ఆ విగ్రహాలు దండపల్లె ఆలయంలోవే..

ABN , First Publish Date - 2021-10-20T05:23:00+05:30 IST

కౌండిన్యనదీకాలువలో లభ్యమైన దేవతా విగ్రహాల ఆచూకీని పోలీసులు కనిపెట్టేశారు.

ఆ విగ్రహాలు దండపల్లె ఆలయంలోవే..
కౌండిన్యకాలువలో లభ్యమైన దేవతావిగ్రహాలు (ఫైల్‌ఫోటో)

పురాతనమైనవి కావడంతో నిర్వాహకులే నీళ్లలో వదిలేశారని నిర్ధారణ


గంగవరం, అక్టోబరు 19: కౌండిన్యనదీకాలువలో లభ్యమైన దేవతా విగ్రహాల ఆచూకీని పోలీసులు కనిపెట్టేశారు. గంగవరం మండలం మారెడుపల్లె సమీపంలోని కౌండిన్య నదీకాలువలో 7 పురాతన దేవతల రాతి విగ్రహాలు 18వ తేదీ లభ్యమైన విషయం విదితమే. ఈ విగ్రహాలు ఎక్కడైనా చోరీకి గురయ్యాయా లేక గుప్తనిధుల ముఠా పనేనా అనే అనుమానంతో తహసీల్దార్‌ మురళి, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీప గ్రామాల్లోని ఆలయాలన్నింటిలో  తనిఖీలు నిర్వహించి విచారణ చేపట్టారు. కౌండిన్య నదీకాలువలో లభ్యమైన విగ్రహాలు దండపల్లె గ్రామానికి చెందినవని నిర్ధారణ అయింది.  దండపల్లెలోని లక్ష్మీనారాయణస్వామి అలయ నిర్వాహకులు, పూజారులను విచారించారు. సుమారు 12ఏళ్ల క్రితం లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో నూతన దేవతల విగ్రహాలను ఏర్పాటుచేసి పాత విగ్రహాలకు సంప్రోక్షణ చేసి గుడిలో ఓ పక్కన పెట్టేశారన్నారు. అయితే ఈనెల 16వ తేదీన గుడిలో దసరా పూజలు చేస్తూ, ఆలయంలో ఉన్న పాత విగ్రహాల గురించి చర్చించారు. ఈ పాత విగ్రహాలు ఎక్కువరోజులు పెట్టుకోకూడదని, ఎక్కడైనా నీటిప్రవాహంలో వదిలేయాలని సూచించారు. దీంతో అదే గ్రామానికి చెందిన రెడ్డెప్ప ఆచారి అనే వ్యక్తి ఆ పాత విగ్రహాలను తీసుకొచ్చి కౌండిన్య జలపాతంలో పెట్టేసినట్లు అంగీకరించారని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-10-20T05:23:00+05:30 IST