ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఎత్తివేసే ఆలోచన..

ABN , First Publish Date - 2022-08-06T04:25:14+05:30 IST

కాగజ్‌నగర్‌లో ముప్పై ఏళ్ల నుంచి సర్‌సిల్క్‌, ఎస్పీఎం మిల్లు కార్మికులకు ఎంతో కీలక వైద్యసేవలు అందించిన ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఎత్తివేసే దిశగా ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2014లో ఎస్పీఎం మూత బడిన తర్వాత ఈఎస్‌ఐలో వైద్యసేవలు నిలిపివేశారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో కార్మికులకు వైద్యసేవలు అందిం చలేదు.

ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఎత్తివేసే ఆలోచన..
కాగజ్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రి

-ఇన్‌పేషంట్లు లేకపోవడమే కారణం

-డిస్పెన్సరీపైనే ఆధారం 

-తరలిస్తే ఊరుకునేది లేదంటున్న కార్మికులు

-బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండు

కాగజ్‌నగర్‌, ఆగస్టు 5: కాగజ్‌నగర్‌లో ముప్పై ఏళ్ల నుంచి సర్‌సిల్క్‌, ఎస్పీఎం మిల్లు కార్మికులకు ఎంతో కీలక వైద్యసేవలు అందించిన ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఎత్తివేసే దిశగా ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2014లో ఎస్పీఎం మూత బడిన తర్వాత ఈఎస్‌ఐలో వైద్యసేవలు నిలిపివేశారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో కార్మికులకు వైద్యసేవలు అందిం చలేదు. ఇన్‌పెషెంట్లను తీసుకోలేకపోయారు. అతి పెద్ద ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ ఇన్‌పెషంట్లు తగిన స్థాయిలో లేకపోవటంతో ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడనున్నట్టు తెలిసింది. జిల్లాలోనే అతిపెద్ద ఆస్పత్రిగా పేరొందినప్పటికీ ఇక కనుమరుగు కానుంది. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా క్వార్టర్లు ఇచ్చారు. అవి కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం, రోగులు సంఖ్య తగ్గడం, ఇండెంట్‌ తగ్గడం తదితర కారణాలతో ఈఆస్పత్రిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం సూపరింటెండెంట్‌తో పాటు డాక్టర్లు, సిబ్బంది కలుపుకొని డెబైకిపైగా మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇన్‌ పేషంట్లు, ఔట్‌పెషంట్ల సంఖ్య పూర్తిగా తగ్గుతోంది. ఇందులో పని చేసే వైద్యులు కూడా వివిధ ఆస్పత్రిల్లో ఇన్‌చార్జీలుగా ఉండడం, కొంతమంది విధుల్లోకి రాకపోవడం తదితర కారణాలతో ఎత్తివేతకు కారణమైందని కార్మికులు పేర్కొంటున్నారు. ఎస్పీఎంతో పాటు వివిధ హోటళ్లు, ఇతర కార్యాలయాలకు సంబంధించిన కార్మికులందరికీ అఎస్‌ఐలోనే వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏడువేలకుపైగా కార్డులున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడంపై అంతా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా నిత్యం వైద్యసేవలు అందించాల్సిన వైద్యులు కూడా వైద్యం సరిగా చేయడం లేదన్నది నిర్వివాదాంశం. కాగా ఈ విషయంపై పట్టణంలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా చర్చ జరుగుతోంది. ఈఎస్‌ఐ ఆస్పత్రి తరలిపోతే ఊరుకునేది లేదని, అడపాదడపా ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఎందుకు చేయడం లేదని కార్మికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో మిషనరీలు చెడిపోయినప్పటికీ కూడా మరమ్మతులకు నిధులు ఎందుకు విడుదల చేయడంలేదు..? క్వార్టర్లు నివాస యోగ్యంగాలేకున్నా పూర్తి స్థాయిలో ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదన్న అంశాలపై కార్మికులు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పంతా అధికారులదే పెట్టుకొని ఉన్నఫలంగా ఎత్తివేసే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని కార్మికులు పేర్కొంటున్నారు.

తరలించే నిర్ణయాన్ని మానుకోవాలి

-ఈర్ల విశ్వేశ్వర్‌రావు, ట్రేడ్‌యూనియన్‌ నాయకుడు

ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలించడం సరికాదు. ఎవరి తప్పుంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఇన్‌, ఔట్‌ పేషంట్లు లేరనే సాకుతో ఆస్పత్రిని ఎత్తివేసే ఆలోచన మానుకోవాలి. ఎత్తివేయాలనుకుంటే  కార్మికుల తరుపున ఆందోళన చేస్తాం. త్వరలో భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తాం. 

బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి..

-బోగే ఉపేందర్‌, ఏఐటీయూసీ నాయకుడు 

ఈఎస్‌ఐ ఆస్పత్రి విషయంలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎస్పీఎం కార్మికులతో పాటు పట్టణంలోని హోటళ్లలో పనిచేసే కార్మికులకు, ఇతర చిన్న కుటీర పరిశ్రమల కార్మికులకు ఇందులో వైద్యం పొందే సౌకర్యం ఉంది. ఇన్‌పేషంట్లు, ఔట్‌ పేషంట్లు సంఖ్య తగ్గి పోవడం ఎవరి తప్పు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో నివేదికలు రూపొందించి బాధ్యులపై చర్యలు చేపట్టాలి. 

Updated Date - 2022-08-06T04:25:14+05:30 IST