గడువు లోపు భూసర్వే పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-08-11T04:20:49+05:30 IST

సమగ్ర భూసర్వే పనులు నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని ఇందులో నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు.

గడువు లోపు భూసర్వే పూర్తి చేయాలి

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


రాయచోటి (కలెక్టరేట్‌), ఆగస్టు 10: సమగ్ర భూసర్వే పనులు నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని ఇందులో నిర్లక్ష్యం చేయకూడదని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి భూరికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వేపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ అమలుపై ఆర్డీవోలు, తహసీల్దార్‌ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రీసర్వేపై అధికారులు నిర్లక్ష్యం చూపరాదని హెచ్చరించారు. అవసరం మేరకు సర్వే టీంలు పెంచుకుని గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌, 13 నోటిఫికేషన్‌, ఓఆర్‌ఐ ప్రక్రియను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వచ్చే మంగళవారం లోపల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూసమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు గుర్తించాలన్నారు. కొన్నేళ్ల నుండి పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు రీసర్వే ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సర్వేను పూర్తి చేయడం ద్వారా ఎంతో మంది రైతులు ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని అధికారులందరూ గుర్తుంచుకుని బాధ్యతతో పనిచేయాలన్నారు. సర్వే పనులపై ప్రతిరోజూ ఆర్‌డీవోలు, తహసీల్దార్‌లు, మానిటర్‌ చేస్తే తప్ప ప్రోగ్రెస్‌ రాదని హెచ్చరించారు. పెద్దమండెం మండలంలో గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పనులు పూర్తయ్యాయని, మిగతా మండలాల్లో కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వచ్చే 20వ తేదీ నాటికి 13 నోటిఫికేషన్‌ పూర్తి చేయాలన్నారు. సమగ్ర సర్వే పనులు పూర్తయ్యే వరకు సర్వే అధికారులు, సిబ్బంది సెలవు దినాల్లో కూడా పనిచేసి తమకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌వో సత్యనారాయణ, ల్యాండ్‌ అండ్‌ సర్వే ఏడీ జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T04:20:49+05:30 IST