భూ కుంభకోణం నిజమే!

ABN , First Publish Date - 2020-05-22T10:21:57+05:30 IST

కలువాయి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగినట్లు రెవెన్యూ అధికారులు..

భూ కుంభకోణం నిజమే!

కలువాయి తహసీల్దార్‌ ప్రమీల సస్పెన్షన్‌

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు


నెల్లూరు (ఆంధ్రజ్యోతి): కలువాయి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగినట్లు రెవెన్యూ అధికారులు నిగ్గు తేల్చారు. ఇందుకు బాధ్యులైన తహసీల్దారు ప్రమీలను సస్పెన్షన్‌ చేస్తూ కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. ‘కలువాయిలో భూ కుంభకోణం’ శీర్షికన మార్చి 20వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ నిఘా కథనాన్ని ప్రచురించింది. పలు సర్వే నెంబర్లలోని భూమి గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అన్న వివరాలను తెలియజేస్తూ కలువాయిలో జరిగిన భూ వ్యవహారాలను బయటపెట్టింది. దీంతో అప్పుడు స్పందించిన కలెక్టర్‌ ఆత్మకూరు ఆర్డీవోను విచారణ జరిపి నివేదిక అందించమని ఆదేశించారు. ఆ వెంటనే ఆర్డీవో కలువాయికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఇంతలో కరోనా ప్రభావం తీవ్రం కావడంతో అధికార యంత్రాంగం మొత్తం ఆ వైపు దృష్టి పెట్టింది. అయితే ఇటీవల కలువాయి మండలానికి చెందిన పలువురు వ్యక్తులు భూ కుంభకోణంపై విచారణ జరిపించాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.



దీంతో కలెక్టర్‌ మరోమారు స్పందించి ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న ఆయన కలువాయిలో భూ రికార్డులు తారుమారు జరిగినట్లు నిర్ధారించుకున్నట్లు తెలిసింది. ఆ వెంటనే ఇందుకు కారణమైన తహసీల్దార్‌పై వేటు వేశారు. కొన్ని సర్వే నెంబర్లలోని భూమి 2017లో ప్రభుత్వం- అనాధీనం అని ఉండగా ఇప్పుడు చూసే సరికి ఆ స్థానంలో ఇద్దరు వ్యక్తుల పేర్లు వచ్చి చేరాయి. కొంత మంది ప్రైవేటు వ్యక్తుల పేర్లపై ఉన్న భూమి వారికి తెలియకుండానే మరొకరి పేరుపైకి మారిపోయింది. ఇక కలువాయి చెరువును కూడా పలువురి పేర్లపై నమోదు చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన  నాయకుడొకరు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. కోట్లు చేతులు మారినట్లు మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కూడా అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. అదే విధంగా ఇంకెంత మంది రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఇందులో పాత్రధారులన్నది కూడా తేలాల్సి ఉంది. ఇక తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు తారుమారైన రికార్డులను సరిచేయాల్సిన అవసరముందని స్థానికులు కోరుతున్నారు.  

Updated Date - 2020-05-22T10:21:57+05:30 IST