ముడుపులు ఇచ్చిన వారికే ఇన్‌చార్జి పోస్టు

ABN , First Publish Date - 2022-09-28T05:33:07+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు హాస్టళ్ల ఇన్‌చార్జి పోస్టుల కోసం డిమాండ్‌ ఏర్పడింది. ముడుపులు ఇచ్చిన వారికే ఇన్‌చార్జి పోస్టింగ్‌ ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఒక శాఖ పరిధిలోని వార్డెన్లకు ఇతర శాఖలోని హాస్టళ్ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.

ముడుపులు ఇచ్చిన వారికే ఇన్‌చార్జి పోస్టు
మహబూబ్‌నగర్‌లోని బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ కార్యాలయం

హాస్టళ్ల వార్డెన్‌ పోస్టులకు ఫుల్‌ డిమాండ్‌

అదనపు బాధ్యతల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్న వార్డెన్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి

కొందరు వార్డెన్లు, అధికారుల మధ్య కోల్డ్‌వార్‌

నష్టపోతున్న విద్యార్థులు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, సెప్టెంబరు 27: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు హాస్టళ్ల ఇన్‌చార్జి పోస్టుల కోసం డిమాండ్‌ ఏర్పడింది. ముడుపులు ఇచ్చిన వారికే ఇన్‌చార్జి పోస్టింగ్‌ ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఒక శాఖ పరిధిలోని వార్డెన్లకు ఇతర శాఖలోని హాస్టళ్ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు రెగ్యులర్‌ వార్డెన్లు లేకపోవడంతో ఉన్న వారు ఇన్‌చార్జిలుగా పని చేస్తున్నారు. వసతి గృహాల వార్డెన్లకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వకూడదన్న నిబంధనలు ఉండగా, ఇన్‌చార్జి పోస్టుల కోసం పలువురు వార్డెన్లు ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం రూ.లక్షలు వెచ్చించేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇదే అదునుగా జిల్లాలోని ఆయా సంక్షేమ శాఖల అధికారులు తమకు అనుకూలంగా ఉంటూ, తాము అడిగినంత ఇచ్చే వార్డెన్‌లకు ఇన్‌చార్జి పోస్టులు ఇచ్చారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో పని చేస్తున్న ఇద్దరు వార్డెన్స్‌ ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 


ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 8 హాస్టళ్లు

జిల్లాలో ఎస్టీ అభివృద్ధి శాఖ కింద ఎనిమిది వసతి గృహాలు ఉన్నాయి. అందులో నలుగురు రెగ్యులర్‌ వార్డెన్లు ఉండగా, మిగతా నాలుగు చోట్ల ఇన్‌చార్జీలు కొనసాగుతున్నారు. వారిలో ఒకరికి నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో పోస్టింగ్‌ ఉండ గా, జడ్చర్ల ఎస్టీ బాలికల వసతి గృహం ఇన్‌ చార్జిగా డిప్యుటేషన్‌పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. మిగ తా మూడు హాస్టళ్ల ఇన్‌చార్జీలుగా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖలో పని చేస్తున్న వారికి బాధ్యతలు అప్పగించారు. నంచర్ల ఎస్సీ వార్డెన్‌కు మహమ్మ దాబాద్‌ గిరిజన బాలుర హాస్టల్‌ ఇన్‌చార్జిగా, మహమ్మదాబాద్‌ ఎస్సీ బాలికల వార్డెన్‌కు మహమ్మదాబాద్‌ గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జిగా, జడ్చర్ల ఎస్సీ హాస్టల్‌ వార్డెకు జడ్చర్ల గిరిజన బాలికల హాస్టల్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యులర్‌గా ఉన్న నలుగురు వార్డెన్స్‌కు ఇన్‌ చార్జి బాధ్యతలు ఇవ్వకుండా ఇతర శాఖల వార్డెన్లకు బాధ్యతలు ఇవ్వడంపై ఆ శాఖలో పని చేస్తున్న వార్డెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.


