Abn logo
Jun 4 2020 @ 03:11AM

ఆదర్శ నేత రావి నారాయణరెడ్డి

60 ఏళ్లకు రాజకీయాల నుంచి బయటికి.. 

నేడు రావి నారాయణ రెడ్డి 112వ జయంతి

భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పెత్తందారీ వ్యవస్థను పెకిలించేందుకు పిడికిలి 

బిగించిన దీశాలి. నమ్మిన సిద్ధాంతాన్ని తుదిశ్వాస వరకూ ఆచరించిన 

మహనీయుడు, పద్మవిభూషణ్‌ అవార్డుగ్రహీత రావి నారాయణరెడ్డి. 

నేడు 112వ జయంతి సందర్భంగా ఆయన సేవల్ని స్మరించుకుందాం.!


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రావి నారాయణరెడ్డి 1908, జూన్‌ 4న భువనగిరి తాలూకా బొల్లేపల్లిలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌ మిడిల్‌ స్కూల్లో ఫస్ట్‌ఫారం, అక్కడ నుంచి ఎస్‌.ఎల్‌సీ (పదోతరగతి) వరకు చాదర్‌ఘాట్‌ హైస్కూల్లో చదివారు. నిజాం కాలేజీలో ఇంటర్‌ చదివారు. 1940వ దశకంలో హైదరాబాద్‌కి ప్లేగు, కలరా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలిన సమయంలో పద్మజానాయుడు నాయకత్వంలోని ప్లేగు నివారణ కమిటీ ద్వారా పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. భారత జాతీయోధ్యమ స్ఫూర్తితో 1930లో కాకినాడ వెళ్లి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీజీ పిలుపు మేరకు సొంతూరిలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. రాష్ట్రంలో ఖద్దరు ధరించిన తొలి యువకుడు. 1967లో తన 60వ ఏట స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి వైదొలిగారు.  


తొలి తెలుగు సత్యాగ్రాహి.. 

భాగ్యనగర వేదికగా 1933లో ఏర్పడిన హరిజనసేవా సంఘానికి కార్యదర్శిగా ఎంపికయ్యారు. అస్పృశ్యత నివారణ కోసం సహపంక్తి భోజనాలు పెట్టారు. బడుగుజీవుల విద్యావికాసం కోసం వంద పాఠశాలలు, రెండు హాస్టళ్లు నెలకొల్పారు. అస్పృశ్యతా నివారణోద్యమ ప్రచారంలో భాగంగా 1934లో గాంధీజీని నగరానికి ఆహ్వానించారు. ఆయన వచ్చిన సందర్భంలో నారాయణరెడ్డి భార్య సీతాదేవి ఒంటిపై నగలన్నీ అమ్మగా వచ్చిన సొమ్ముని ‘‘స్వరాజ్య నిధికి’’ విరాళంగా ఇచ్చారు.


మూడుసార్లు ‘ఆంధ్ర మహాసభ’ అధ్యక్షుడిగా కొలువుదీరారు. 1938లో కాంగ్రె్‌సపై నిజాం ప్రభుత్వం నిషేధం ఎత్తివేయాలని సత్యాగ్రహం చేపట్టిన ఐదుగురు కార్యనిర్వాహక సభ్యుల్లో ఒకే ఒక్క తెలుగు వ్యక్తి నారాయణరెడ్డి. తర్వాత కాలంలో సోషలిస్టు రష్యా ప్రగతికి ముగ్ధుడై, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడయ్యాడు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారు.  


500ఎకరాలు పంపిణీ.. 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా తనకున్న 700ఎకరాల్లో 500ఎకరాలను పేదలకు పంచారు. 1952 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ స్థానానికి పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా పోటీచేసి దేశంలోనే అత్యధిక మెజారిటీ పొందిన నేతగా చరిత్రలో నిలిచారు. తొలి పార్లమెంట్‌లో ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా సత్కారం పొందారు. నల్లగొండకు ‘నందికొండ ప్రాజెక్టు’, ‘నడికుడి రైల్వే జంక్షన్‌’ తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. 1957 ఎన్నికల్లో భువనగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ప్రతిపక్ష నాయకుడిగానూ వ్యవహరించారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నా నిరాడంబర జీవితాన్ని గడిపారు.


అసెంబ్లీకి రోజూ రిక్షాలో వెళ్లేవారు. ఈయన ఖ్యాతిని గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. అంతకముందు ఏడాదే ఆయన కన్నుమూశారు. నారాయణరెడ్డి పేరుతో జూబ్లీహిల్స్‌లో ఆడిటోరియం నెలకొల్పారు. తెలంగాణలో సాంస్కృతికోద్యమాన్ని రాజకీయోధ్యమంగా మలచిన సమరయోధుడు నారాయణరెడ్డి సేవలు ఈ నేలపై అజరామరం. భావితరాలకు ఆదర్శనీయం. 


వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశా...

రావి నారాయణరెడ్డి వద్ద చాలాకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాను. ఆయన రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజా పద్దుల కమిటీకి చైౖర్మన్‌గా ఉన్నా నిరాడంబరంగా జీవించారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆయనతోపాటు నేను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి రిక్షాలో వెళ్లేవాళ్లం.  

కందిమళ్ల ప్రతాపరెడ్డి, కన్వీనర్‌, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల కమిటీ