Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

డాలర్ ఆధిపత్యానికి ఆఖరి రోజులు

twitter-iconwatsapp-iconfb-icon
డాలర్ ఆధిపత్యానికి ఆఖరి రోజులు

ఉక్రెయిన్ మీద రష్యా గత 60 రోజులుగా యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇప్పటికే తీవ్ర ఆర్ధిక భారాన్ని ఎదుర్కొంటున్నాయి. అసలు ఈ యుద్ధ పర్యవసానాలు మరింత విషమంగా ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు.


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ యుద్ధాన్ని మొదలుపెట్టడానికి కారణం ఏమిటి? అమెరికా గత రెండు దశాబ్దాలుగా నాటో కూటమి ద్వారా తూర్పు యూరోపులో రష్యా సరిహద్దులదాకా తన ప్రభావాన్ని విస్తరింపచేయడమేనని చెప్పి తీరాలి. అమెరికా చర్యలు రష్యా భద్రతను దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ను అంతిమంగా నాటోలోకి లాగి రష్యా నగరాలను తన క్షిపణుల గురిలోకి తీసుకురావడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు రష్యా కోపానికి కారణమయ్యాయి. ఇప్పటికీ ‘నాటోలో చేరను’ అని ఒక చిన్న ప్రకటన చేసి, వేలాది ఉక్రెయిన్ల ప్రాణాలను కాపాడే చిన్న పనిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెయ్యట్లేదు! దీన్ని బట్టి అమెరికా చేతిలో అతడు ఎంత కీలుబొమ్మగా మారాడో, రష్యా మీద అమెరికా పరోక్ష యుద్ధంలో ఎలా పావు అయ్యాడో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే అమెరికా ప్రోద్బలంతో రష్యాని ‘స్విఫ్ట్ ప్లాట్ ఫార్మ్’ నుంచి బహిష్కరించారు. ఆ దేశ డాలర్ వనరులను సీజ్ చేశారు. అంతటితో ఆగకుండా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించారు. ఈ అనాలోచిత చర్యల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ధరలు తీవ్రంగా పెరిగాయి. ప్రపంచ ప్రజల ఆర్థిక అవస్థలు మరింత మిక్కుటమయ్యాయి. ఈ పరిణామాల దీర్ఘకాలిక పర్యవసానాలు ఏమిటి? అమెరికా ఎందుకు ఇంత తప్పిదం చేసిందో చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం.


రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా అతి పెద్ద పెట్టుబడిదారీ దేశంగా ఆవిర్భవించింది. గ్లోబల్ ఆర్థిక  వ్యవస్థకు తిరుగులేని నాయకుడుగా ప్రభవించింది. అయితే అంతర్గత పరిస్థితుల వల్ల, నాయకత్వ పాత్రను పక్కన పెట్టి, సొంత లాభం చూసుకుంది. అన్ని దేశాలూ అలానే చేస్తాయి కదా, అమెరికాను ఆక్షేపించడం ఎందుకు? అమెరికాకి ఉన్న వెసులుబాటు ఏమిటంటే, తన కరెన్సీ డాలరును ప్రపంచ కరెన్సీగా చెలామణీ చేసే సత్తా కలిగి ఉండడం. ఉదాహరణకి, రూపాయే గ్లోబల్ కరెన్సీ అనుకుందాం, రూపాయలతో మనదేశం అన్ని దేశాలనుంచి అన్ని వస్తువులు కారు చవకగా కొనుక్కోగలుగుతుందనుకుందాం. రూపాయి మారకం విలువ రోజురోజుకు పెరిగితే, మన కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. పర్యవసానమేమిటి? మనదేశంలో ఉత్పత్తయ్యే వస్తువులు కాక, బయట నుంచి వచ్చే సరుకులకు అలవాటు పడతాం. మన రూపాయలు ప్రపంచానికి అరువిచ్చి వడ్డీలు వసూలు చేసుకుంటాం. ఉత్పత్తిదారులమల్లా వడ్డీ వ్యాపారులమవుతాం. ఇది ఎప్పటికీ కొనసాగాలంటే ప్రపంచం రూపాయిని ఒప్పుకునేలా చేయాలి. రూపాయి మారకం విలువ పెరగాలి. మిగతా దేశాల కరెన్సీ విలువ తగ్గాలి. అమెరికా ఇదే చేస్తోంది మరి. తప్పేమిటి అని మీరు అడగవచ్చు. సాటి దేశాల అవసరాలను పణంగా పెట్టి తన కొనుగోలుశక్తి పెంచుకోవడమే అమెరికా చేసే తప్పు. 


