మనుషుల కథల్లో దాగిన సమాజం చరిత్ర

ABN , First Publish Date - 2022-05-23T05:55:52+05:30 IST

వ్యక్తుల జీవితచరిత్రలు లేకుండా సామాజిక చరిత్ర లేదు. సామాజిక చరిత్ర అనేది ఆ సమాజం లోని వ్యక్తులందరి జీవితచరిత్రలు కలిపినదానికన్న ఎక్కువ కావచ్చుగాని, అందులో ఏ ఒక్క మనిషి జీవితచరిత్ర భాగం కాకపోయినా...

మనుషుల కథల్లో దాగిన సమాజం చరిత్ర

వ్యక్తుల జీవితచరిత్రలు లేకుండా సామాజిక చరిత్ర లేదు. సామాజిక చరిత్ర అనేది ఆ సమాజం లోని వ్యక్తులందరి జీవితచరిత్రలు కలిపినదానికన్న ఎక్కువ కావచ్చుగాని, అందులో ఏ ఒక్క మనిషి జీవితచరిత్ర భాగం కాకపోయినా ఆ మేరకు సామాజిక చరిత్రకు కొరత వస్తుంది. సామాజిక చరిత్రలలోని ఆ లోపాలను పూరించడానికి ఇంకా ఇంకా ఎక్కువగా ఆ సమాజం లోని విడివిడి వ్యక్తుల జీవితాలను అన్వేషించడం, పరిశోధించడం, వ్యక్తీకరించడం జరగవలసి ఉంది. ఆ పని ఒక ఎత్తయితే, దాన్ని తిరగేసి, దొరుకుతున్న కొన్ని స్వీయచరిత్రలను ఆధారం చేసుకుని, వాటి విశ్లేషణ ద్వారా ఆ కాలపు సామాజిక చరిత్రను పునర్ని ర్మించే అవకాశం ఉందా అని పరిశోధించడం మరొక ఎత్తు. 


ఈ ఆసక్తికరమైన ప్రశ్నను తీసుకుని, వలసకాలపు ఆంధ్ర సమాజంలో, ముఖ్యంగా పందొమ్మిదో శతాబ్ది రెండో అర్ధభాగం నుంచి ఇరవయో శతాబ్ది మొదటి అర్ధభాగం వరకు వచ్చిన ఆరు స్వీయచరిత్రల సహాయంతో, ఆ స్వీయచరిత్రలలో వ్యక్తమైన వలస కాలపు ఆంధ్ర సమాజాన్ని అధ్యయనం చేయడానికి అపురూప ప్రయత్నం చేశారు వకుళాభరణం రాజగోపాల్‌. ‘‘ఇంతవరకు తెలుగులో రచించిన ఆత్మకథలను ఆంధ్రదేశ సామాజిక చరిత్ర రచనలో ఉపయోగించుకునే ప్రయత్నం అంతగా జరగలేదు. ఆ ఆత్మకథల ఆధారంగా వలసకాలంలో ఆ ప్రాంత సామాజిక చరిత్ర పునర్నిర్మాణానికి నేను ప్రయత్ని స్తున్నాను’’ అన్నారు. ఈ చరిత్ర పునర్నిర్మాణ ప్రయత్నం దాదాపు ఇరవై సంవత్సరాల కింద మాడిసన్‌ (అమెరికా)లోని విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయ ఆసియా భాషా సంస్కృతుల విభాగంలో పి.హెచ్‌.డి కోసం జరిగిన పరిశోధన. ఏ సమాజ చరిత్ర గురించి, ఏ సామాజిక వ్యక్తులు రాసిన స్వీయచరిత్రల గురించి ఈ అధ్యయనం జరిగిందో, ఆ సమాజానికి అది ఇన్నాళ్లకైనా అందుబాటులోకి రావడం ఆహ్వానించ దగిన సందర్భం. ‘స్వీయ చరిత్రలు - వలసకాలపు ఆంధ్ర సమాజం’ అనే ఈ ముఖ్యమైన, అవసరమైన అధ్యయనాన్ని తెలుగు చేసిన దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి, ప్రచురించిన ఎమెస్కో అభినందనీయులు. 


