దాచిన డబ్బు

ABN , First Publish Date - 2020-02-10T06:36:58+05:30 IST

ఒకరోజు తెనాలి రామకృష్ణుడు పనిమీద పొరుగూరికి బయలుదేరాడు. ఆ ఊరికి చేరాలంటే మధ్యలో చిన్న అడవి దాటాల్సి ఉంటుంది. రామకృష్ణుడు ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉండగా

దాచిన డబ్బు

ఒకరోజు తెనాలి రామకృష్ణుడు పనిమీద పొరుగూరికి బయలుదేరాడు. ఆ ఊరికి చేరాలంటే మధ్యలో చిన్న అడవి దాటాల్సి ఉంటుంది. రామకృష్ణుడు ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి కలిశాడు. నేనూ అదే ఊరికి వెళుతున్నాను అంటూ మాటలు కలిపాడు. ‘‘ఈ దారి వెంట దొంగలుంటారు. నేనూ నీతో కలిసి నడుస్తాను. కాస్త నాకు ధైర్యంగా ఉంటుంది’’ అని రామకృష్ణుడిని అడిగాడు. అందుకు ఆయన సరేనన్నాడు. చీకటి పడుతుండడంతో ఇద్దరూ ఒకచోట ఆగి విశ్రమించారు. రామకృష్ణుడు బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రపోయాడు.


సరిగ్గా అదే సమయం కోసం వేచి చూస్తున్నాడు ఆ వ్యక్తి. నిజానికి అతడు రామకృష్ణుడి దగ్గర ఉన్న బంగారం, డబ్బు దోచుకోవడానికి వచ్చాడు. ఆయన నిద్రపోగానే డబ్బులు ఎక్కడున్నాయో వెతకడం మొదలుపెట్టాడు. ఎంతవెతికినా ఒక్కపైసా దొరకలేదు. మరుసటి ఉదయం ఇద్దరూ మళ్లీ నడక ప్రారంభించి ఊరికి చేరుకున్నారు. ఇక ఉండబట్టలేక ఆ దొంగ ‘‘నేను ఎప్పుడూ విఫలం కాలేదు. కానీ ఇప్పుడు విఫలమయ్యాను. దయచేసి డబ్బులు ఎక్కడ దాచావో చెప్పు!’’ అని రామకృష్ణుడిని వేడుకున్నాడు. అప్పుడు ఆయన చిన్నగా నవ్వి ‘‘నువ్వు దొంగవన్న విషయం నాకు తెలుసు. అందుకే నా డబ్బును జాగ్రత్తగా దాచుకున్నాను’’ అని అన్నాడు.


‘‘ఎక్కడ దాచావు? నేను అంతటా వెతికాను. ఎక్కడా దొరకలేదు’’ అని అడిగాడు దొంగ.

‘‘దిండు కింద చూశావా?’’ అని అడిగాడు రామకృష్ణుడు.

‘‘నీ దిండు కింద చూశాను. ఏమీ దొరకలేదు. నా దిండు కింద చూడాల్సిన అవసరం లేదు కదా!’’ అని ఎదురు ప్రశ్నించాడు దొంగ.

‘‘అందుకే నేను నీ దిండు కిందే డబ్బు దాచాను. అక్కడైతేనే భద్రంగా ఉంటుందని నాకు తెలుసు’’ అన్నాడు రామకృష్ణుడు.

Updated Date - 2020-02-10T06:36:58+05:30 IST