రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబమే: షర్మిల

ABN , First Publish Date - 2021-10-26T04:19:54+05:30 IST

ఎంతోమంది ప్రాణత్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో

రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబమే: షర్మిల
మహేశ్వరం మండలం తుమ్మలూరులో అభివాదం చేస్తున్న షర్మిల

  • 1200మంది ప్రాణత్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో గోస తీస్తున్న ప్రజలు 
  • వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల
  • ఆరోరోజు పాదయాత్రకు మహేశ్వరం, కందుకూరులో బ్రహ్మరథం


ఇబ్రహీంపట్నం / మహేశ్వరం / కందుకూరు : ఎంతోమంది ప్రాణత్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు గోస తీస్తున్నారని.. నిధులు, నియా మకాలు కేసీఆర్‌ కుటుంబానికే దక్కాయని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల విమర్శలు చేశారు. ఆ పార్టీ చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం ఆరో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. సోమవారం ఉదయం 10:30గంటలకు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరు గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాచులూరు గేటు, నుంచి కందుకూరు మండలపరిధిలోని లేమూరు, అగర్‌మియాగూడ గ్రామాల మీదుగా తిమ్మాపురం శివారు వరకు కొనసాగింది. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 13 కిలో మీటర్ల మేర జరిగిన యాత్రలో రైతులు, యువకులు, మహిళలు తమ సమస్యలను షర్మిలకు చెప్పుకున్నారు. లేమూరులో నిర్వహించిన మాటముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. నాడు వైఎస్‌ ప్రభుత్వం పేద మహి ళల కోసం అభయహస్తం పథకాన్ని అమలు చేస్తే.. కేసీ ఆర్‌ ప్రభుత్వం ఆ పథకాన్ని అటకెక్కించిందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎమ్మె ల్యేలు, మంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరి స్థితి లేదని, దీంతో స్థానికంగా సమస్యలు పేరుకు పోయాయని ఆరోపించారు. తనను ఆశీర్వదించి అవకాశం ఇస్తే తిరిగి వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలనను తీసుకువచ్చి ప్రజల సమస్యలను తీర్చుతానని తెలిపారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. 

అంతకుముందు తుమ్మలూరులో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతులు లేవని విద్యార్థులు షర్మిలకు వివరించారు. సరిపోను తరగతి గదులు లేవని, నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడంలేదని తెలిపారు. దీంతో స్పందించిన షర్మిల.. రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి నియోజకవర్గ పరిధిలోనే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలాఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యాశాఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చని ఆమె విమర్శించారు. అనంతరం పాదయాత్రలో భాగంగా అదే గ్రామంలో చెప్పులు కుట్టుకుంటున్న నర్సయ్య వద్దకు వెళ్లి ముచ్చటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక కుల వృత్తులకు సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్య మంత్రి కేసీఆర్‌, ఇలాంటి చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.



Updated Date - 2021-10-26T04:19:54+05:30 IST