పంచగ్రామాల భూములు దేవస్థానానివి కావు

ABN , First Publish Date - 2022-08-20T06:24:14+05:30 IST

దశాబ్దాల కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల పరిధిలోని వివాదాస్పద భూములు సింహాచల దేవస్థానానివి కాదని సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు అన్నారు.

పంచగ్రామాల భూములు దేవస్థానానివి కావు

సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం

సింహాచలం, ఆగస్టు 19: దశాబ్దాల కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల పరిధిలోని వివాదాస్పద భూములు సింహాచల దేవస్థానానివి కాదని సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన  ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టులో జరిగిన వాద, ప్రతివాదలన సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు ఆ భూములు దేవస్థానానివే అని అనడంతో కోర్టు అదే అభిప్రాయానికి వచ్చిందన్నారు.


వాస్తవానికి 1996-97లో పెందుర్తి, విశాఖ రూరల్‌ మండలాల తహశీల్దార్లు ఇచ్చిన పట్టాలు మినహా అంతకు ముందు దేవస్థానం వద్ద భూములు తమవే అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. 2010లో విశాఖ ఆర్డీవో ఈ పట్టాలు చెల్లవని ఇచ్చిన తీర్పును కూడా మరువరాదన్నారు. అదే విధంగా 2014లో సీపీఎం పంచగ్రామాల భూముల విషయంలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో వేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తులు విచారణ అనంతరం ఆరు నెలల్లో తమ నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు.


తర్వాత ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఈ పట్టాలు సక్రమం కాదని నివేదించిందన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం శోచనీయమన్నారు. 1903లోని గిల్‌మేన్‌ సర్వే నివేదికలో రైతులకు హక్కులున్నట్టు స్పష్టంగా ఉందని, తరువాత ఇప్పటి వరకు పంచగ్రామాల భూములపై ఎటువంటి సమగ్ర సర్వే జరగలేదన్నారు.


కానీ ఈ భూములు దేవస్థానానికి చెందినవి అనేందుకు దేవస్థానం వద్ద ఏ ఆధారాలు లేవన్నారు. ఈ వాస్తవాలన్నింటినీ త్వరలోనే తమ సంఘం తరపున కోర్టుకు నివేదిస్తామని, తమ అభ్యర్థన పరిశీలించిన తరువాత మాత్రమే కోర్టు అంతిమ తీర్పు వెలువరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-08-20T06:24:14+05:30 IST