1970 నుంచి పెరిగిన లేబర్ ఖర్చుల వల్ల, అమెరికా తన పెట్టుబడిని చాలావరకు విదేశాలకు తరలించి, తన కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గానికి అధిక లాభాలను ఆర్జించి పెట్టింది. దరిమిలా శ్రామిక, మధ్యతరగతి జీతాలు పెరగడం ఆగిపోయాయి. అయితే, డాలర్ అనుకూలత వల్ల, చైనాలో చవకగా తయారు చేసే సరుకులను దిగుమతి చేసుకుని, ఘనీభవించిన మధ్య తరగతి జీతాలతోనే వారి జీవన ప్రమాణాలను పెంచే ఒక వ్యూహాన్ని అమెరికా అమలుచేసింది. ఇది ఇలానే సాగాలంటే ప్రపంచంలో ఆర్థిక లావాదేవీలను డాలర్ శాసించగలగాలి. అయితే, గత పదేళ్ళుగా, ప్రపంచ వాణిజ్యంలో అమెరికా వాణిజ్యం 10శాతానికి పడిపోయిందని, డాలర్‌నే ప్రపంచ దేశాలు నమ్ముకోవాల్సిన అవసరం లేదని Goldman Sachs సంస్థ ఒక నివేదికలో చెప్పింది. 1990ల నుంచే డాలరుకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్న దేశాలమీద అమెరికా కన్నెర్ర చేయడం మొదలు పెట్టింది. యూరో కరెన్సీతో లావాదేవీలు చేయప్రయత్నించిన సద్దాంహుస్సేన్ను మట్టి కరిపించి, ఇరాక్‌ ఆయిల్ కంపెనీలను తన ఆధిపత్యం కిందకు తెచ్చుకుంది. అలాగే లిబియా అధ్యక్షుడు గడాఫీకి అదే గతి పట్టించింది. అలాగే ఇరాన్ మీద ప్రత్యక్షంగా దాడి చేయలేక, ఆంక్షలు విధించి, ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఇక ఎప్పుడో అప్పుడు చైనా తన కరెన్సీ అయిన Renminbi అంతర్జాతీయ చెల్లింపుల్లోకి తెస్తుందేమో అని భయపడుతోంది. ఇప్పటికే చైనా మీద పరోక్ష యుద్ధం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు రష్యా వంతు వచ్చింది.


ప్రపంచీకరణ విధానాలను అమలుచేసే అన్ని దేశాలు శాంతియుతంగా ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతాయని 1990ల్లో అమెరికా చెప్పింది. చైనాతో పాటు, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై, స్వతంత్ర ఉనికిని సాధించుకున్న దేశాలనూ పెట్టుబడిదారీ విధానాలను అనుసరించేలా చేసింది. తీరా చైనా ఇచ్చిన పోటీలో అమెరికా వెనుకపడింది. ఈ పరిస్థితి వాషింగ్టన్‌కు మింగుడుపడలేదు. చివరికి తన ఉదారవాద భావజాలానికి స్వస్తి చెప్పి, తనకు ఏది అనువుగా ఉంటే అదే చేస్తా అనే స్థితికి అమెరికా చేరుకుంది! ఇటీవలి కాలంలో అమెరికా అనేక దేశాలను తమ డాలరు వనరులను, తమ ఫెడరల్ బ్యాంకులో సెక్యూరిటీలు కొనుక్కుని దాచుకొమ్మని ప్రోత్సహించింది. తీరా పలు దేశాలు తను చెప్పిన మాట వినట్లేదని, వారి డిపాజిట్లను స్వాహా చేసే పనికి పూనుకుంది! ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్, లిబియా, తమ బ్యాంకుల్లో దాచుకున్న రిజర్వులనే కాక, ఇప్పుడు రష్యా దాచుకున్న 630 బిలియన్ డాలర్ల వనరులని కూడా ఫ్రీజ్ చేసింది. ఇది పూర్తిగా ప్రమాదకరమైన ఏకపక్ష పెడధోరణి. ఈ దెబ్బతో, ఏదో వడ్డీ వస్తుందని ఆశపడి, అమెరికా బ్యాంకుల్లో డాలర్లు డిపాజిట్ చేస్తే వచ్చే పెను ప్రమాదం మీద అన్ని దేశాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కల్పించింది.