 ‘విషయ పరిచయం’తో పాటు, ‘స్వీయ చరిత్రలు - సైద్ధాంతిక అంశాలు: తెలుగు స్వీయ చరిత్రల అధ్యయన ఆవశ్యకత’, ‘వలస వాద మేధావులు: తొలినాటి రెండు ఆత్మకథల విశ్లేషణ’, ‘తెలుగు లో ఆధునికతా ప్రవేశం: వీరేశలింగం ప్రమేయం’, ‘వలసవాద ఆధునికత అంచులమీద: రెండు ‘‘సాంప్రదాయక’’ ఆత్మకథల విశ్లేషణ’, ‘ఆత్మకథా రచనలో ఆలంకారిక వ్యూహం: సత్యవతి’, ‘ఒక జాతీయవాది ఆత్మకథ’, ‘ఉపసంహారం’ అనే ఏడు అధ్యా యాల ఈ పుస్తకం చరిత్ర విద్యార్థులకూ, సాహిత్య విద్యార్థు లకూ, సాధారణ పాఠకులకూ కూడా ఎన్నో అద్భుతమైన ఆలో చనలను అందిస్తుంది, వలసకాలపు ఆంధ్ర సమాజ పరిణామం గురించి మిరుమిట్లు గొలిపే ప్రతిపాదనలనూ, నిర్థారణలనూ అందిస్తుంది. ఎన్నో ప్రశ్నలు రేపి, తదనంతర పరిశోధనకు అవకాశం ఇస్తుంది. మూడు వందల యాబైకి పైగా అధో జ్ఞాపికలు, దాదాపు రెండు వందల యాబై ఉపయుక్త గ్రంథాలు, పత్రాలతో ప్రామాణికతకు అద్దం పడుతుంది. 


‘‘పంతొమ్మిది, ఇరవయ్యో శతాబ్దాలలో భారతీయ సమాజంలో పెనుమార్పులు వచ్చాయి. సంప్రదాయ సమాజాన్నుండి ఆధునిక సమాజానికి జరిగిన మార్పుగా దీనిని మనం ఒక కోణంలో అర్థం చేసుకోవచ్చు. మరో కోణంలో dynamicగా (చలనశీలంగా) ఉండి స్వీయ చలనం కలిగిన సమాజపు గమనాన్ని, దిశను వలస పాలన దిశలో దారిమళ్లించిన మార్పుగా కూడా అర్థం చేసుకో వచ్చు. ఇన్ని మార్పులు జరిగినా ఆధునికత అనే సంస్థాగత స్వరూపం, మానసికస్థితి భారతీయ సమాజంలో వేళ్లూనుకు న్నాయా అనే ప్రశ్నకు సూటి సమాధానం లేదు’’ అనే అవ గాహన ఈ అధ్యయనానికి ఒక భూమిక.


ఇక్కడ చర్చిస్తున్న కాలం, ఈ స్వీయచరిత్ర రచయితల జీవిత కాలం, ప్రచురణ కాలం సంక్లిష్టమైనది. పాతకూ కొత్తకూ ఘర్షణ మొదలయింది గాని అది మౌలిక స్వభావం సంతరించుకోలేదు. పాతకొత్తల మేలుకలయిక రూపొందాలని కోరికా, రూపొందు తుందనే ఆశా తలెత్తాయిగాని పాతకొత్తల కీడు కలయికకే రంగం సిద్ధమవుతుండింది. పందొమ్మిదో శతాబ్ది ద్వితీయార్థం, ఇరవయో శతాబ్ది ప్రథమార్థం మొత్తంగా భారతదేశానికీ, ప్రత్యేకంగా ఆంధ్ర దేశానికీ కూడా సంచలన భరితమైనది. అప్పటికి వందేళ్లుగా ఈస్టిండియా కంపెనీ ప్రభావం, మిషనరీల విద్యావ్యాప్తి సాగుతు న్నాయి. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఫలితంగా ప్రత్యక్ష బ్రిటిష్‌ పాలన ప్రారంభమైంది. ఆ పాలనను వ్యతిరేకించే ప్రజా ఉద్యమాలు కూడ ఈ కాలంలోనే ప్రారంభమయ్యాయి. అంతకు ముందరి బ్రిటిష్‌ ప్రభావం కొన్ని వర్గాలలో, వర్ణాలలో సమూహం లోని మనిషిని మార్చి సామాజిక వ్యక్తిని రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించగా, నూతన రాజకీయ చైతన్యం ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని పాలకుల కోర్కెలకు భిన్నంగా తీర్చిదిద్దడం ప్రారంభించింది. మొత్తంగా అది ఒక సంధి దశ. 


ఇక్కడ చర్చించిన ఆరు స్వీయ చరిత్రల కథకులూ అటువంటి సంధి దశ ఉత్పత్తులు గనుక వారి జీవితాలూ పాత-కొత్త, సంప్ర దాయం-ఆధునికత, తూర్పు-పడమరల, దేశీయ ఆలోచనలు- వలస భావజాలం మధ్య అంతస్సంబంధాన్ని, పరస్పర చర్య- ప్రతిచర్యలను, ఘర్షణను ప్రతిబింబించాయి. 