బీసీ సంక్షేమ శాఖలోనూ ఇదే పరిస్థితి

జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధిశాఖ పరిధిలో 15 హాస్టళ్లు ఉన్నాయి. అందులో పోస్టుమెట్రిక్‌ కళాశాల హాస్టళ్లు ఐదు, పది ఫ్రీమెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. 15 హాస్టళ్లకు గాను తొమ్మిది మంది మాత్రమే రెగ్యులర్‌ వార్డెన్లు ఉన్నారు. మిగతా ఆరు హాస్టళ్లకు ఇన్‌చార్జిలు ఉన్నారు. ఇక్కడా నిబంధనల ప్రకారం కాకుండా ముడుపులు ఇచ్చిన వారికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల 317 జీవో ప్రకారం జిల్లాలోని మూసాపేట హాస్టల్‌కు వార్డెన్‌ పోస్టింగ్‌ ఇచ్చారు. జడ్చర్ల ఇన్‌చార్జిగా పని చేస్తున్న వారిని విధుల నుంచి తొలగించి, అక్కడ మూసాపేట వార్డెన్‌కు ము డుపులు తీసుకుని ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పినట్లు ఓ వార్డెన్‌ ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తెచ్చారు. ఇదేంటని ప్రశ్నిస్తే సదరు వార్డెన్‌ను నిత్యం వేధిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఎస్సీ సంక్షేమ శాఖలో ఒకరికే మూడు హాస్టళ్ల బాధ్యతలు

జిల్లాలో షెడ్యూల్డు కులాల అభివృద్ధిశాఖ కింద 25 హాస్టళ్లు ఉన్నాయి. 20 మంది రెగ్యులర్‌ వార్డెన్లు విధులు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ వెంకటేశ్వర కాలనీ హాస్టల్‌ వార్డెన్‌ ఒక్కరే మూడు హాస్టళ్ల బాధ్యతలు చూస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో గల ఆనంద నిలయంతో పాటు యన్మగండ్ల, హన్వాడ హాస్టళ్ల వార్డెన్‌గా కొనసాగుతున్నారు. వస్పుల వార్డెన్‌కు రెగ్యులర్‌ పోస్టింగ్‌ ఉండగా, బాలానగర్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. జడ్చర్ల వార్డెన్‌కు మూసాపేట, దేవరకద్ర వార్డెన్‌ సీసీకుంట ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్నారు. ఈ శాఖలోని మరో ముగ్గరు గిరిజన సంక్షేమాభివృద్ధిశాఖ లో వార్డెన్‌లుగా కొనసాగుతున్నారు. 


 నిబంధనలకు నీళ్లు

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖలలో ఇన్‌చార్జి వార్డెన్లు ఉన్న చోట విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వార్డెన్‌లకు, అధికారులకు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తుండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. నిబంధనల ప్రకారం ఆదేశాఖలో పనిచేసే వార్డెన్లకు, దగ్గరగా ఉన్న హాస్టళ్ల వార్డెన్లకు ఇన్‌చార్జి బాధ్యతలు కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు కల్పించుకొని అధికారులు, వార్డెన్ల మధ్య సమన్వయం ఉండేలా చూసి, విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు కోరు తున్నారు.


నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాం

గిరిజన హాస్టల్స్‌కు మా శాఖ నుంచే ఇన్‌చార్జీలను ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేదు. అవసరమైతే ఇతర శాఖల నుంచి తీసుకోవచ్చు. మా శాఖలో పని చేస్తున్న వార్డెన్‌కు ఖాళీగా ఉన్న హాస్టల్‌ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది. అందుకే ఇతర శాఖలో పని చేసే వారికి ఇన్‌చార్జి ఇచ్చాం. ఎవరి నుంచి ఎలాంటి ముడుపులు తీసుకోలేదు. కొందరు పనిగట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారు.

- ఛత్రు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్‌నగర్‌


ఇన్‌చార్జి బాధ్యతలు తొలగించినందునే ఆరోపణలు

రెండు నుంచి మూడు హాస్టళ్లకు ఇన్‌చార్జీలుగా ఉన్న వార్డెన్స్‌లో కొందరిని తప్పించడం వల్లే ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. ఏదో ఒత్తిడిలో వారు మీకు చెప్పి ఉంటారు. హాస్టల్‌ వార్డెన్‌లకు, మాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు.

- ఇందిర, బీసీ సంక్షేమ అభివృద్ధిశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌ 

Updated Date - 2022-09-28T05:33:07+05:30 IST