తన పావు అయిన ఉక్రెయిన్ మీద దాడి చేసిన రష్యాని ప్రత్యక్షంగా ఎదుర్కొనే సాహసం చేయలేక, దాని పెట్రో డాలర్లను ఫ్రీజ్ చేసి, దిగుమతులు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా చేయడం అనే చర్య అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ గతి రేపు ఎవరికైనా పట్టవచ్చు. రాజకీయ విషయాలను ఆర్థిక విషయాలతో ముడి పెట్టకూడదన్నది ఈనాటి గ్లోబల్ పెట్టుబడిదారీ నీతి. అట్లా దెబ్బకు రూబుల్‌ను పతనం చేసి, ఆర్ధిక సంక్షోభం పుట్టించి, పుతిన్‌పై రష్యా ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చేలా చేసి, పుతిన్‌ను అధికారం నుంచి కూలదోయడానికే అమెరికా పథకం రచించిందని అంతర్జాతీయ వ్యవహారాల వ్యాఖ్యాతలు చెబుతున్నారు. అంతేకాక, రష్యాని ఉక్రెయిన్ మీద దీర్ఘకాలిక యుద్ధంలోకి దించి, ఉక్రెయిన్లకి యుద్ధసామగ్రిని సరఫరా చేసి, ముగ్గులోకి దింపి, సంక్షోభంలోకి రష్యాని లాగి, తన సుదీర్ఘ శత్రువును శాశ్వతంగా దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని కూడా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. ఈ విధంగా పుతిన్ అడ్డు తొలిగితే, రష్యాలో ఉన్న సహజ వాయు వనరులను కూడా తమ కంపెనీల ద్వారా స్వాయత్తం చేసుకోవాలని అమెరికా కుయుక్తులు పన్నుతోంది. ఇవి సఫలమయితే, ఇంధన భద్రతలో కొన్ని దశాబ్దాల పాటు అమెరికాకి ఢోకా ఉండదు. 


ఆహార, ఆయుధ, చమురు భద్రత ఉన్న రష్యాకు, ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షల వల్ల జరిగిన నష్టం అతితక్కువ అని తెలుస్తోంది. మరొకపక్క, అది ఎగుమతి చేసే మెటల్స్, మినరల్స్, గ్యాస్, వ్యవసాయ ఎగుమతులు ఆగిపోయి ప్రపంచంలో ఎన్నో దేశాలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. పుతిన్ కూడా తెలివిగా పూర్తియుద్ధం అనే ఊబిలొకి పోకుండా, తన ప్రస్తుత లక్ష్యాలను మాత్రమే సాధించుకుని పక్కకు జరిగే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా, ఒక అతి తెలివైన పావును కదిపి, అమెరికాకి కంటిమీద నిద్ర లేకుండా చేశాడు. అది ఏమిటంటే, గ్యాస్ కోసం తమ మీద ఆధారపడ్డ ఐరోపా దేశాలన్నీ విధిగా రూబుళ్ల లోనే కొనుగోలు చేయాలని షరతు పెట్టాడు. అన్ని దేశాలు మార్కెట్లో ఉన్న రూబుళ్ళు కొనుక్కునే ప్రయత్నంలో, కోల్పోయిన మారకపు విలువని రూబుల్ ఒక్క రోజులోనే పూర్తిగా రికవర్ చేసుకుంది. ఇక భవిష్యత్తులో, రూబుళ్లలో కానీ, బంగారంలో కానీ కొనుక్కోవచ్చని పుతిన్ చెప్పడంతో, ప్రపంచంలో అన్నిదేశాలు బంగారం రిజర్వులను పెంచుకోవడం మొదలు పెట్టాయి. డాలర్ మీద మాత్రమే ఆధారపడలేమనే నిర్ణయానికి వచ్చాయి.


భారతదేశంతో సహా, ఎన్నో దేశాలు అమెరికా ఆంక్షలను బేఖాతర్ చేస్తూ రష్యాతో చవకైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీంతో, ప్రపంచంలో డాలర్–రహిత వాణిజ్యానికి తెర లేచిందని వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఏకపక్ష ఆధిపత్యానికీ తెరపడవచ్చు. ఐరోపా, చైనా, భారత్, రష్యాలు ఏకమైతే డాలర్ ఆధిపత్యానికి రోజులు దగ్గర పడినట్టేనని చెప్పవచ్చు. ఇంచుమించు ఒక శతాబ్దం క్రితం బ్రిటిష్ పౌండు తెరమరుగు కావడం మనం చూసాం. అమెరికా ఎలాగ తన ప్రజల మేలు తలుస్తుందో, అన్ని దేశాలూ అలాగే తలుస్తాయి కదా. చివరికి, భారత ప్రధాని మోదీ కూడా అమెరికా ఒత్తిడికి లోను కాకుండా ఉండడం ఆహ్వానించ దగ్గ పరిణామం. నాటోను మరింతగా విస్తరింప చేసేందుకు అమెరికా ప్రయత్నించకపోతే అసలు ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడం రష్యాకి అనివార్యమయి ఉండేది కాదు కదా. అమెరికా ఆధిపత్యం ఇప్పుడు ప్రపంచానికి భారం. కరోనా సంక్షోభం లోంచి కోలుకుంటున్న ప్రపంచంమీదకు ఈ భయంకరమైన ద్రవ్యోల్బణ సంక్షోభం వచ్చి ఉండేదీ కాదు. అయితే, ఈ సంక్షోభమే ప్రపంచ ఆర్ధిక రంగంలో ఒక పెను మార్పునకు దారితీయవచ్చు. అమెరికా తన తప్పులకు మూల్యం చెల్లించుకునే పరిస్థితి రానూరావచ్చు. 

ఆర్. వి. రమణ మూర్తి

ఆర్థిక శాస్త్ర ఆచార్యులు,హెచ్‌సియూ

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.