Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆస్పత్రిని అడ్డగోలుగా మార్చేశారు

twitter-iconwatsapp-iconfb-icon
ఆస్పత్రిని అడ్డగోలుగా మార్చేశారుమారికవలసలో నిర్మించిన వైఎస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

పిఠాపురం కాలనీకి మంజూరైన హెల్త్‌ క్లినిక్‌ మారికవలస తరలింపు

భవనం కూడా నిర్మాణం

గతనెల 29న ప్రారంభోత్సవానికి సన్నాహాలు  

కార్పొరేటర్‌ అభ్యంతరంతో వెనక్కి తగ్గిన అధికారులు

ఇక్కడ స్థలం అందుబాటులో లేదంటూ బుకాయింపు

 

అధికార పార్టీ ప్రాపకానికి యంత్రాంగం తెగ ఆరాటపడుతోంది. స్వామి భక్తి చాటుకునేందుకు ఉత్తర్వులను, నిబంధనలను తోసిరాజని నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారనే కారణంతో ఓ అర్బన్‌ పీహెచ్‌సీని అడ్డగోలుగా 15 కిలోమీటర్ల దూరం తరలించేసింది. భవనం  కూడా నిర్మించేసి మంత్రితో ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేసినా...రాద్ధాంతం జరిగేలా వుందనే భయంతో తాత్కాలికంగా కార్యక్రమాన్ని వాయిదా వేసింది. వివరాలిలా ఉన్నాయి. 

మద్దిలపాలెం, ఆగస్టు 10: 

పట్టణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించేందుకు వీలుగా జీవీఎంసీ పరిధిలో కొత్తగా 42 యూపీహెచ్‌సీల నిర్మాణానికి నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా 30 వేల జనాభా కలిగిన 22వ వార్డుకు హెల్త్‌క్లినిక్‌ మంజూరయింది. దీనిని పిఠాపురం కాలనీలో నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు పిలిచి, ఖరారు చేశారు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో...22వ వార్డులో స్థలం లేదనే కారణాన్ని చూపించి, ఇక్కడకు 15 కిలోమీటర్ల దూరంలో వున్న మారికవలసలో యూపీహెచ్‌సీకి భవనాన్ని నిర్మించేశారు. ఈ యూపీహెచ్‌సీ కోసం 2021 జూన్‌లో ఒక వైద్యుడు, ఏఎన్‌ఎంలు, సిబ్బందిని కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించారు. అయితే రికార్డుల్లో పిఠాపురం కాలనీ యూపీహెచ్‌సీగా వున్నందున మారికవలసలోని ఆస్పత్రిలో ఎలా వైద్య సేవలందించాలనే విషయమై వైద్య శాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు. పిఠాపురం కాలనీ పేరుతో రిక్రూట్‌ చేసిన సిబ్బందిని మారికవలస పంపించే అవకాశం లేకపోవడంతో వారిని చినవాల్తేరు, రేసపువానిపాలెం యూపీహెచ్‌సీల్లో నియమించారు. కాగా పిఠాపురం కాలనీలో వైద్య సేవలందించకపోయినా వైద్య ఆరోగ్య శాఖ డాష్‌బోర్డులో మాత్రం సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు నమోదు చేయడం గమనార్హం. 


సాధారణ ఎన్నికల్లో నగరంలోని తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. జీవీఎంసీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలోని 22వ వార్డులో జనసేన పార్టీ గెలిచింది. అందుకే ఆస్పత్రి నిర్మాణానికి పిఠాపురం కాలనీలో స్థలం లేదని సాకుతో మారికవలసకు తరలించేశారంటున్నారు. వాస్తవానికి 22వ వార్డు పరిధిలోని శివానందపురంలో జీవీఎంసీకి చెందిన 400 గజాల స్థలం ఉంది. ఇటీవల ఆ స్థలాన్ని శుభ్రం చేసి, ప్రహరీ కూడా నిర్మించారు. యూపీహెచ్‌సీ నిర్మాణానికి ఇది అనువుగా వుంటుందని అంతా భావించారు. కానీ అధికారులకు ఆస్థలం కనిపించకపోవడం విశేషం.  మారికవలసలో ఆస్పత్రిని గత నెల 29నవైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజినితో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే 22వ వార్డు పిఠాపురం కాలనీలో ఏర్పాటు చేయాల్సిన ఆ ఆస్పత్రిని మారికవలసలో నిర్మించడంపై స్థానిక కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులను నిలదీశారు. ఈ విషయంలో ఏ స్థాయి రాద్ధాంతం జరుగుతుందోననే భయంతో అధికారులు ప్రారంభోత్సవాన్ని రద్దు చేశారు.


స్థలం లేకపోవడంతో...

పిఠాపురం కాలనీ ఆస్పత్రిని మారికవలస తరలించడంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డిస్ర్టిక్‌ ప్రాజెక్ట్‌ మోనటరింగ్‌ అధికారి (డీపీఎంవో) రామిరెడ్డి వద్ద ప్రస్తావించగా అక్కడ స్థలం లేనందున మారికవలసలో నిర్మించామని సమర్థించుకున్నారు. 


రాజకీయ కక్షతోనే...

జనాభాలో 22వ వార్డు చాలా పెద్దది. ఇక్కడ ఆస్పత్రి అవసరం ఉంది. కేవలం రాజకీయ కక్షతోనే పిఠాపురం కాలనీకి మంజూరైన యూపీహెచ్‌సీని నిబంధనలకు విరుద్ధంగా మారికవలస తరలించారు. ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటుచేసేవరకు పోరాటం చేస్తాను. అవసరమైతే కోర్టుకు వెళ్లి అయినా ప్రభుత్వం మంజూరుచేసిన వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ను  22వ వార్డుకు తీసుకొస్తాను. 

- పీతల మూర్తియాదవ్‌, 22వ వార్డు కార్పొరేటర్‌

 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.