నత్తనడకన జగనన్న ఇళ్లు

ABN , First Publish Date - 2022-07-02T09:01:29+05:30 IST

నత్తనడకన జగనన్న ఇళ్లు

నత్తనడకన జగనన్న ఇళ్లు

ముందుకు సాగని నిర్మాణ పనులు 

రెండేళ్లలో పూర్తయినవి 5 శాతమే 

పునాదుల్లోనే 10 లక్షలకు పైగా ఇళ్లు

గోడల వరకు పూర్తయినవి 58,520 

ఇంకా ప్రారంభం కానివి 3 లక్షలపైనే 

ముంపు ప్రాంతాల్లో చాలా లే అవుట్లు 

భారీగా పెరిగిన సామగ్రి ధరలు

నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్ధిదారులు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పింది. ఈ పథకం ప్రారంభించి రెండేళ్లు గడిచినా.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు దరిదాపులకు కూడా చేరలేదు. 2020లో తొలివిడతగా 15,60,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి.. 2021లోగా రెండో విడతలో మరో 15.6 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. తొలివిడతలో అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు కేవలం 60,783 ఇళ్లు (5 శాతం) పూర్తయ్యాయి. పునాది స్థాయి లోపు 8,18,857, పునాది స్థాయిలో 2,10,646 ఇళ్లు ఉన్నాయి. అంటే ఈ రెండు కేటగిరీలు కలిపి 10,29,503 ఇళ్లు ఇంకా పునాదుల్లోనే ఉన్నాయి. మరో 58,520 ఇళ్లు గోడల వరకు (రూఫ్‌ లెవెల్‌) పూర్తయ్యాయి. ఇంకా 3,05,863 ఇళ్ల నిర్మాణం ప్రారంభమే కాలేదు. వీటితో పాటు ప్రస్తుతం పునాది స్థాయిలో ఉన్నవి, రూఫ్‌ లెవెల్‌ వరకు పూర్తయి పురోగతిలో ఉన్న వాటితో కలిపి మొత్తం 95 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు అధికారుల నుంచి మౌనమే సమాధానమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల లే అవుట్లు ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే అవి చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లు నిర్మించుకునేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. పైగా తొలుత ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం తర్వాత మాట మార్చింది. లబ్ధిదారులే సొంతంగా కట్టుకోవాలని లేదంటే కాంట్రాకర్లకు అప్పగిస్తే వారే కట్టిస్తారంటూ రోజుకో ప్రకటన చేస్తుండటంతో లబ్ధిదారుల్లో గందరగోళం ఏర్పడింది.  


పెరిగిన నిర్మాణ వ్యయం

ఇటీవల కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిపోయాయి. సిమెంటులో కొంత భాగం గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తున్నప్పటికీ, మిగిలిన నిర్మాణ వస్తువుల కొనుగోలు లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని పెంచింది. ముఖ్యంగా స్టీలు ధర టన్ను రూ.80 వేలు దాటింది. ఇతర సామగ్రి ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో  ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.80 లక్షలు దేనికీ సరిపోవడం లేదని లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ నిర్మాణ సామగ్రి ఇస్తున్నా, లబ్ధిదారులు వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణం ఆశించినంతగా ముందుకు సాగడం లేదు. 


జిల్లాల్లో ఇదీ పరిస్థితి 

అనకాపల్లి జిల్లాలో తొలివిడతలో 50,354 మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది లక్ష్యం. వాటిలో ఇప్పటి వరకు 409 ఇళ్లు మాత్రమే  పూర్తయ్యాయి. 12,874 ఇళ్లు ఇంతవరకు ప్రారంభమే కాలేదు. 27,312 ఇళ్లు పునాది స్థాయి లోపు, 5,988 ఇళ్లు పునాది స్థాయిలో ఉండిపోయాయి. మరో 1,490 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌, 2,281 ఇళ్లు శ్లాబ్‌ లెవెల్‌లో ఉన్నాయి. అంటే ఈ జిల్లాలో ఇళ్ల నిర్మాణం ఒక్క శాతం మాత్రమే పూర్తయింది. కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాల్లో 2 శాతం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 3 శాతం, ప్రకాశంలో 4 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 5 శాతం, బాపట్లలో 6 శాతం, విజయనగరం, కాకినాడ జిల్లాల్లో 7 శాతం, కోనసీమ జిల్లాలో 8 శాతం, తూర్పుగోదావరిలో 10 శాతం, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో 11 శాతం చొప్పున ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 

Updated Date - 2022-07-02T09:01:29+05:30 IST