు నిర్మించారు. దాదాపు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. అయితే గ్రామంలో సొంత స్థలం ఉన్న వారు వారి జాగాలోనే అంత్యక్రియలు నిర్వహించుకుంటుండగా సొంత జాగ లేని వారు వారి కుటుంబీకుల్లో ఎవరైనా మరణిస్తే వైకుంఠధామాల్లో దహన క్రియలు నిర్వహిస్తున్నారు.


  • కష్టపడి నిర్మించాం : వెంకటేశ్‌, సర్పంచ్‌ కొర్రెముల, ఘట్‌కేసర్‌ మండలం

మా గ్రామానికి అన్ని వసతులతో వైకుంఠధామాన్ని ఏర్పాటుచేసుకున్నాం. పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లు పెంచాం. బోరు, గదులు నిర్మించి కర్మల నిర్వహణకు వసతులు ఏర్పాటు చేశాం. గ్రామంలో ఇప్పటికే చాలా మంది వైకుంఠధామాన్ని వినియోగించుకున్నారు.


  • అందరూ ఇక్కడికే వస్తున్నారు.. : కవితయాదవ్‌, పంచాయతీ కార్యదర్శి, కొర్రెముల, ఘట్‌కేసర్‌ మండలం

గతంలో గ్రామానికి శ్మశాన వాటిక లేక సొంత జాగ లేని వారికి ఇబ్బందిగా ఉండేది. వైకుంఠధామాల నిర్మాణం తరువాత చాలా మంది దహన సంస్కారాలు వీటిల్లో చేయిస్తున్నారు. అంత్యక్రియలకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశాం. దహనానికి గద్దె, కట్టెలు, బోరు, గదులు, పని మనుషులు ఏర్పాటు చేశాం. మరణించి వారి కుటుంబానికి ఇబ్బంది లేకుండా వైకుంఠధామం వినియోగంలోకి వచ్చింది.

Updated Date - 2022-01-24T05:18:04+05:30 IST