వెన్నెలకంటి సుబ్బారావు (1784-1839), ఏనుగుల వీరాస్వా మయ్య (1780-1836), కందుకూరి వీరేశలింగం (1848-1919), ఆదిభట్ట నారాయణదాసు (1864-1945), చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (1870-1950), ఏడిదము సత్యవతి (?-?) అనే ఆరుగురి స్వీయ చరి త్రలు ప్రధానంగానూ, చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867-1945) స్వీయచరిత్ర అదనం గానూ ఈ అధ్యయనంలో ఉపయోగించారు. 


ఈ ఆరు (ఏడు) స్వీయచరిత్రలనూ చర్చించే క్రమంలో, మౌలికాంశమైన సామాజిక చరిత్ర - వ్యక్తి చరిత్ర సంబంధాలతో పాటు, రాజగోపాల్‌ ప్రస్తావనవశాత్తూ మరెన్నో విషయాలు చర్చకు తెచ్చారు. జీవితచరిత్ర లేదా స్వీయచరిత్ర వెలువడడానికి ముందస్తు షరతుగా ఆ సమాజంలో వ్యక్తి రూపొంది ఉండవలసిన అవ సరం, స్వీయ చరిత్రకు ఉండే ఆటంకాలు, స్వీయచరిత్ర రచనా పద్ధతులు, నవలా రచనకూ స్వీయచరిత్ర రచనకూ సామ్యాలు భేదాలు, స్వీయచరిత్రలో అనివార్యమైన కాలక్రమానుగత కథనా త్మకత, ఆత్మకథ ప్రక్రియలో యాత్రా చరిత్ర, చారిత్రక చర్యలు, జ్ఞాపకాలు, నేరాల ఒప్పుకోలు ప్రకటనలు, దృక్కోణ ప్రచారం, ఆదర్శాలవైపు ఆకర్షించడం వంటి వివిధ రూపాలు, స్వీయ చరిత్ర ప్రక్రియకూ ఆధునికతకూ సంబంధం, ఆధునిక వ్యక్తీకరణ, ముద్రణా, విస్తరణా పద్ధతులు వంటి అనేక విషయాల మీద వెలుగు ప్రసరించారు. కొన్ని డజన్ల సైద్ధాంతిక వాదనలనూ, మేధావుల అభిప్రాయాలనూ ఉటంకిస్తూ కొన్ని అంశాల మీద తానే వివరమైన చర్చ చేశారు, కొన్ని అంశాలను ప్రస్తావించి భవిష్యత్‌ చర్చకు వదిలేశారు.  


ఇక తర్వాతి ఆరు అధ్యాయాలూ, మనకు తెలిసిన, మన సామా జిక జీవితంలో ఏదో ఒక రూపంలో వ్యక్తంగానో, అవ్యక్తంగానో భాగమైన మన మేధావుల స్వీయ చరిత్రల వివరణ, వాటి మీద విశ్లేషణ గనుక ఆ అధ్యాయాలు మొదటి అధ్యాయపు క్లిష్టతను దాటి చాల సరళంగా, ఆలోచనాస్ఫోరకంగా సాగిపోతాయి. దాదాపు ప్రతి స్వీయచరిత్ర చర్చలోనూ రాజగోపాల్‌ లేవనెత్తిన అంశాలు, వేసిన ప్రశ్నలు, కనిపెట్టిన జవాబులు, చేసిన నిర్ధారణలు, ప్రతి పాదనలు ఆయా స్వీయచరిత్రకారులకు, వలసపాలన కాలపు ఆంధ్ర సమాజానికి మాత్రమే కాదు, మొత్తంగా చరిత్ర రచనా శాస్త్రానికి సంబంధించిన ఆలో చనలను ప్రేరేపిస్తాయి. 


