ప్రారబ్ధానుభవం తప్పేది కాదు

ABN , First Publish Date - 2020-10-03T07:35:29+05:30 IST

ఈ సృష్టిలో గల 84 లక్షల జీవరాశులలో భగవంతుడు మానవుని అగ్రభాగాన ఉంచాడు. ఏ ఇతర ప్రాణికీ లేనన్ని శక్తియుక్తులను,

ప్రారబ్ధానుభవం తప్పేది కాదు

ఈ సృష్టిలో గల 84 లక్షల జీవరాశులలో భగవంతుడు మానవుని అగ్రభాగాన ఉంచాడు. ఏ ఇతర ప్రాణికీ లేనన్ని శక్తియుక్తులను, తెలివితేటలను ఇచ్చాడు. ప్రకృతిని అర్థం చేసుకోవడమేగాక.. కొంతవరకూ తన నియంత్రణలో ఉంచుకోగల్గిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. ‘నీ ఇష్టానుసారం జీవితాన్ని గడపవచ్చు’ అంటూనే ఒక కఠినమైన, దాటలేని గీటు గీశాడు. ఏమిటా గీత అంటే.. కర్మ ఫలం. ‘‘నీవు మంచి చెయ్యి, చెడు చెయ్యి, అది నీ ఇష్టం. కానీ.. ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని గ్రహించడానికి నీకు విచక్షణ జ్ఞానం ఇస్తున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకో. మంచి పని చేస్తే మంచి ఫలితం. చెడ్డ పని చేస్తే చెడ్డఫలితం’’ అని దైవశాసనం. ఒక్క మనిషికే ఈ నియమం. పశు పక్ష్యాదులకు, మృగాలకు, కీటక జాతులకు ఈ నియమం వర్తించదు. విచక్షణ జ్ఞానం సంతరించుకోని చిన్న పిల్లలకు కూడా ఈ నియమం వర్తించదంటారు ధర్మవేత్తలు.


ఉదాహరణకు ఒక ఆవును స్వేచ్ఛగా వదిలేస్తే తనకు ఇష్టమైన చోట, అనుకూలంగా ఉన్న చోట మేత మేస్తుంది. ‘ఇక్కడ మేయవచ్చా? ఇది నా యజమానిదా? పరాయి వారిదా’.. ఇవేవీ దానికి తెలియవు. ఇతరుల పంటపొలాలలో పడి తింటే దానికి స్వేచ్ఛనిచ్చిన యజమానిదే తప్పవుతుంది గానీ, పైరును మేసిన పశువుదిగాదు. అలాగే.. వేటాడి, ఇతర జంతువులను వధించి కడుపు నింపుకోవడం మృగజాతి లక్షణం. కనుక వాటికి పాప పుణ్యాల ఫలితాలు వర్తించవు.



‘పని’కి కర్మ అనే పేరుంది. పని చేయడమంటే కర్మ చేయడమని అర్థం. అందుకే.. పని ఫలితం అనకుండా ‘కర్మ ఫలం’ అంటున్నాం. మనం ఏ కర్మ చేసినా అంతే మోతాదులో కర్మ ఫలం అనుభవించవలసి ఉంటుంది. ఒక రకంగా ఆధునిక సాంకేతిక శాస్త్ర సూత్రాలు కూడా ఈ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయి. భౌతిక శాస్త్రంలో న్యూటన్‌ సూత్రాలు మూడు ఉంటాయి. వాటిలో.. ‘మనం చేసే ప్రతి చర్యకూ దానికి సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే సూత్రం కర్మఫలానికి అతికినట్టు సరిపోతుంది. కర్మసిద్ధాంతంలో దీనినే మన పెద్దలు ‘ప్రారబ్ధం’ అని చెబుతారు.


సైన్స్‌లో.. చర్యకు ప్రతిచర్య వెంటనే ఉంటుంది. కానీ, కర్మ సిద్ధాంతంలో మనం చేసే కర్మ తాలూకూ ఫలితం వెంటనే అనుభవంలోకి రావచ్చు. లేదా కొంతకాలానికి రావచ్చు. లేదా మరు జన్మలో, ఆపై జన్మలోనైనా అనుభవానికి రావచ్చు. అనుభవించడం మాత్రం తథ్యం. అది ఎప్పుడు ఎట్లా అనేది దైవ నిర్ణయం. ‘జనని గర్భము నుండి జనియించినప్పుడు.. కంఠమాలలేవి కానరావు.. మంచి ముత్యపుసరుల్‌ మచ్చుకైననులేవు- మేల్మి బంగరు దండలు మెడకులేవు కాని, కలదోకమాల మీ కంఠమందు, అదియే మీ కర్మలన్నియు చేర్చిన కంఠమాల - ప్రారబ్ధమనియెడి చద్దిమూట’ అంటారు సత్యసాయిబాబా.


 మన ప్రయాణం ఆరంభించినపుడు మధ్యలో తినడానికి ఎలాంటి పదార్థాలను మూట కట్టుకున్నామో.. ప్రయాణంలో అవే తినాలి కదా! వేరే పదార్థాలు ఎట్లావస్తాయి. ప్రారబ్ధమూ అంతే. అనుభవించక తప్పదు. కాబట్టి, ఎల్లప్పుడూ మంచి పనులే చేస్తే అంతా మంచే జరుగుతుంది. ఆ మంచి ఫలితాన్ని కూడా తీసుకోకుండా దేవుడికి అర్పిస్తే.. పాప, పుణ్యాలు లేక, మరుజన్మ ఎత్తే బాధ తప్పుతుంది. అదే మోక్షం.

- మాదిరాజు రామచంద్రరావు, 93933 24940


Updated Date - 2020-10-03T07:35:29+05:30 IST