కరోనాతో ఆగిన వేట...

ABN , First Publish Date - 2020-03-31T10:52:52+05:30 IST

జిల్లాలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉన్నది. గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం కావడంతో ఈ

కరోనాతో ఆగిన వేట...

 15 రోజులు ముందుగానే నిలిపివేత

 స్వస్థలాలకు వెళ్లిపోయిన బోట్లు

 ఉపాధి కోల్పోయిన వేలాది మంది

 రోజుకు రూ.5 కోట్ల వ్యాపారానికి బ్రేక్‌


 కరోనా ప్రభావం సముద్రపు వేటపై పడింది. విరామ సమయం ఇంకా 15 రోజులు ఉండగానే ఎక్కడ బోట్లు అక్కడ నిలిచిపోయాయి. కొన్ని బోట్లు స్వస్థలాలకు వెళ్లిపోయాయి. దీంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఆక్వా లారీలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ కారణంగా ప్రత్యక్షంగా  పరోక్షంగా వేలాది మంది ఉపాధి కోల్పోయారు. కొన్ని ఐస్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 


నరసాపురం, మార్చి 30: జిల్లాలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉన్నది. గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం కావడంతో ఈ ప్రాంతంలో అపార మత్స్య సంపద లభ్యమవుతుంది. విదేశ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న కోనా, పండుగొప్ప, రొయ్య, సొర, సందువాయి వంటి మత్స్య సంపద ఈప్రాంతంలో పుష్కలంగా లభిస్తుంది. ఈకారణంగా స్థానిక మత్స్యకారులతో పాటు కాకినాడ, నెల్లూరు, చీరాల, నిజాంపట్నం, కళింగపట్నం తదితర ప్రాంతాల నుంచి సీజన్‌లో ఇక్కడికి వేటాడేందుకు వస్తుంటారు.


రోజుకు రూ.5 నుంచి రూ.10 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ దొరికిన మత్స్య సంపద విశాఖ, చెన్నై, కేరళ, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. ఈప్రాంతంలో ఎగుమతి కేంద్రాలు ఎక్కువే. వీటికి అనుబంధంగా ఐస్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక మత్స్య సంపదను ఎగు మతి చేసేందుకు నిత్యం వందలాది లారీలు ఇక్కడికి వస్తుంటాయి. ఈకారణంగా సీజన్‌ అన్ని రోజులు పట్టణంలోని గోదావరి బండ్‌పై కోట్లాది వ్యాపారం జరుగుతుంది. వేలాది మంది ఉపాధి పొందుతారు.


ముందుగానే వేటకు విరామం..

సాధారణంగా సముద్రపు వేటకు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు దేశ వ్యాప్తంగా విరామం అమలు చేస్తుంటారు. ఈసారి కరోనా ఎఫెక్ట్‌తో 20 రోజులు ముందుగానే బ్రేక్‌ పడింది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ చాలా బోట్లు సముద్రపు వేటకు వెళ్లాయి. అయితే ఎగుమతిదారులు ఎవ్వరూ సరుకును కొనకపోవడంతో ముందుగా వేటకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. వచ్చే నెల 14 వరకు లాక్‌డౌన్‌ ఉంది. ఆపై ప్రభుత్వం 15 నుంచి నిషేధాన్ని అమలు చేస్తుంది. దీంతో వచ్చిన బోట్లన్ని తిరుగుముఖం పట్టాయి. 


 మత్స్య సంపద ఎగుమతికి మార్గం లేదు:  పీతల ప్రసాద్‌, బోటు యజమాని, నరసాపురం

ఈఏడాది ముందుగా వేటకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు చేయడం కష్టంగా మారింది. విదేశాలకు ఎగుమతులు లేకపోవడంతో ఇటు కంపెనీలు కూడా సరుకుల్ని కొనడం లేదు. ఒకవేళ సరుకు తెచ్చినా.. అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తున్నది. దీని వల్ల పెట్టుబడులు కూడా రావడం లేదు. ఈకారణంగా చాలా మంది వేటకు ముందస్తు విరామం ప్రకటించి తిరుగుముఖం పట్టారు.  

Updated Date - 2020-03-31T10:52:52+05:30 IST