కె.ఆర్‌. విజయ కజిన్‌ అన్నారు!

ABN , First Publish Date - 2020-10-25T05:40:12+05:30 IST

ఒక మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నేను. చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్‌ చేసి, ఎన్నో యాడ్స్‌లో నటించా. కానీ సినిమాలు, సీరియళ్ల మీద ఏమాత్రం అవగాహన లేదు...

కె.ఆర్‌. విజయ కజిన్‌ అన్నారు!

  • ఒకప్పుడు దేవత పాత్ర అనగానే అందరికీ కె.ఆర్‌. విజయ గుర్తుకు 
  • వచ్చేవారు. ఆ తర్వాతి కాలంలో అంతటి ఆదరణ పొందిన నటి సనా. 
  • ఇటు సినిమాల్లోను.. అటు టెలివిజన్‌ సీరియల్స్‌లోను 
  • దేవతగా అనేక పాత్రల్లో నటించిన సనా అంతరంగం
  • ఈ విజయదశమి రోజున ‘నవ్య’ పాఠకుల కోసం..


ఒక మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నేను. చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్‌ చేసి, ఎన్నో యాడ్స్‌లో నటించా. కానీ సినిమాలు, సీరియళ్ల మీద ఏమాత్రం అవగాహన లేదు. ఒక టీవీ షో చేస్తున్న సమయంలో నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా ప్రారంభమయిన నా ప్రస్థానం ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుతూ వస్తోంది. సాధారణంగా ముస్లిం కుటుంబాలలో అమ్మాయిలు బయటకు రావాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. కానీ నాకు అలాంటి నిబంధనలు ఏమి అడ్డం రాలేదు. అంతేకాదు.. నేను అనేక హిందూ దేవతల పాత్రలు వేసినా నన్ను ప్రొత్సహించారు. నేను నటించిన తొలి భక్తి సీరియల్‌ ‘ఆది పరాశక్తి’. నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది. రోజూ నమాజ్‌ చేస్తా. కానీ హిందూ దేవతల ఆహార్యాలు తెలియవు. అందువల్ల మొదట్లో ఆది పరాశక్తి పాత్ర చేయటానికి భయపడ్డా. మేకప్‌ టెస్ట్‌ చేసే ముందు అమ్మవారి ఫొటో చూపించి ఇలాంటి లుక్‌ రావాలని చెప్పారు. మామూలుగా ఈ తరహా పాత్రలు చేసేటప్పుడు ఏ ఆర్టిస్ట్‌ అయినా దేవుణ్ణి మొక్కుతారు. నేను అలాగే ఆ తల్లికి మొక్కాను.


‘‘తల్లీ నువ్వు ఎలా ఉంటావో, నీ శక్తులు ఎలా ఉంటాయో నాకు తెలీదు. నువ్వు ఉన్నావా లేదా అన్నది కూడా నాకు తెలీదు. నీ రూపాన్ని నాకు ఇచ్చి.. నా ద్వారా పదిమందికి నీ శక్తిని తెలియ చెయ్యి’ అని మొక్కుకున్నాను. మేకప్‌ వేశాక.. దర్శకనిర్మాతలు నాకు దిష్టి తీసి, కొబ్బరికాయ కొట్టి దండం పెట్టారు. అంతగా నేను ఆ పాత్రలో ఇమిడిపోయానని అర్థమైంది. ఆ సీరియల్‌ పెద్ద హిట్టైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అమ్మవారిని నమ్ముతూనే ఉన్నా. ప్రతిరోజూ మొక్కుతాను. అప్పట్లో అమ్మవారి పాత్రలకు కె.ఆర్‌. విజయగారు చాలా పేరుగాంచారు.  ‘ఆది పరాశక్తి’ సీరియల్‌లో నా పాత్ర ఆవిడే చేశారని అనుకున్నారట. కొందరైతే ఆవిడ కజిన్‌ అనుకున్నారట. అది నాకు దక్కిన గొప్ప గౌరవం. 




సినిమాల్లో కూడా..

బాపుగారు ఏ సినిమా తీసినా దానిలో నేను తప్పనిసరిగా ఉండేదాన్ని. సినిమాల్లోనే కాదు.. సీరియళ్లలో కూడా దేవతల పాత్రలకు నేనే న్యాయం చేయగలనని ఆయన బలంగా నమ్మేవారు. ‘భాగవతం’ సీరియల్‌లో యశోద పాత్రకు నన్ను ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల నాకు ఆలస్యం అయింది. అయినా బాపుగారు నా కోసం వేచి చూసి- ఆ పాత్ర వేయించారు. చివరిరోజు షూటింగ్‌ అయిపోయాక లొకేషన్‌లో అందరం సర్దుకుంటున్నాం. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి- ‘యశోద పాత్రకు న్యాయం చేసినందుకు చాలా థ్యాంక్స్‌ అమ్మా’ అని అన్నారు. నా జీవితంలో అంతకన్నా గొప్ప ప్రశంస మరొకటి ఉండదు. సాధారణంగా బాపు గారిని మెప్పించటం అంత సాధారణమైన విషయం కాదు. ఇప్పటికీ ఆ సంఘటన తలచుకుంటే ఆనందభాష్పాలు వస్తాయి. ఆయన డైరెక్ట్‌ చేసిన ‘శ్రీరామ రాజ్యం’లో  కైకేయి పాత్ర కూడా మరిచిపోలేనిది. 




