ఆంధ్రాపైనే తెలంగాణ పందెగాళ్ల ఆశలు

ABN , First Publish Date - 2022-01-12T04:36:54+05:30 IST

ఆంధ్రా-తెలంగాణా సరిహద్దుల్లోని పలువురు సంక్రాంతి పండగ మూడ్‌లోకి వచ్చేశారు. ముఖ్యంగా పందెగాళ్లు కోడి పందేల నిర్వహణ, పందేల్లో పాల్గొనేందుకు ఆంధ్రాసరిహద్దుల్లో ఉన్న తెలంగాణా ప్రాంత పందెగాళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఆంధ్రాపైనే తెలంగాణ పందెగాళ్ల ఆశలు

 కరోనా వ్యాప్తిపై ఆందోళన....

అనుమతులపై అనుమానాలు


ఖమ్మం/సత్తుపల్లి: ఆంధ్రా-తెలంగాణా సరిహద్దుల్లోని పలువురు సంక్రాంతి పండగ మూడ్‌లోకి వచ్చేశారు. ముఖ్యంగా పందెగాళ్లు కోడి పందేల నిర్వహణ, పందేల్లో పాల్గొనేందుకు ఆంధ్రాసరిహద్దుల్లో ఉన్న తెలంగాణా ప్రాంత పందెగాళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కోడి పందేలను తెలంగాణాలో పోలీసులు నిషేధించి, ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పొరుగు రాష్ర్టాల్లో  పందేలు వేసేందుకు ఎంత దూరం వెళ్ళటానికి అయినా, ఎన్ని లక్షల రూపాయల పందెం కోసం అయినా సిద్ధంగా ఉంటారు. ప్రస్తుత సీజన్‌లో  పందెగాళ్లలో పందాలు జరుగుతాయా లేదా జరిగితే ఎక్కడ జరుగుతాయి అని ఆరా తీస్తున్నారు. తెలంగాణాలో కోడి పందేలు నిషేధించినా ఇక్కడి వారు, ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజులూ ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగే   పందేలకు  వెళుతున్నారు. కొందరు యానాం కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతున్న క్రమంలో కోడి పందేలకు అక్కడి ప్రభుత్వం ఏ మేరకు అనుమతి ఇస్తుందనే పందెగాళ్లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా ఏపీలోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పందేలు జరుగుతాయని ఈ ప్రాంత పందెగాళ్లు విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే తాము ఏ ప్రాంతానికి తరలి వెళ్లాలనే విషయంపై నిర్ణయానికి కూడా వచ్చేశారు. పందేల కోసం గత ఏడాది కాలంగా తాము పెంచుకుంటున్న పందెం కోళ్లను సిద్ధం చేసుకుంటూ ఉండగా... మరి కొందరు దూర ప్రాంతాలకు సైతం వెళ్లి కోడి పుంజులను కొనుగోలు చేస్తున్నారు.


పందేలు జరుతాయనే ఆశతో....

కొవిడ్‌ నిబంధనలు అమల్లో ఉన్నా ఈ సారి కూడా ఆంధ్రాలో పందేలు జరుగుతాయనే నమ్మకంతో  పందెగాళ్లు మంచి పందెం కోళ్లు కొనుగోళ్లు చేసేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారు. మంచి కోడి పుంజులను కొనుగోలు చేసేందుకు రూ.వేలు, రూ.లక్షలు కూడా వెచ్చిస్తున్నారు. పందెగాళ్లు పుంజులను కొనుగోలు చేసేందుకు రావటంతో గ్రామాల్లో పందెగాళ్ల సందడి మొదలైంది. పందేలు ఎక్కడెక్కడ జరుతాయనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. పందేలు వేయటం, నిర్వహించటంలో ఆంధ్రాలో పెద్ద నాయకుల అండదండలు ఉంటాయని దీని కారణంగా కోడి పందేలు సంక్రాంతి మూడు రోజులైనా నిర్వహిస్తారనే నమ్మకంతో కొందరు కోడి పుంజులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తరుణంలో కరోనా వ్యాప్తి, ఒమైక్రాన్‌ విస్తరిస్తు ఉండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆంధ్రా సరిహద్దుల్లోని తెలంగాణా ప్రాంత మండలాల్లోని పందెగాళ్లు మాత్రం కోడి పందేలు జరుగుతాయనే ధీమాతో ఉన్నారు.

Updated Date - 2022-01-12T04:36:54+05:30 IST