ఉదాహరణకు ‘‘వీరాస్వామయ్య స్పష్టంగా ఒక హిందూ జాతీయ దృక్పథమనదగినదాన్ని వ్యక్తీకరించాడన్నది నా వాదం. ఇదొక ఆధు నిక దృక్పథం అని నొక్కి చెప్పవలసిన ఆవ శ్యకత ఉంది’’ అనీ, ‘‘వీరాస్వామయ్య వంటి హిందూ మేధావులు పందొమ్మిదో శతాబ్ది ప్రారంభంలో రాసినదానికీ...ఆ శతాబ్దాం తంలో ఆధునిక హిందూ మతం తీసు కున్న స్పష్టమైన రూపానికీ మధ్య స్ఫుట మైన పరిణామక్రమ సంబంధం ఉంది. అనేక దశాబ్దాల తర్వాత వచ్చే పరిణా మాలను ఈ తొలితరం మేధావులు ముందుగానే ఊహించారు’’ అనీ రాజ గోపాల్‌ అన్నమాటలు సువిశాలమైన క్షేత్రపు సుదీర్ఘ చర్చకు అవకాశం ఇస్తాయి. అలాగే ‘‘ఆధునికతను నారాయణదాసు విమర్శించిన తీరు హింద్‌ స్వరాజ్‌లో గాంధీ విమర్శించిన తీరును పోలి ఉంది. అది ఆధునికతను పూర్తిగా తిరస్కరిం చడం. పందొమ్మిదో శతాబ్దిలో భారతదేశానికి వచ్చిన ఆధుని కత భారతీయ సంస్కృతిని ప్రతికూలంగా మూల్యాంకనం చేసిన పేకేజీలో భాగం’’ అనీ, ‘‘తమ జీవితాలు, ఆత్మకథలలో వేంకటశాస్త్రి, నారాయణ దాసులు తీసుకున్న సంప్ర దాయ దృక్పథం సమా జంలోని కొందరు అల్ప సంఖ్యాకుల దృక్పథం మాత్రమే. ప్రధానస్రవంతి జాతీయవాద దృక్పథం సామాజిక పరిణామం, సంస్కరణ పక్షంలో బలంగా ఉంది....అయితే ప్రధానస్రవంతి దృక్పథం కూడా సంఘ సంస్కరణ, సామాజిక పరిణామాల తీవ్రతపై స్పష్టమైన పరిమితులు విధించింది. స్త్రీలు, నిమ్న కులాలు, బలహీన వర్గాల గొంతులకు కళ్లాలు వేసింది’’ అనీ అన్నమాటలు మన సామాజిక చరిత్రలో అట్టడుగున పడి కాన్పించని కోణాల మీద వెలుగు ప్రసరిస్తాయి. 


అలాగే వీరేశలింగం గురించి రాస్తూ గద్యాన్ని భావ ప్రసార సాధనంగా గుర్తించాడనీ, ప్రజాక్షేత్రం అనేది ఒకటి ఉందనీ, అది జోక్యం అవసరమైన రంగమనీ ఆయన గుర్తించాడనీ, నవల లోనూ, స్వీయచరిత్రలోనూ భారతీయ సమాజం మీద ఆయన విమర్శనాత్మకతకు రూపమిచ్చింది వలసవాద అవగాహనలు, మూల్యాంకనాలు అనీ రాజగోపాల్‌ చేసిన సూత్రీకరణలు విలువై నవి, మరింత విస్తారమైన పరిశోధనకూ, సోపపత్తికమైన వాదన లకూ అవకాశం ఇచ్చేవి. ఏడిదము సత్యవతి గురించి రాస్తూ, ‘‘స్పష్టంగా ఇది సంస్కరణవాద, జాతీయవాద ప్రసంగాల పరిమి తులను అధిగమించి ముందుకు వెళ్లిన సంపూర్ణ పరిణామవాద అవగాహన. ...సత్యవతి ఇటువంటి తీవ్ర అవగాహనకు ఎలా వచ్చింది? తన ప్రాపంచిక దృక్పథాన్ని నిర్మించుకోవడానికి ఆంధ్ర దేశంలోని సమాజంలోనూ, సంస్కృతి లోనూ ఆమెకు లభించిన మేధాపరమైన వనరులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం అంత తేలిక కాదు, కాని సమాధానం వెతికే ప్రయత్నం చేయడం మాత్రం ఉపయోగకరమే’’ అని ఒక అత్యవసరమైన విశాల సామాజిక, చారిత్రక పరిశోధనకు ఉన్న భవిష్యదవకాశాలను సూచిస్తారు. 


‘‘వీరాస్వామయ్య పుస్తకంలో అంతర్నిహితమైన సాంస్కృతిక జాతీయవాదం మరుగునపడిపోయి వీరేశలింగం పాశ్చాత్యానుకూల దృక్పథం పందొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలో ముందుకు వచ్చింది. సాంస్కృతిక జాతీయవాదం సంపూర్ణంగా అదృశ్యం కాలేదు. ఇరవయో శతాబ్ది ఆరంభంలో (నారాయణదాసు, వేంకటశాస్త్రిల ద్వారా) ఒక బలహీనమైన పునఃప్రవేశం చేసింది’’ అని రాజ గోపాల్‌ ముగింపులో చెప్పారు. నిజానికి ఆయన ఈ సిద్ధాంతపత్రం రాస్తున్న ఇరవయ్యొకటో శతాబ్ది ఆరంభంలో ఆ ‘‘సాంస్కృతిక జాతీయవాదం’’ మరింత అమానుష, వక్రరూపంలో పునఃప్రవేశానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ నేపథ్యంలో ఈ గత చరిత్రను మరింత నిశితంగా పరిశోధించడం, గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణ ద్వారా నిర్మాణమవుతున్న సామాజిక చరిత్రకు అవకాశం కల్పించడం మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి ఒక అత్యవసరమైన సాధనం.

ఎన్‌ వేణుగోపాల్‌


Updated Date - 2022-05-23T05:55:52+05:30 IST