ఉద్యోగం పోయింది.. ఉబెర్‌ ‘రైడర్‌’ అయ్యింది!

ABN , First Publish Date - 2022-05-17T08:04:37+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఉద్యోగం పోయింది.. ఉబెర్‌ ‘రైడర్‌’ అయ్యింది!

కోల్‌కతాలో ఓ మహిళ స్ఫూర్తిదాయక గాథ


కోల్‌కతా, మే 16: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉద్యోగాలు పోవడంతో కుటుంబ పోషణ కనాకష్టంగా మారిపోయింది. ఫలితంగా చాలా మంది పొట్టకూటి కోసం తాము ఎన్నడూ చేయని పనులు కూడా చేశారు, చేస్తున్నారు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఉద్యోగాలు పోవడంతో.. కొందరు కూలి పనులకు వెళ్లగా, మరికొందరు కూరగాయలు అమ్మారు. ఇంకొందరు టిఫిన్‌ సెంటర్లు పెట్టారు. ఇలా తమకు ఏ మాత్రం సంబంధం లేదని పనులు కూడా చేసి కుటుంబాన్ని పోషించుకున్నారు. కోల్‌కతాలోనూ అచ్చం ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కరోనా లాక్‌డౌన్‌కు ముందు మౌతుషి బసు(30) ప్యానాసోనిక్‌ సంస్థలో ఉద్యోగి. మహమ్మారి కారణంగా భారత్‌లో లక్షలాది మంది లాగే బసు కూడా ఉద్యోగం కోల్పోయింది.


అయితే ఆమె కుటుంబ పోషణకు సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఉబెర్‌ రైడర్‌గా మారింది! ఈమె కథను రచయిత రణవీర్‌ భట్టాచార్య లింక్డ్‌ఇన్‌లో షేర్‌ చేశారు. కోల్‌కతాలో తాను బయటకు వెళ్లేందుకు ఉబెర్‌ ద్విచక్ర వాహనాన్ని బుక్‌ చేయగా.. రైడర్‌గా బసు వచ్చిందని తెలిపారు. ప్యానాసోనిక్‌ సంస్థలో ఉద్యోగం పోయిన తర్వాత మరో దారి లేక.. ఇలా రైడర్‌గా మారినట్లు బసు చెప్పిందన్నారు. ఆమె భారీ వర్షంలోనూ బండిని జాగ్రత్తగా నడిపిందని వెల్లడించారు. ఇంతకుముందు ద్విచక్రవాహనం నడపడంలో అనుభవం ఉందా? అని అడిగితే.. ‘‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం కనిపించలేదు’’ అని ఆమె బదులిచ్చిందని తెలిపారు. వర్షంలో బండి నడిపినప్పటికీ ఆమె అదనంగా డబ్బేమీ అడగలేదని భట్టాచార్య చెప్పారు. లింక్డ్‌ఇన్‌లో భట్టాచార్య ఫాలోయర్లు బసు ఆత్మవిశ్వాసాన్ని, కుటుంబాన్ని పోషించాలన్న తపనను కొనియాడారు. 

Updated Date - 2022-05-17T08:04:37+05:30 IST