20 ఏళ్ల కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టిన కుటుంబసభ్యులు.. అసలు నిజం తెలిసి అవాక్కైన పోలీసులు..!

ABN , First Publish Date - 2021-09-17T22:56:05+05:30 IST

యువతి కిడ్నాప్ అయ్యిందంటూ ఫిర్యాదు.. అసలు విషయం తెలిసి అవాక్కైన పోలీసులు..

20 ఏళ్ల కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టిన కుటుంబసభ్యులు.. అసలు నిజం తెలిసి అవాక్కైన పోలీసులు..!

ఇంటర్నెట్ డెస్క్:  మార్నింగ్ వాక్‌కు వెళ్లిన యువతిని ఎవరో అపహరించారన్న వార్త గురువారం ఉత్తరప్రదేశ్‌లో భారీ కలకలం రేపింది. స్థానికులు ధర్నాకు దిగడంతో జాతీయరహదారిపై వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పటింది. దీంతో.. గ్రేటర్ నోయిడా పోలీసులు యువతి ఆచూకీ తెలుసుకునేందుకు వెంటనే రంగంలోకి దిగారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో.. కేవలం 24 గంటల్లోనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేసింది. అయితే.. దర్యాప్తు సందర్భంగా బయటపడిన వాస్తవాలతో పోలీసులే ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరిగిందంటే..     


గురువారం ఉదయం మార్నింగ్ వాక్ అని వెళ్లిన జ్యోతిని(20) ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ సమయంలో యువతి వెంట ఆమె చెల్లెలు, ఇద్దరు అన్నలూ కూడా ఉన్నారన్నారు. కారులో వచ్చిన దుండగులు ఆమెను బలవంతంగా ఎక్కించుకున్నారని, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసేలోపే వారు యువతిని తీసుకుని వెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. గ్రేటర్ నాయిడాలోని బాదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను సంచలనానికి దారితీసింది. మహిళలపై దాడులు జరుగుతున్న వార్తలు ఇటీవల తరచూ వినిపిస్తుండటంతో..యువతిని కాపాడాలంటూ స్థానికులు జాతీయరహదారిపై నిరసనకు దిగారు.


ఇవీ చదవండి:

ఫ్రెండ్ భార్యతో ప్రేమాయణం.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇలా..

బాలుడి బ్యాంకు ఖాతాలో రూ. 905కోట్లు..తండ్రి మైండ్ బ్లాంక్!


పరిస్థితి ఇలా గంభీరంగా ఉండటంతో పోలీసులు మెరుపు వేగంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వెల్లడైన షాకింగ్ నిజాలు పోలీసులనే ఆశ్చర్యపోయేలా చేశాయి. వాస్తవానికి ఆ యువతి తన ప్రియుడిని తీసుకుని అంతకుముందు రోజే ఇల్లు విడిచిపారిపోయింది. దీంతో.. తమ పరువు కాపాడుకునేందుకు ఆ కుటుంబం ఈ భారీ నాటకానికి తెరతీసింది. పోలీసులను కూడా ఇందులో భాగస్వాములను చేసింది. అంతా కళ్లకుకట్టినట్టు వర్ణిస్తూ నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రోడ్డుపై ధర్నాకు దిగడంతో పాటూ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేసి..పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నట్టు నాటకమాడింది.


అయితే.. దర్యాప్తులో భాగంగా పోలీసులు తొలుత యువతి కుటుంబసభ్యులనే ప్రశ్నించగా..వారి ఈ ఘటనాక్రమాన్ని తలోరకంగా వివరించారు. కిడ్నాప్ సమాచారం కంట్రోల్ రూంకు ఉదయం 4.30కు అందగా.. కుటుంబసభ్యుల్లో కొందరు మాత్రం ఉదయం ఆరున్నరకు కిడ్నాప్ జరిగిందని చెప్పడంతో పోలీసులకు మొదట్లోనే అనుమానం కలిగింది. ఈ క్లూ ఆధారంగా పోలీసులు కేవలం 24 గంటల్లో ఈ నాటాకానికి తెరదించారు. 

Updated Date - 2021-09-17T22:56:05+05:30 IST