తేలని ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారం

ABN , First Publish Date - 2022-09-25T07:58:34+05:30 IST

ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజుల వ్యవహారం ఎటూ తేలలేదు. ఫీజులు పెరుగుతాయని కాలేజీ యాజమాన్యాలు ఆశించినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయారు.

తేలని ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారం

  • ఏఎఫ్‌ఆర్‌సీ సూచించిన ఫీజులను ఒప్పుకోని కాలేజీలు
  • తమ వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌
  • పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాలన్న ఏఎ్‌ఫఆర్‌సీ
  • ఏ నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడిన సమావేశం
  • మరోసారి కాలేజీలను పిలిచి మాట్లాడుతామన్న కమిటీ
  • రేపు మళ్లీ సమావేశం జరిగే అవకాశం?


హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజుల వ్యవహారం ఎటూ తేలలేదు. ఫీజులు పెరుగుతాయని కాలేజీ యాజమాన్యాలు ఆశించినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. దీనికి మరో రెండు రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. శనివారం జరిగిన తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎ్‌ఫఆర్‌సీ) సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. ఏఎ్‌ఫఆర్‌సీ సూచించిన ఫీజులను కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఏఎ్‌ఫఆర్‌సీ చైర్మన్‌ స్వరూ్‌పరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రి, వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీల యజమానులు పాల్గొన్నారు. కాలేజీలు సమర్పించిన అఫిడవిట్‌లపై చర్చించారు. తమ వార్షిక వ్యయాలు, మార్కెట్‌లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఫీజులను నిర్ధారించాలని ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు డిమాండ్‌ చేశాయి. 


ఇదివరకు ఏఎ్‌ఫఆర్‌సీ సూచించిన ఫీజులను మూడేళ్ల పాటు అమలు చేశామని, మరో మూడేళ్ల కోసం కొత్త ఫీజులను నిర్ధారించాలని కోరాయి. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైందని, ఇంజనీరింగ్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తయిందని, కాబట్టి ఫీజుల వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని చెప్పాయి. అయితే ఫీజుల నిర్ధారణ సమయంలో పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. కాలేజీలు డిమాండ్‌ చేసినంత మేర ఫీజులను పెంచితే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఫీజులను నిర్ధారిస్తామన్నారు. కాలేజీల గ్రేడులను పరిగణనలోకి తీసుకుని ఫీజుల వివరాలను అధికారులు వెల్లడించారు. కానీ ఈ ఫీజులకు కాలేజీలు అంగీకరించలేదు. అంత తక్కువ ఫీజులను తాము ఒప్పుకొనేది లేదని దాదాపు 20 కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో ఫీజుల వ్యవహారం ఒక పట్టాన తేలలేదు. చివరకు అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. తాము సూచించిన ఫీజులను ఒప్పుకోని కాలేజీల యాజమాన్యాలను మరోసారి పిలిచి, సమావేశం నిర్వహిస్తామని అధికారులు తెలియజేశారు. ఆ సమావేశంలోనే ఫీజులను ఖరారు చేసే అవకాశాలున్నాయి. సమావేశం సోమవారం జరగవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికైతే ఏఎ్‌ఫఆర్‌సీ ఎలాంటి తేదీని ప్రకటించలేదు.

Updated Date - 2022-09-25T07:58:34+05:30 IST