పీఎఫ్‌ఐ కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-09-24T05:51:26+05:30 IST

పీఎఫ్‌ఐ (పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) కార్యకలాపాలపై జాతీయస్థాయిలో ఉన్నతాధికారులు నజర్‌ పెట్టారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్వాధీనం చేసుకున్న ఆధారాలు, సమాచారాన్ని డీకోడ్‌ చేస్తున్నారు.

పీఎఫ్‌ఐ కేసులో దర్యాప్తు ముమ్మరం

స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆధారంగా

సమాచారాన్ని డీకోడ్‌ చేస్తున్న అధికారులు

సహకారం అందించినవారిపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ నజర్‌

నిజామాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పీఎఫ్‌ఐ (పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) కార్యకలాపాలపై జాతీయస్థాయిలో ఉన్నతాధికారులు నజర్‌ పెట్టారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్వాధీనం చేసుకున్న ఆధారాలు, సమాచారాన్ని డీకోడ్‌ చేస్తున్నారు. పఎఫ్‌ఐకి సహకరించిన వారితో పాటు ఆర్థిక సహాయం చేసిన వారిని గుర్తిస్తున్నారు. మరికొంతమందిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక సమాచారాన్ని సేకరించే పనిలో ఎన్‌ఐఏతో పాటు జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై దృష్టిపెట్టడంతో పాటు వీరికి ఏయే సంఘాలు, ఏయే వ్యక్తులు సహకారం అందించారో పరిశీలిస్తున్నారు. ఆ వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారి ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 

జూలైలో నమోదైన కేసు ఆధారంగా..

జిల్లాలో జూలైలో నమోదైన పీఎఫ్‌ఐ కేసు ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడి కేసు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, హైదరాబాద్‌, కర్నూల్‌, నెల్లూర్‌ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న సమాచారం ఆధారంగా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పీఎఫ్‌ఐ పేరున నిజామాబాద్‌లో అబ్దుల్‌ ఖాదర్‌ కరాటే శిక్షణతో పాటు లీగల్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాలను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలోని 400 మందికి పైగా శిక్షణ ఇచ్చాడు. వారిని ఇతర ప్రాంతాలకు పంపించారు. జిల్లా పోలీసులు ఈ కేసును ఛేదించడంతో పాటు 36 మందిపై కేసులు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు ఉగ్రవాద లింకులు ఉండడంతో ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఈ కేసు ఆధారంగా సుమారు నెలన్నరపాటు దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ అధికారులు ఒకేసారి అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువులు, సెల్‌ఫోన్‌లు, బ్యాంక్‌ అకౌంట్‌, లాప్‌టాప్‌ల ఆధారంగా సమాచారాన్ని డీకోడ్‌ చేసే ప్రయత్నంలో ఉన్నారు. పీఎఫ్‌ఐ మాటున వీరికి ఎవరెవరు సహకారం అందించారో? ఏ పార్టీ వ్యక్తులు సహాయం చేశారో? ఏయే ప్రాంతాల నుంచి ఆర్థిక సహాయాన్ని అందించారో దర్యాప్తులో వివరాలను రాబడుతున్నారు. డీకోడ్‌ ఆధారంగా వచ్చిన సమాచారం బట్టి మరికొంతమంది ఇళ్లలో సోదాలు నిర్వహించేందుకు ఎన్‌ఐఏ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో హోంమంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడంతో పాటు పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా దృష్టిసారించడంతో కీలకంగా మారింది. పీఎఫ్‌ఐ 2000 సంవత్సరంలో మొదలైన అప్పటి నుంచి ఏయే ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించిందో వివరాలు తీసుకోవడంతో పాటు ఎంతమంది సభ్యులను చేర్చుకున్నారు. శిక్షణ ఇచ్చారో అనే అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వీరికి ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేయడంతోపాటు అలాంటి కార్యకలాపాలను అంతర్గతంగా పీఎఫ్‌ఐ సభ్యులు చేశారా అనే కోణంలో పరిశీలన జరుపుతున్నారు. రాష్ట్ర, జిల్లా పోలీసుల సహకారంతో మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో ఎన్‌ఐఏ అధికారులు ఉన్నారు.

