రాజీ మార్గమే రాజమార్గం

ABN , First Publish Date - 2022-06-27T04:38:41+05:30 IST

లోక్‌అదాలత్‌ ద్వారా అన్ని రకాల కేసులను

రాజీ మార్గమే రాజమార్గం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భూపతి

  • జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి భూపతి 


రంగారెడ్డి , జూన్‌ 26: లోక్‌అదాలత్‌ ద్వారా అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని, రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్‌.కె.భూపతి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కోర్టులోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా భూపతి మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌ ద్వారా కేసుల పరిష్కారం చేసుకోవటం వల్ల సమయంతోపాటు డబ్బు ఆదా అవుతుందన్నారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం కాకుంటే పై కోర్టులకు అప్పీల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామాలలో నెలకొనే కుటుంబ, ఆస్తి తగాదాలు, చెక్‌ బౌన్స్‌ తదితర కేసులు లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కారానికి పారా లీగల్‌ వాలంటీర్లు సహాయపడాలని ఆయన సూచించారు. పోలీసులు కూడా లోక్‌అదాలత్‌కు సహకరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తిరుపతి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి, బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు జి.సుధాకర్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలి

ఆమనగల్లు : న్యాయ వ్యవస్థ, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాన కలిగి ఉండడం ద్వారా సత్వర న్యాయ పొందవచ్చునని ఆమనగల్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి సంపతిరావు చందన అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో ఆదివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. కార్యక్రమానికి జడ్జి సంపతిరావు చందన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌, మాడ్గుల సీఐ కృష్ణమోహన్‌, ఎస్‌ఐలు ధర్మేశ్‌, వరప్రసాద్‌, హరిశంకర్‌ గౌడ్‌, రమేశ్‌లు పాల్గొన్నారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల పోలీసుస్టేషన్ల పరిధిలో వివిధ కేసులకు సంబంధించిన కక్షిదారులు లోక్‌అదాలత్‌ రాజీ కోసం పెద్దఎత్తున తరలిరావడంతో కోర్టు పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జడ్జి సంపతిరావు చందన మాట్లాడుతూ యువత క్షణికావేశంలో వివాదాల్లో చిక్కుకుని భవిష్యత్తును, జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఒక్కసారి కేసు నమోదు అయితే ఉద్యోగానికి కూడా అర్హత కోల్పోతారని చెప్పారు. సివిల్‌ కేసులు, చిన్న చిన్న వివాదాలకు సంబందించి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్‌ అదాలత్‌ ఉపయోగపడుతుందన్నారు. సమాజ శ్రేయస్సును కాంక్షించి ప్రతిఒక్కరూ మంచి మార్గంలో నడవాలని, నేర ప్రవృత్తి జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, నేరస్థులు శిక్షల నుంచి తప్పించుకోలేరని జడ్జి చందన పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమన్నారు. న్యాయవాదులు కేసులు గెలవడమే విజయంగా భావించకూడదని, ఇరువర్గాలను రాజీ కుదుర్చడమే గొప్ప విజయంగా భావించాలన్నారు. కోర్టుల్లో కేసులు ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, చిన్న తగదాలకు సంబంధించి కక్షలు పెంచుకోకుండా ఇరువురు రాజీపడి పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిందం కృష్ణయ్య, ఏపీపీవో కార్తీక్‌, న్యాయవాదులు లక్ష్మణ శర్మ, భాస్కర్‌రెడ్డి, దుడ్డు ఆంజనేయులు, రామకృష్ణ, ఎర్రవోలు శేఖర్‌, మధు, తదితరులు పాల్గొన్నారు. 


లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి 

షాద్‌నగర్‌ : సత్వర న్యాయం కోసం లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని 9వ అడిషనల్‌ జిల్లా జడ్జి హరీష సూచించారు. ఆదివారం షాద్‌నగర్‌ కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రారంభించి 240 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వివిధ కోర్టు కేసులకు సంబంధించి కోర్టు చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు లోక్‌అదాలత్‌ ద్వారా సత్వర న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా కోర్టుల చుట్టూ తిరిగే బాధతోపాటు ఖర్చులూ తగ్గుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ ప్రిన్సిపల్‌ జడ్జి ఆశారాణి, అదనపు మున్సిఫ్‌ మెజిస్ర్టేట్‌ సీహెచ్‌ రాజ్యలక్ష్మి, 14వ మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌ ఖాజా నసీరొద్దీన్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి, లోక్‌అదాలత్‌ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.    



Updated Date - 2022-06-27T04:38:41+05:30 IST