కొండను.. కొల్లగొడుతున్నారు..!

ABN , First Publish Date - 2021-07-27T05:23:15+05:30 IST

గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగంగా గతంలో 10 కి.మీలు గండికోట ప్రధాన కాలువ, సర్వరాయసాగర్‌, వామికొండ జలాశయాల నిర్మాణాలు చేపట్టారు. 2005 మే 9న గమ్మన ఇండియా సంస్థ సర్వరాయసాగర్‌ జలాశయం నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.

కొండను.. కొల్లగొడుతున్నారు..!
వీఎన పల్లి మండలం ఇందుకూరులో ఎక్స్‌కవేటర్లతో టిప్పర్లకు ఎర్రమట్టి లోడింగ్‌

రోజూ 20 టిప్పర్లతో ఎర్రమట్టి అక్రమ రవాణా

రాయల్టీ చెల్లించకుండా ఖజానాకు భారీగా గండి

వైసీపీ కీలక నేత అండతో వ్యవహారం

కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులు

వీఎన పల్లి మండలం ఇందుకూరులో భాగోతం


ఆయన అధికార పార్టీ కీలక నాయకుడు. పదైదేళ్ల క్రితం సర్వరాయసాగర్‌ నిర్మాణం కోసం మట్టి తీసిన పొలాల్లో చేపల చెరువు నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఇక్కడి గుంతలను పూడ్చేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొండలు కొల్లగొడుతున్నారు. అక్రమంగా ఎర్రమట్టి మెక్కేస్తున్నారు. ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లతో లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తున్నారు. పశువుల మేతకు లేకుండా కొండను తవ్వేస్తున్నారు అడ్డుకోండని గ్రామస్తులు రెవిన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నేత మెక్కేస్తున్న మట్టి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. వీఎనపల్లి మండలం ఇందుకూరు గ్రామంలో జరుగుతున్న ఎర్రమట్టి అక్రమ రవాణా భాగోతంపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగంగా గతంలో 10 కి.మీలు  గండికోట ప్రధాన కాలువ, సర్వరాయసాగర్‌, వామికొండ జలాశయాల నిర్మాణాలు చేపట్టారు. 2005 మే 9న గమ్మన ఇండియా సంస్థ సర్వరాయసాగర్‌ జలాశయం నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి కావాల్సి రావడంతో ఆనాడు కాంట్రాక్ట్‌ సంస్థ రిజర్వాయర్‌ ఆనకట్ట మట్టికోసం రైతుల నుంచి దాదాపుగా 300 ఎకరాల పంట పొలాలు కొనుగోలు చేశారు. అవసరమైన మేరకు మట్టిని తోలుకున్నారు. ఆ పొలాలు గుంతల మయం అయ్యాయి. ఇది జరిగి దాదాపు 15 ఏళ్లు కావొస్తోంది. ప్రస్తుతం ఆ పొలాలకు మంచి ధర రావడంతో అధికార పార్టీ కీలక నేత కన్ను వాటిపై పడింది. అక్కడ సుమారుగా 80 ఎకరాల్లో చేపల చెరువు నిర్మాణానికి దిగారు. అయితే.. ఆ గుంతలు పూడ్చాలంటే లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టి కావాలి. అధికారం చేతిలో ఉంది.. అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు.. ఇంకేముందు ఇందుకూరు కొండలపై ఎక్స్‌కవేటర్లు వాలిపోయాయి.


కొండను కొల్లగొడుతున్నారు?