మా దేవత అంటారు...

కె.రాఘవేంద్ర రావుగారి దర్శకత్వంలో ఎస్వీబీసీ ఛానెల్‌ కోసం ‘సృష్టి’ సీరియల్‌ చేశా. అందులోనూ అమ్మవారి పాత్రే. ఇప్పటికీ రాఘవేంద్రరావుగారికి నేను కనిపిస్తే ‘మా దేవత వచ్చింది’ అంటారు. నేను ఎక్కడికైనా వెళ్లినప్పుడు నన్ను ఒక దేవతలా చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. నాపై ఎంతో బాధ్యత ఉన్నట్లనిపిస్తుంది. ఒకసారి ఎస్వీబీసీ ఛానెల్‌ నిర్వహించిన కార్యక్రమానికి నన్ను, నా భర్తను ఆహ్వానించారు. తిరుపతిలో నన్ను ఒక ముస్లిం అమ్మాయిగానో.. సనా అనే నటిగానో చూడలేదు. ఓ దేవతలా చూశారు. హరిద్వార్‌లోనూ ఇలాంటి విశేషమే మరొకటి జరిగింది. హరిద్వార్‌లో షూటింగ్‌ జరగాల్సి ఉంది. హరిద్వార్‌లోని కొన్ని దేవాలయాల్లో ముస్లింలను అనుమతించరు. అలాంటి ఆలయంలో షూటింగ్‌ చేయాలి. దానిలో సాధువు పాత్ర వేశా. ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్‌ జరిగిపోయింది. ఆ షూటింగ్‌ పూర్తయిన తర్వాత నాకు ప్రత్యేకంగా గంగా హారతి చూపించారు. 


నేనే శక్తిని అయితే...

నేనే ఆదిపరాశక్తి అయితే ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు పరిష్కారం చూపించేదాన్ని. పాపం చేసిన వారికి వెంటనే శిక్ష పడాలి. లేకపోతే సమాజంలో భయం ఉండదు. నా ఉద్దేశంలో అకృత్యాలకు పాల్పడేవారికి ఈ భూమిపై బతికే అర్హత లేదు. నేను కెరీర్‌ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ అన్ని రంగాల్లోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పోటీ పెరిగింది. దానికి తగ్గట్టే మనం అప్‌డేట్‌ అవుతుండాలి. మనల్ని మనం ఎలివేట్‌ చేసుకోవాలి. అందుకే సోషల్‌ మీడియాలో హైపర్‌ యాక్టివ్‌గా ఉంటా. లాక్‌డౌన్‌ సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. ఒక ఫుడ్‌ యూ ట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించా. దానికి మంచి ఆదరణ లభిస్తోంది. 


  1. నాకు చిన్నప్పటి నుంచి ఓ స్కూలు నడపాలని కోరిక ఉండేది. సినిమాల్లోకి రాకపోతే టీచర్‌గా సెటిల్‌ అయ్యేదాన్ని. 
  2. ప్రతి రోజూ పాజిటివ్‌గానే ఉంటా. ఆనందంగా ఉండటం కోసమే ఈ జీవితం ఉందనే విషయాన్ని నమ్ముతా. పాజిటివ్‌గా ఉండటమే నా బ్యూటీ సీక్రెట్‌! మనసు ప్రశాంతంగా ఉంటే ఆ ఆనందం మన ముఖంలో కనిపిస్తుందని నమ్ముతా. మన పనితో మనం బిజీగా ఉంటే ఎలాంటి చెడ్డ ఆలోచనలు దరి చేరవని నా నమ్మకం. 
  3. ఇప్పటి దాకా నేను దక్షిణాది భాషల్లో 600లకు పైగా సినిమాల్లో, టెలివిజన్‌ సీరియల్స్‌లోను నటించా. నా తొలి సినిమా ‘నిన్నే పెళ్లాడుతా’! 
  4. టెలివిజన్‌ సీరియల్స్‌ను, సినిమాలను వేర్వేరుగా చూడను. టీవీ సీరియల్స్‌కు ఎక్కువ సేపు పనిచేయాలి. పని గంటలు ఎక్కువ. సినిమాలకు అంత ఎక్కువ పని ఉండదు. నాకు టీవీ, సినిమా రెండు కళ్ల లాంటివి.


-  ఆలపాటి మధు

Updated Date - 2020-10-25T05:40:12+05:30 IST