జిల్లా పోలీసుల నజర్‌

నిజామాబాద్‌ నగరం కేంద్రంగా పీఎఫ్‌ఐ కార్యకలాపాలు బయటపడడంతో జిల్లా పోలీసులు కూడా నజర్‌ పెట్టారు. ఎన్‌ఐఏ అధికారులతో కలిసి ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడి గుండారం నుంచే 400 మందికిపైగా శిక్షణ ఇచ్చి ఇతర ప్రాంతాలకు పంపించడంతో వారికి సంబంధించిన పూర్తి వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాతో పాటు పక్కనే ఉన్న నిర్మల్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో కార్యకలాపాలు బయటపడడంతో మరింత ఎక్కువగానిఘా పెట్టారు. పక్కనే మహారాష్ట్ర ఉండడం, కొన్ని సంస్థలకు సహాయ సహకారాలు అందించడంతో ఆ రాష్ట్ర పరిధిలో కూడా ఏవైనా కార్యకలాపాలు జరిపారా అనే కోణంలో ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మద్నూర్‌, జుక్కల్‌కు పక్కనే కర్నాటక రాష్ట్రం ఉండడంతో ఆ ప్రాంతంలోని పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై కూడా అధికారులు నజర్‌పెట్టారు. రాష్ట్రస్థాయిలో కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, జాతీయస్థాయిలో హోంమంత్రి నేతృత్వంలో సమీక్ష జరగడంతో ఈ కేసును మరింత సీరియస్‌గా తీసుకుని అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో నజర్‌ పెట్టారు. జిల్లా స్థాయిలో ఎవరెవరు సహకరించారో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆర్థికంగాగాని, ఇతర సహాయం అందించిన వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కీలకంగా జిల్లాలో నమోదైన కేసు

జిల్లాలో నమోదైన పీఎఫ్‌ఐ కేసు ఎన్‌ఐఏకు కీలకంగా మారింది. ఇతర  రాష్ట్రాల్లో ఇంతపెద్ద కేసు నమోదుకాకపోవడం వల్ల ఇక్కడి కేసునే ప్రామాణికంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఐఏ దక్షణాది రాష్ట్రాల అధికారులతో పాటు జాతీయస్థాయిలోని ఉన్నతాధికారులు కూడా హైదరాబాద్‌ కేంద్రంగా నజర్‌పెట్టి ఈ కేసును తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ విస్తరించి ఉండడం, జార్ఖండ్‌ మినహా ఇతర రాష్ట్రాల్లో నిషేధిత జాబితాలో లేకపోవడం వల్ల కార్యకలాపాలు ఎక్కువగా జరగడంతో వాటన్నిటిపై నజర్‌ పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా కేసులో నమోదైన వారందరినీ పట్టుకోవడంతో పాటు ప్రస్తుతం అరెస్టు చేసిన వారి ద్వారా వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. శిక్షణ ఇచ్చినవారు ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఏయే రాష్ట్రాలకు పంపించారో ఎక్కడెక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో అనే అంశాలపై దృష్టిపెట్టి ఎన్‌ఐఏ అధికారులు ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

కొన్నేళ్లుగా పీఎఫ్‌ఐ కార్యకలాపాలు..

జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పోలీసు అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల ఇవి బయటకి రాలేదు. గత ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిడుల వల్ల కొన్ని ప్రాంతాలపై దృష్టిపెట్టకపోవడంతో ఈ కార్యకలాపాలు యథేచ్ఛగా జరిగినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న అధికారులు ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టడం వల్ల ఈ కేసు బయటకి రావడంతో పాటు దానికి సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేశారు. జిల్లా కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు ఇక్కడి పోలీసులను ప్రశంసించినట్లు తెలుస్తోంది. జిల్లా పోలీసు అధికారులు మరింత నిఘాపెట్టి పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై దృష్టి సారించారు. జాతీయస్థాయిలో కేసు ఉండడంతో మరింత నిఘాను జిల్లా పోలీసులు పెంచారు. మరికొన్ని రోజుల్లో ఎన్‌ఐఏ అధికారులు మరో దఫా జిల్లాకు వచ్చి దర్యాప్తుచేసే అవకాశం ఉన్నట్లు సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు.


Updated Date - 2022-09-24T05:51:26+05:30 IST