వీరపునాయునిపల్లి మండలం అనిమెల గ్రామం సమీప కొండల్లోనుంచి ఎక్స్‌కవేటర్లు పెట్టి రోజుకు 20-30 టిప్పర్లతో ఎర్రమట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. సుమారుగా రెండు నెలలుగా మట్టి అక్రమ చేపట్టారు. కళ్లముందే కొండ కరిగిపోతుంటే.. మూగజీవాలు, పశువులను ఎక్కడ మేపుకోవాలంటూ ఆ గ్రామస్తులు అడ్డుతిరిగారు. అప్పటికే ఆ కొండలో ఎర్రమట్టి దాదాపుగా అయిపోయింది. దీంతో ఆ నేత, అనుచరులు, వైసీపీ నాయకుల కళ్లు ఇందుకూరు కొండలపై పడ్డాయి. ఇప్పటికే చాలావరకు ప్రభుత్వ భూములు అధికార పార్టీ నాయకుల ఆక్రమణకు గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన కొండను చేపల చెరువు కోసం వైసీపీ నాయకుడు ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లతో అడ్డంగా తవ్వేస్తున్నారు. రోజూ 20-30 టిప్పర్లతో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ తతంగం 15-20 రోజులుగా సాగుతోంది. ఈ గ్రామంలో కూడా రైతులు తిరగబడ్డారు. ఐదు రోజులుగా మట్టితవ్వకాలు చేసే కొండ దగ్గర అడ్డుకుంటున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్న రైతులు, గ్రామస్తులను పంపించి వేస్తున్నారు. రెవిన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు అంటున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధియే అనుచరులను ముందు పెట్టి మట్టి అక్రమ తవ్వకాలు సాగిస్తుండడంతో అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి

గనులు, భూగర్భ వనరుల శాఖ నిబంధనల ప్రకారం ఎలాంటి మైనింగ్‌ చేయాలన్నా.. ముందుగా స్థానిక తహశీల్దారు ఎనఓసీ ఇవ్వాలి. ఆ ఎనఓసీ మేరకు లీజుదారుడు దరఖాస్తు చేసుకున్న విస్తీర్ణంలో మైనింగ్‌ చేసుకోవడానికి గనులు, భూగర్భ వనరుల శాఖ అనుమతి ఇస్తుంది. అనుమతిచ్చిన ప్రదేశంలోనే మైనింగ్‌ చేయాలి. మైనింగ్‌ లీజుతో పాటు తవ్విన ఎర్రమట్టికి క్యూబిక్‌ మీటరుకు రూ.65లు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 16 క్యూబిక్‌ మీటర్ల టిప్పరుకు సుమారు రూ.1,040 ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలి. ఇందుకూరులో రోజుకు 15-20కి పైగా టిప్పర్లతో ఎర్రమట్టి తోలుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఒక టిప్పరు రోజుకు సగటున 10-15 ట్రిప్పులకు పైగా తోలుతుందని అంచనా. రోజూ 250-300 ట్రిప్పలు తోలుతున్నట్లు సమాచారం. అనిమెల, ఇందుకూరు గ్రామాల్లో సుమారు 50 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టి అక్రమ తవ్వకాలు చేశారని అంచనా. బహిరంగంగా క్యూబిక్‌ మీటరు రూ.175-250 లకు పైగా విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రూ.1.25 కోట్ల విలువైన మట్టిన తరలించినట్లు తెలుస్తోంది. రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖాజానాకు రూ.35 లక్షలకు పైగా గండికొట్టినట్లు సమాచారం. రెవిన్యూ, మైనింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేస్తే భారీగా అక్రమ తవ్వకాల గుట్టు వెలుగులోకి వస్తుందని స్థానికులు అంటున్నారు. 


కలెక్టరుకు ఫిర్యాదు

మట్టితవ్వకాలను ఇందుకూరు గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. తవ్వకాలను ఆపాల్సిన పోలీసులు ఇక్కడ గొడవ వద్దని రైతులను పోలీస్‌ స్టేషన తీసుకెళ్లారు. అక్రమ తవ్వకాలపై తహశీల్దారు, ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. అక్కడ న్యాయం జరగదని భావించిన గ్రామస్తులు సోమవారం స్పందనలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా గనులు భూగర్భ వనరుల శాఖ ఏడీ వివరణ కోసం ఆంఽధ్రజ్యోతి ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


నేడు పరిశీలిస్తాం 

- మాధవీలత, ఇనచార్జి తహశీల్దారు, వీఎనపల్లి మండలం 

ఇందుకూరు గ్రామ సమీప కొండల్లో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేసిన మాట నిజమే. ప్రభుత్వం వారికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయితే.. రైతులు గుంతలు పూడ్చుకోవడానికి అంటే స్థానిక ప్రజాప్రతినిధి లేఖ ఇచ్చారు. నేడు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాం.



Updated Date - 2021-07-27T05:23:15+05:30 IST