అమెరికాకు తెలుగు విద్యార్థుల వెల్లువ

ABN , First Publish Date - 2021-03-06T08:41:29+05:30 IST

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్నారు.

అమెరికాకు తెలుగు విద్యార్థుల వెల్లువ

  • గత విద్యాసంవత్సరం భారత్‌ నుంచి..
  • అమెరికాకు  1,93,124 మంది విద్యార్థులు
  • వారిలో సగం మంది తెలుగు వారే
  • 25 శాతం మంది తెలుగు కుటుంబాలకు 
  • యూఎస్‌తో అనుబంధం: కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రైఫ్మెన్‌


తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్నారు. గత విద్యాసంవత్సరంలో 1,93,124 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లగా, వారిలో దాదాపు సగం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ప్రతి నాలుగు తెలుగు కుటుంబాల్లో ఒకరికి అమెరికాతో అనుబంధం ఉంటున్నది. అమెరికాలో సుమారు 10 లక్షల మంది వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రతి ఐదుగురు విదేశీ విద్యార్థుల్లో ఒకరు భారతదేశానికి చెందినవారేనని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రైఫ్మెన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా నుంచి చదువుకునేందుకు అమెరికా వెళ్లే వారి సౌకర్యం కోసం వైయాక్సిస్‌ ఫౌండేషన్‌తో కలిసి ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ ఏర్పాటు చేసిన కొత్త సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులలో 75ు మందికి వీసాలు మంజూరు చేసినట్లు తెలిపారు. కరోనా కారణంగా చాలా మంది విద్యార్థులు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారని ముందు ముందు స్టూడెంట్‌ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. అమెరికాలో ఉన్న 4,000 విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో తమ అర్హతలకు అనుగుణంగా ఉత్తమమైన విద్యాసంస్థలను ఎంపిక చేసుకునేందుకు యువత ఎంతో శ్రమిస్తున్నదని పేర్కొన్నారు.


వారందరికి తోడ్పాటు అందించేందుకు ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ తొలిసారి ప్రైవేటు భాగస్వామి వైయాక్సి్‌సతో కలిసి సేవా కేంద్రాన్ని ప్రారంభించిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో అమెరికాకు ఉన్న అనుబంధం దృష్ట్యా మెరుగైన సేవల్ని అందించేందుకు త్వరలో సువిశాలమైన కాన్సులేట్‌ భవనాన్ని ప్రారంభించనున్నట్లు  చెప్పారు. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే వారికి ఈ సెంటర్‌ ఉచితంగా సలహాలు, సేవలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌  జూబ్లీహిల్స్‌లోని వైయాక్సిస్‌ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రంలో అమెరికాలో ఉన్నత విద్యకు సంబంధించిన పుస్తకాలు, మేగజైన్‌లు, డీవీడీలు ఇతర సమాచారం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో ఇది రెండవ ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ సెంటర్‌. అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో ఇప్పటికే ఒక సెంటర్‌ను నిర్వహిస్తున్నారు.          

 స్పెషల్‌ డెస్క్‌



గ్లోబల్‌ ఇండియన్స్‌ లక్ష్యం 

ఉన్నత విద్య, పరిశోధనలు చేసే వారికి అమెరికా గమ్యస్థానంగా మారింది. అక్కడ చదువుకున్న లక్షలాది మంది భారతీయులు ప్రపంచదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మరింత నాణ్యమైన విద్య అందించి గ్లోబల్‌ ఇండియన్స్‌ను తయారు చేయడం కోసం ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ ఇప్పటికే భారత్‌లో 8 సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నది. 

డేవిడ్‌ కెన్నడీ, ఢిల్లీలోని యూఎస్‌ 


ఎంబసీ పబ్లిక్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ కౌన్సిలర్‌ విద్యార్థులకు కొండంత అండ  

విదేశీ విద్యాసంస్థల్లో అడ్మిషన్‌లు ఇప్పించే సంస్థలకు విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి కొంత కమిషన్‌గా అందుతుంది. దాంతో ఆయా సంస్థలు విద్యార్థులకు కొంత పక్షపాతంతో సలహాలు ఇచ్చే ప్రమాదముంది. విద్యాసంస్థల వైపు కాకుండా విద్యార్థుల పక్షాన ఉండి వారికి ఉచిత సలహాలు ఇచ్చేందుకు కొత్త సేవా కేంద్రం పనిచేస్తుంది. ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ తొలిసారి మాతో చేతులు కలపడం వైయాక్సిస్‌ విశ్వసనీయతకు నిదర్శనం. స్టూడెంట్‌ వీసాల జారీ గందరగోళంగా ఉంటున్నదనే అభిప్రాయం సరికాదు. 

- జేవియర్‌ అగస్టీన్‌, వైయాక్సిస్‌ ఫౌండేషన్‌ సీఈవో

Updated Date - 2021-03-06T08:41:29+05:30 IST