వందేళ్ల డీసీసీబీ భవనం కూల్చివేతకు సిద్ధం

ABN , First Publish Date - 2020-10-01T09:32:49+05:30 IST

చారిత్రక సంపదకు నిలయమైన ఓరుగల్లులో కొత్త భవనాలకు అడ్డుగా ఉన్నాయనే సాకుతో అపూర్వ కట్టడాలను ఒక్కొక్కటిగా

వందేళ్ల డీసీసీబీ భవనం కూల్చివేతకు సిద్ధం

కార్పొరేషన్‌ అనుమతి కోసం నిరీక్షణ


హన్మకొండ టౌన్‌, సెప్టెంబరు 30: చారిత్రక సంపదకు నిలయమైన ఓరుగల్లులో  కొత్త భవనాలకు అడ్డుగా ఉన్నాయనే సాకుతో అపూర్వ కట్టడాలను ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తున్నారు. వందేళ్లు దాటిన కట్టడాలను చారిత్రక సంపదగా గుర్తించి పరిరక్షించాలని నిబంధనలు చెబుతుంటే వరంగల్‌లో అందుకు భిన్నంగా కూల్చివేస్తున్నారు. హన్మకొండలోని వందేళ్ల నాటి  హెరిటేజ్‌ భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో అర్బన్‌ కలెక్టరేట్‌ నూతన భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరో భవనాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. నిజాం కాలంలో (18 శతాబ్దం) పాలకులు హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో ఖజానా నిల్వ కోసం భవనాన్ని నిర్మించారు. నిజాం పాలకులు ఈ ప్రాంతంలో వసూలు చేసిన సొమ్మును ఇక్కడ నిల్వ చేసేవారని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ భవన నిర్మాణంలో పలు ప్రత్యేకతలు కనిపిస్తుంటాయి. పెద్ద మిషన్లతో కూల్చినా పడిపోనంత పటిష్టంగా దీనిని నిర్మించారు. ఇప్పటికీ చెక్కుచెదరని గోడలు, కలప కనిపిస్తుంది. చిన్నచిన్న మరమ్మతులు చేస్తే మరో వందేళ్లపాటు నిలిచి ఉంటుంది. కాగా కాలక్రమేణా నిజాం ప్రభుత్వ హయాంలోనే 1917 ఆగస్టు 4న ఈ భవనాన్ని డీసీసీబీకి కేటాయించారు.


నాటి నుంచి 104ఏళ్లుగా ఈ భనవంలో వరంగల్‌ జిల్లా సహకార వ్యవస్థ కొనసాగుతుంది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన భవనాన్ని నూతన పాలకవర్గం కూల్చివేసేందుకు నిర్ణయించింది. పదేళ్ల క్రితం ఈ భవనాన్ని మినహాయించి అదనంగా నూతన భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నారు. మరో వాణిజ్య సముదాయం కూడా నిర్మించినప్పటికీ పలు ఆరోపణలతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రెండు నూతన భవనాలకు పాత భవనం అడ్డుగా ఉందనే కారణంతో కొత్త పాలకవర్గం దీనిని కూల్చివేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.


పాత భవనం కూల్చివేసేందుకు కార్పొరేషన్‌ అనుమతి కోసం ఇటీవల దరఖాస్తు చేశారు. అనుమతి రాగానే టెండర్‌ పిలిచి నేలమట్టం చేసేందుకు డీసీసీబీ పాలకవర్గం, అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందేళ్ల నాటి భవనాన్ని నేలమట్టం చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సీఈవో ఉషశ్రీని వివరణ కోరగా.. పాత భవనాన్ని కూల్చివేసేందుకు కార్పొరేషన్‌ అనుమతి కోరామని, అనుమతి వచ్చాక పాలకవర్గంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2020-10-01T09:32:49+05:30 IST