నరక ప్రయాణం

ABN , First Publish Date - 2022-05-17T06:44:50+05:30 IST

చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారులు మూడేళ్ల నుంచి నిర్వహణ పనులకు నోచుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి.

నరక ప్రయాణం
బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం వద్ద గోతిలో నీరు నిలిచి చెరువును తలపిస్తున్న రోడ్డు (ఫైల్‌ ఫొటో)

అధ్వానంగా  ‘చోడవరం’ రహదారులు

ఎక్కడ చూసినా గోతులే!

రోడ్లపై తేలిన రాళ్లు, కంకర

వర్షం కురిస్తే చెరువులను తలపిస్తున్న గోతులు

ఇబ్బంది పడుతున్న వాహనదారులు 

ప్రయాణికుల ఒళ్లు హూనం

మూడేళ్ల నుంచి కొరవడిన నిర్వహణ పనులు

అక్కడక్కడా మొక్కుబడిగా ప్యాచ్‌ వర్క్‌లు

ప్రకటనలకే  పరిమితమైన పాలకుల హామీలు


-----

‘‘వర్షాల వల్లే రోడ్లు దెబ్బతిన్నాయి. అక్టోబరు కల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పనుల కాలం మొదలవుతుంది. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టాలి. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నీ బాగుచేయాలి.  రోడ్ల నిర్వహణ కోసం రూ.2 వేల కోట్లతో ప్రత్యేకంగా నిధి కేటాయించాం. ప్యాచ్‌వర్క్‌లు, రిపేర్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి’’

-ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత ఏడాది సెప్టెంబరు 6వ తేదీన తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలు.

ఇది జరిగి ఎనిమిది నెలలు దాటింది. జిల్లాలో రోడ్ల మరమ్మతు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల గోతుల్లో రాళ్లు, మట్టిపోసి చదును చేసి చేతులు దులుపుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పరిస్థితి మళ్లీ మామూలే!

---


చోడవరం/బుచ్చెయ్యపేట, మే 15:

చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారులు మూడేళ్ల నుంచి నిర్వహణ పనులకు నోచుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. పెద్ద పెద్ద గోతులు ఏర్పడి, రాళ్లు తేలిపోయి, వర్షాలతో కోతలకు గురై మట్టి రోడ్లను తలపిస్తున్నాయి. ఈ రహదారులపై రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, ప్రయాణికుల ఒళ్లు హూనం కావడంతోపాటు ప్రయాణ సమయం రెట్టింపు అయ్యింది. గోతుల కారణంగా వాహనాలు త్వరగా పాడైపోవడంతోపాటు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో మైలేజీ తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో ప్రధాన రహదారి గోతుల మయంగా మారింది. ప్రత్యేకించి కొత్తూరు జంక్షన్‌ నుంచి అటవీశాఖ కార్యాలయం వరకు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ జంక్షన్‌ వద్ద, గాంధీగ్రామం జంక్షన్‌, నరసయ్యపేటల వద్ద రహదారులపై లెక్కలేనన్ని గోతులు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్డు ఆ చివర నుంచి ఈ చివర వరకు భారీ గొయ్యి  ఏర్పడింది. కొద్దిపాటి వర్షం కురిసినా నీరు నిలిచిపోయి చెరువుని తలపిస్తున్నది. గొయ్యి లోతుని అంచనా వేయలేక రాత్రి వేళల్లో ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఏడాది వర్షాకాలం తరువాత రహదారికి మరమ్మతు పనులు చేపడతామని ఆర్‌అండ్‌బీ అధికారులు అప్పట్లో చెప్పారు. ఏడు నెలలు గడిచినా గోతులు పూడ్చలేదు. పట్టణంలో కొత్తూరు జంక్షన్‌ నుంచి కన్నంపాలెం మీదుగా తిమ్మనపాలెం వరకు రహదారి అత్యంతదారుణంగా తయారైంది. రాత్రి సమయాల్లో ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదానికి గురికాక తప్పదని వాహనదారులు అంటున్నారు.

ఇక చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాలను కలిపే పీఎస్‌పేట రహదారి దుస్థితి వర్ణనాతీతం. వాస్తవంగా ఇది తారు రోడ్డు అయినప్పటికీ గోతులు ఏర్పడి మట్టిరోడ్డుగా మారిపోయింది. చోడవరం-దేవరాపల్లి రహదారిలో అన్నవరం వెంకయ్యగారిపేట జంక్షన్‌ నుంచి గవరవరం వరకు రహదారి పలుచోట్ల బాగా దెబ్బతిన్నది. చోడవరం-లక్ష్మీపురం రోడ్డు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఈ రోడ్డంతా గుంతలు పడి వానపడితే రోడ్డు చెరువులా మారిపోతున్నది. 


బుచ్చెయ్యపేట మండలంలో...

మండలంలో అసలే అధ్వానంగా వున్న రహదారులు ఇటీవల తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలతో మరింత దారుణంగా తయారయ్యాయి. ఉన్న గోతులు మరింత పెద్దవికావండంతోపాటు వాటిల్లో నుంచి వచ్చిన రాళ్లు, కంకర రోడ్లపై విస్తరించి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి.  

భీమునిపట్నం-నర్సీపట్నం(బీఎన్‌) రోడ్డు,  కశింకోట-బంగారుమెట్ట (కేబీ) రోడ్డు, పీఎస్‌పేట నుంచి పొలేపల్లి, బుచ్చెయ్యపేట మీదుగా రావికమతం రోడ్డు, కేబీ రోడ్డు నుంచి పెదమదీన, గున్నెంపూడి మీదుగా రావికమతం రోడ్డు అత్యంత దారుణంగా వున్నాయి. రాత్రి వేళ్లలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బీఎన్‌ రోడ్డు విస్తరణ పనులకు ఏడాదిన్నర క్రితం ఎన్‌డీబీ నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌ కొంతమేర పనులు చేసిన తరువాత బిల్లులు రాకపోవడంతో రెండు నెలల క్రితం పనులు ఆపేశారు. యంత్రసామగ్రిని కూడా ఇక్కడి నుంచి తరలించుకుపోవడంతో రోడ్డు విస్తరణ పనులు అటకెక్కినట్టేనని భావిస్తున్నారు. కశింకోట-బంగారుమెట్ట (కేబీ) రోడ్డు అభివృద్ధికి అధికారులు పలు పర్యాయాలు టెండర్లు పిలిచినా... బిల్లులు రావేమోనన్న భయంతో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు.  ఇక వడ్డాది జంక్షన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచిపోయి చెరువులా మారుతున్నది.  రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా... నిధులు మంజూరు కావడంలేదని అధికారులు చెబుతున్నారు.


Updated Date - 2022-05-17T06:44:50+05:30 IST