జగన్‌ పాలనలో ఉద్యోగాల కల్పన బూటకం

ABN , First Publish Date - 2021-06-20T04:51:58+05:30 IST

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఉద్యోగాల కల్పన బూటకమని, అభివృద్ధి నాస్తి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి హరిప్రసాద్‌ మండిపడ్డారు.

జగన్‌ పాలనలో ఉద్యోగాల కల్పన బూటకం
సమావేశంలో మాట్లాడుతున్న హరిప్రసాద్‌

కడప, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఉద్యోగాల కల్పన బూటకమని, అభివృద్ధి నాస్తి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి హరిప్రసాద్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖాళీగా ఉన్న 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో నిరుద్యోగులకు 4,77,953 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం ఐదు వేల గౌరవ వేతనంతో వైసీీపీ కార్యకర్తలకు ఇచ్చిన 2,59,565 వలంటీర్ల ఉద్యోగాలు, 1,21,512 గ్రామ సచివాలయ ఉద్యోగాలు కలిపి 3,81,083 ఉద్యోగాలను గత రెండేళ్లలో నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగాలుగా చూపించడం వైసీపీ ప్రభుత్వ గోబెల్స్‌ ప్రచారానికి నిదర్శనమన్నారు. రేషన్‌ డోర్‌ డెలివరీ పేరుతో నిరుద్యోగులను మూటలు మూసే కూలీలుగా మార్చారని మండిపడ్డారు. డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగ టీచర్లను నిరాశకు గురి చేస్తుందన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేషు పాల్గొన్నారు.


ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనా విజృంభణ


చెన్నూరు/కమలాపురం, జూన్‌ 19 : ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని కడప మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఐ.శివారెడ్డి అన్నారు. శనివారం కడప ఆర్డీవో కార్యాలయంలో ఏవోకు కమలాపురం నియోజకవర్గ పరిధిలోని టీడీపీ మండల శాఖ అధ్యక్షులతో కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర  వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య పెరిగిందని, అందులో ఎంతో మంది నిరుపేదలు అన్నారన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎన్నో పేద కుటుంబాలు చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదన్నారు. తల్లిదండ్రులో కరోనాతే మృతి చెందగా ఆయా కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పినప్పటికీ నేటికీ సక్రమంగా అమలు కాలేదన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నూరు అక్బర్‌, మాజీ అధికార ప్రతినిధి గుమ్మళ్ల మల్లికార్జునరెడ్డి, పెండ్లిమర్రి, వల్లూరు మండల శాఖ అధ్యక్షులు గంగిరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, యల్లారెడ్డి, మన్సూర్‌ అహ్మద్‌, గంధం ప్రసాద్‌, విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:51:58+05:30 IST