తెలంగాణలో నాస్తికుల రాజ్యం

ABN , First Publish Date - 2022-01-25T07:30:30+05:30 IST

తెలంగాణలో నాస్తికుల రాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణలో నాస్తికుల రాజ్యం

  •  వేములవాడ రాజన్నకు కేసీఆర్‌ శఠగోపం
  •  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


సిరిసిల్ల/హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నాస్తికుల రాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఒకరేమో దేవుడిని నమ్మరని, ఇంకొకరు వేరే మతాన్ని కొలుస్తూ స్థానికంగా ఉండరని, మరొకరు నిఖార్సైన హిందువునంటూ రాజన్న ఆలయాన్ని అఽభివృద్ధి చేస్తానని ఊరించి పత్తాలేకుండా పోయారని.. మంత్రి కేటీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడలో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ముందుగా వేములవాడలో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న సంజయ్‌.. ఆలయ పరిసరాలను పరిశీలించారు.


అనంతరం ఆయన మాట్లాడారు. మేడారం జాతర సందర్భంగా నిత్యం వేలాది మంది భక్తులు రాజన్న ఆలయానికి తరలి వస్తున్నారని, గుడిలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గుడి చెరువుకు 35 ఎకరాల స్థలం తీసుకొని పార్కింగ్‌ కోసం విడిచిపెట్టారని ఎద్దేవా చేశారు. రూ.100 కోట్లని, రూ.400 కోట్లని మాటలు చెప్పి రాజన్నకే శఠం గోపం పెట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మండిపడ్డారు.


కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను తక్షణం భర్తీచేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యావ్యవస్థ నిర్వీర్యమైపోతోందని, విద్యా రంగంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఈడీ, డీఈడీ, పండిట్‌ శిక్షణ పూర్తి చేసిన 7 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని సంజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్లుగా టెట్‌ నిర్వహించకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నారని చెప్పారు. మైనారిటీ, ఎయిడెడ్‌ సంస్థల్లో కూడా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.


Updated Date - 2022-01-25T07:30:30+05:30 IST