Abn logo
Aug 23 2021 @ 02:29AM

ఇదీ చరిత్ర..

ఒలింపిక్స్‌ అనగానే విశ్వ క్రీడలని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. కానీ దీంతో పాటే పారాలింపిక్స్‌ కూడా జరుగుతాయనే విషయం గతంలో ఎవరికీ పెద్దగా అవగాహన ఉండేది కాదు. అయితే 2016 రియోలో జరిగిన ఈ గేమ్స్‌లో భారత్‌  అనూహ్యంగా పతకాలు కొల్లగొట్టడంతో అందరి దృష్టీ వీటిపై పడింది. ఈసారి  టోక్యోలో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు అంతా సిద్ధమైంది. ఈనేపథ్యంలో పారాలింపిక్స్‌ కథేంటో తెలుసుకుందాం...


  • పారాలింపిక్స్‌  రేపటి నుంచే


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఒలింపిక్స్‌.. పారాలింపిక్స్‌ రెండింట్లోనూ జరిగే క్రీడలకు తేడా ఏమీ ఉండదు. కానీ పాల్గొనే అథ్లెట్లు మాత్రం విభిన్నం. క్రీడల్లో అపార ప్రతిభ చూపడంతో పాటు అంగవైకల్యం కలిగిన వారే పారా గేమ్స్‌లో పాల్గొంటారు. అయితే ఒలింపిక్స్‌కు శతాబ్దికి పైగా చరిత్ర ఉన్నా పారాలింపిక్స్‌ మాత్రం ఆరు దశాబ్దాల నుంచే జరుగుతున్నాయి. 1960, రోమ్‌లో మొదటిసారిగా ఈ గేమ్స్‌కు అంకురార్పణ జరిగింది. అప్పట్లో 23 దేశాల నుంచి 400మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. అదే ఇప్పు డు 160 దేశాల నుంచి 4,400 మంది తమ అద్భుత విన్యాసాలను చూపేందుకు తరలివస్తున్నారు.


ఎందుకా పేరు?

పారాలింపిక్స్‌ అనే పేరులో ఏదో నిగూడార్థముందనిపించినా అదేమీ లేదు. ఒలింపిక్‌కు సమాంతరం (ప్యారలల్‌)గా జరిగే క్రీడలు కాబట్టి వీటిని పారాలింపిక్స్‌గా వ్యవహరిస్తుంటారు. అలాగే ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన ఎజిటోస్‌ (లాటిన్‌లో.. ‘నేను ముందుకెళ్లగలను’)ను పారా చిహ్నంగా భావిస్తారు. 


ఆరంభం వెనుక..

అసలు పారాలింపిక్స్‌ ఆరంభం వెనుక మరో కథ ఉంది. 1948లో ఇంగ్లండ్‌లోని స్టోక్‌ మండెవిల్లే అనే గ్రామంలో ఓసారి పోటీలు జరిగాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో పాల్గొన్న 16 మంది పురుషులు, మహిళలు వీల్‌చెయిర్స్‌తోనే తమ ప్రతిభను చాటారు. తదనంతరం ఈ క్రీడలనే ఆదర్శంగా తీసుకుని పుట్టుకొచ్చిన  పారాలింపిక్స్‌ నేడు విశ్వవ్యాప్తమై అలరిస్తున్నాయి.


పోటీలు జరిగే విధానం..

పారాలింపిక్స్‌లో మొత్తం 22 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ఈసారి కొత్తగా తైక్వాండో, బ్యాట్మింటన్‌కు కూడా చోటు కల్పించారు. ప్రధానంగా అథ్లెట్లను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. శారీరక వైక్యలం, అంధత్వం, బుద్ధి మాంద్యం కలిగిన వారు ఇందులో ఉంటారు. కొన్ని క్రీడల్లో మూడు విభాగాల వారు తలపడేందుకూ అవకాశం ఉంటుంది. కొన్నింట్లో మాత్రం వైకల్య శాతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. మరోవైపు చూపులేని రేసర్లు పోటీ సమయంలో సహాయకులను పెట్టుకోవచ్చు. స్విమ్మింగ్‌లో అయితే సూచనల కోసం టర్న్‌ అయ్యేటప్పుడు, పోటీ ముగిశాక వారి తలలపై సహాయకులు టచ్‌ చేస్తుంటారు. 


కరోనా భయపెడుతున్నా... 

ఒలింపిక్స్‌ మాదిరే ఈ గేమ్స్‌ కూడా ప్రేక్షకుల్లేకుండానే జరుగబోతున్నాయి.  రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులతో ఓవైపు ఆందోళన నెలకొంది. అందుకే ఒలింపిక్‌ విలేజి, వేదిక, శిక్షణ స్థలానికి తప్ప పారా అథ్లెట్లు మరెక్కడా తిరగడానికి అనుమతి లేదు. అలాగే వారి ఈవెంట్స్‌ ముగిసిన రెండు రోజుల్లోపే విలేజి వదిలి వెళ్లాల్సి ఉంటుంది.


ప్రారంభోత్సవంలో ఐదుగురు అథ్లెట్లు

ఆరంభ వేడుకల్లో భారత్‌ నుంచి ఐదుగురు అథ్లెట్లు, ఆరుగురు అధికారులు మాత్రమే పాల్గొంటున్నారు. అథ్లెట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. అయితే భారత్‌ నుంచి ఇప్పటివరకు ఏడుగురే టోక్యోకు చేరుకున్నారు. ఇందులో టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్స్‌ ఇద్దరికి బుధవారమే పోటీలు ఉండడంతో వారు వేడుకల్లో పాల్గొనడం లేదు. ఇక హైజంపర్‌ తంగవేలు త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించబోతున్నాడు.