పందుల రాజ్యం.. పట్టని అధికారగణం!

ABN , First Publish Date - 2021-06-20T05:35:07+05:30 IST

మండలంలోని చాలా గ్రామాల్లో ఎక్కడ చూసినా పందులు స్వైర విహారం చేస్తున్నాయి.

పందుల రాజ్యం.. పట్టని అధికారగణం!
రోలుగుంటలో గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్న పందులు

గ్రామాల్లో విచ్చలవిడిగా సంచారం
కాలువలు, మురికి కుంటల్లో స్వైరవిహారం
ఇళ్ల పక్కనే ఆవాసాలు.. ఇబ్బందుల్లో నివాసితులు
సీజనల్‌ వ్యాధులు, అంటురోగాలతో భయాందోళన
దర్జాగా వదిలేస్తున్న పెంపకందారులు.. ప్రశ్నిస్తే ఎదురు దాడులు

రోలుగుంట, జూన్‌ 19:
ఇదో అతి పెద్ద లాభసాటి వ్యాపారం. పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ! నష్టాల ఊసే ఉండదు.. నిర్వహణ భయం అంతకంటే లేదు.. సంరక్షణ అవసరమే కాదు! అదే పందుల పెంపకం. ఓ రెండు పందులను కొని ఊరు మీద వదిలేస్తే చాలు. అవి పదుల సంఖ్యలో పిల్లలను పెడతాయి. పెరిగి పెద్దయ్యాక వందల సంఖ్యకు చేరుతాయి. ఇక్కడ ఇబ్బందులు పడేది.. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేది ప్రజలే! రోలుగంట మండలంలో పందులు కనిపించని గ్రామం లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే! వ్యాధులకు కారకమైన వీటిని అధికారులు పట్టించుకునే పాపానికి పోవడం లేదు.


మండలంలోని చాలా గ్రామాల్లో ఎక్కడ చూసినా పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని  ఇళ్ల పక్కనే పందులకు ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. గ్రామాల్లో పందుల బెడద లేని వార్డు అంటూ ఏదీ లేదు. రోలుగుంట, కొమరవోలు, కొవ్వూరు, కుసర్లపూడి, జె.నాయుడుపాలెం. జానకిరాంపురం, బుచ్చెంపేట, వడ్డిప, శరభవరం, కొంతలం, బీబీ పట్నం, రత్నంపేట తదితర గ్రామాల్లో ఈ సమస్య విపరీతంగా ఉంది. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు పందులతోనే ఆయా ప్రాంతాల ప్రజలు సహజీవనం చేయాల్సిన దుస్థితి. కొన్ని వార్డుల్లో పందులు ఇళ్లల్లోకి చొచ్చుకువస్తున్నాయి. ఒక్కోసారి వృద్ధులు, పిల్లలపై దాడులు కూడా చేస్తున్నాయి. పెంపకందారులు ఎప్పుడూ కనిపించరని, ఎప్పుడైనా పందలను పట్టుకుని అమ్ముకోవడానికి వస్తే నిలదీసినప్పుడు ఎదురు దాడులకు దిగుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


విచ్చలవిడి సంచారం.. అంటురోగాల భయం
 గ్రామానికి శివారున రెండు కిలోమీటర్ల దూరంలో పందులు పెంచుకోవాలి. అయితే పెంపకందారులు పందులను తీసుకొచ్చి గ్రామాల్లోనే వదిలేస్తున్నారు. అవి వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. పెద్దవిగా ఎదిగిన పందులను పెంపకందారులు పట్టుకుని అమ్ముకుంటున్నారు. ఇలా దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక, మురుగు కాలవుల్లో పందులు నిత్యం స్వైరవిహారం చేస్తుండడంతో దోమల ఉత్పత్తి పెరిగిపోతోంది. దీంతో ఎప్పుడు ఏ రోగం వస్తుందోనని జనం భయాందోళన చెందుతున్నారు. అలాగే ఇళ్లల్లోకి చొరబడి వంట పాత్రలను కలుషితం చేయడంతో పాటు పంట పొలాలకు వెళ్లి నాశనం చేస్తున్నాయి. ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తుండడంతో అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రధానంగా మెదడువాపు వ్యాధి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారని, పందుల బెడద నివారణకు అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-06-20T05:35:07+05:30 IST