ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం!

ABN , First Publish Date - 2021-11-26T09:10:16+05:30 IST

ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం ఉత్తర్‌ప్రదేశ్‌లో అందుబాటులోకి రానుంది. గౌతమబుద్ధ నగర్‌ జిల్లా జెవార్‌ వద్ద నిర్మించ తలపెట్టిన ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాని’కి

ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం!

  • యూపీలో శంకుస్థాపన చేసిన ప్రధాని


జెవార్‌(యూపీ), నవంబరు 25: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం ఉత్తర్‌ప్రదేశ్‌లో అందుబాటులోకి రానుంది. గౌతమబుద్ధ నగర్‌ జిల్లా జెవార్‌ వద్ద నిర్మించ తలపెట్టిన ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాని’కి గురువారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఈ ఎయిర్‌పోర్టును 1300 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. తొలి దశలో రూ.10,050 కోట్లతో పనులు చేపడుతున్నారు. 2024కల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని యూపీ సర్కారు యోచిస్తోంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆసియాలో అతిపెద్ద విమానాశ్రయం కానుంది. ఏడాదికి 1.2 కోట్ల మందికి సేవలందించే సామర్థ్యంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు.  ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం కాగా.. యూపీలో ఐదోది కానుంది. ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రంగా యూపీ నిలవనుంది.


విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌ను అణచివేశారని, చీకట్లో ఉంచారని ఆరోపించారు. ప్రస్తుతం ‘డబుల్‌ ఇంజన్‌’ బీజేపీ ప్రభుత్వాల పాలనలో యూపీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందన్నారు. కేంద్ర మంత్రి సింధి యా మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని యూపీలో నిర్మించాలన్నది ప్రధాని ఆకాంక్ష అని, అది ఇప్పుడు నెరవేరుతోందన్నారు. సీఎం యోగి మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తియ్యటి చెరకు పంట పెరగాలా? లేక పాక్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ఆలీ జిన్నా మద్దతుదారుల అల్లర్లు పెరగాలా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి 7 వేల మంది రైతులు ఎ లాంటి వివాదం లేకుండా, భూములు ఇచ్చారని కొనియాడారు. 


బీజేపీ నిర్మించేది అమ్ముకోడానికే: అఖిలేశ్‌

బీజేపీ ప్రభుత్వం విమానశ్రయాలు నిర్మించేది అమ్ముకోవడానికేనని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు.  లఖ్‌నవూలో  గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఓ వైపు కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తూ.. మరోవైపు ఉన్నవాటిని అమ్మేస్తున్న బీజేపీని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

Updated Date - 2021-11-26T09:10:16+05:30 IST