క్లాప్‌..అట్టర్‌ ప్లాప్‌!

ABN , First Publish Date - 2022-01-08T04:39:40+05:30 IST

జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకం నీరుగారింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) మిషన్‌లో భాగంగా చేపట్టిన వంద రోజుల పారిశుధ్య కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. అధికారులు మాత్రం అంతా సవ్యంగా జరుగుతున్నట్టు నివేదికలు తయారుచేసి చేతులు దులుపుకుంటున్నారు. పనులు చేపడుతున్నట్టు పంచాయతీ కార్యదర్శులు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

క్లాప్‌..అట్టర్‌ ప్లాప్‌!
రామభద్రపురం మండలంలో పారిశుధ్య పనులు చేస్తున్న దృశ్యం


నీరుగారిన ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’

కానరాని 100 రోజుల కార్యక్రమాలు

పారిశుధ్య పనులు అంతంతే..

ఇంటింటి చెత్తసేకరణ ఊసేలేదు

అంతా సవ్యంగా జరుగుతున్నట్టు చూపుతున్న అధికారులు

(నెల్లిమర్ల)

జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకం నీరుగారింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) మిషన్‌లో భాగంగా చేపట్టిన వంద రోజుల పారిశుధ్య కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. అధికారులు మాత్రం అంతా సవ్యంగా జరుగుతున్నట్టు నివేదికలు తయారుచేసి చేతులు దులుపుకుంటున్నారు. పనులు చేపడుతున్నట్టు పంచాయతీ కార్యదర్శులు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం క్షీణిస్తోంది. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పారిశుధ్య పనులకు పనిముట్లు, పరికరాలు, చెత్తను వేరు చేసేందుకు డస్ట్‌ బిన్‌లు, తరలించేందుకు వాహనాలు లేకుండా పనులు ఎలా చేస్తున్నారో అధికారులకే ఎరుక. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా తూతూమంత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్వఛ్ఛాంధ్ర మిషన్‌ను.. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా పేరు మార్చింది. తొలుత 2020లో మనం- మన పరిశుభ్రత పేరిట కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమం చేపట్టాలని భావించింది. పారిశుధ్య సేకరణకుగాను ఇంటికి రూ.2 వంతున వసూలు చేయాలని నిర్ణయించింది. కార్యక్రమానికి ప్రజల నుంచి ఆదరణ కరువైంది. 2021లో మనం- మన పరిశుభ్రత రెండో విడత కార్యక్రమాన్ని ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’గా నామకరణం చేసింది. 100 రోజుల ప్రణాళికను ప్రకటించింది. కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, సమావేశాలు తప్ప ఎక్కడా పారిశుధ్య పనులు, చెత్త సేకరణ కానరావడం లేదు. జిల్లాలో 920 పంచాయతీల పరిధిలో 1582 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. జిల్లా వ్యాప్తంగా 23.44 లక్షల జనాభా ఉన్నారు. 1000 మంది జనాభాకు ఒక క్లాప్‌ మిత్రను నియమించారు. వీరు ఉదయం 7 గంటల్లోగా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలి.  దీనిని ఉదయం 11 గంటలకు చెత్త సంపద తయారీ కేంద్రానికి తీసుకెళ్లాలి. రోజుకు సగటున ప్రతి క్లాప్‌ మిత్ర 40 నుంచి 50 కిలోల చెత్తను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఇప్పటికీ క్లాప్‌ మిత్రలకు మూడు చక్రాల చెత్త సేకరణ సైకిళ్లు, పరికరాలు, పనిముట్లు అందించలేదు. దీంతో ఎక్కడా చెత్త సేకరించిన దాఖలాలు లేవు. కానీ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న పంచాయతీ కార్యదర్శులు మాత్రం అంతా సవ్యంగా జరుగుతున్నట్టు నివేదికలు ఇస్తున్నారు. ఫొటోలతో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. 

 సర్పంచ్‌లకు అవగాహనేదీ?

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు కూడా ‘క్లాప్‌’పై అవగాహన లేకుండా పోయింది. కనీసం వారికి భాగస్వామ్యం కల్పించడంలో సైతం అధికారులు విఫలమయ్యారు. నెల్లిమర్ల మండలంలో దాదాపు అన్ని పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉంది. పారిశుధ్య పనులకు సంబంధించి నిత్యం ఫొటోలు, చెత్త సేకరణ వివరాలు అప్‌లోడ్‌ చేయాలి. కానీ మండలంలో చాలావరకూ పనులు చేయకుండానే చేసినట్టు చూపుతున్నారు. పాత ఫొటోలనే అప్‌లోడ్‌ చేస్తున్నారు. ‘క్లాప్‌’నకు ప్రభుత్వం అందించే నిధులు సైతం పక్కదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పారిశుధ్య పనులకుగాను మూడు చక్రాల చెత్త సేకరణ సైకిళ్లు, పరికరాలు, పనిముట్లు మంజూరుచేసింది. మునిసిపాల్టీలకు ఎలక్ర్టిక్టల్‌ చెత్తసేకరణ ఆటోలు, మినీ జేసీబీలను కేటాయించింది. ఇవన్నీ జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో వాటి పంపిణీ జరగలేదు. తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చాలా రోజుల వరకూ అందించకపోవడంతో అవి మూలకు చేరాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. స్వచ్ఛాంధ్ర మిషన్‌ పేరును కాస్త క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చినా సేవలు మాత్రం మెరుగుపడలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. 



Updated Date - 2022-01-08T04:39:40+05:30 IST